బాల కార్మికులతో వెట్టిచాకిరీ

– కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి
– వలస కార్మిక చట్టాన్ని అమలు చేయాలి
– పారిశ్రామిక ప్రాంత కార్మికుల సమస్యలపై జీపుజాతాలో..
– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్‌, భూపాల్‌
నవతెలంగాణ -చేగుంట/ తూప్రాన్‌ రూరల్‌/ మనోహరాబాద్‌
పారిశ్రామిక రంగాల్లో బాల కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తూ కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం చట్టాలను అమలుచేస్తూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, జే.మల్లికార్జున్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్‌లో కనీస వేతనాలు సవరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 4న బయలుదేరిన జీపుజాత ఆదివారం మనోహరాబాద్‌ మండలంలోని కాళ్లకల్‌, ముప్పిరెడ్డిపల్లి, కూచారం, చేగుంట పారిశ్రామిక ప్రాంతాల్లో పర్యటించింది. సాగర్‌ ఏషియా యూనిట్‌ 2, మహాలక్ష్మి, గ్లోబల్‌, గ్లోస్టర్‌, కాలకల్‌ ఫౌండ్రి, ఇన్ఫ్రాటెక్‌, పరిశ్రమల దగ్గర, చేగుంటలో నిర్వహించిన సభల్లో భూపాల్‌, మల్లికార్జున్‌ కార్మికులను ఉద్దేశించి మాట్లా డారు. ప్రభుత్వాలు కార్మికుల పొట్టకొట్టి బడా బాబులను పెంచి పోషిస్తున్నాయని విమర్శించారు. పారిశ్రామిక రంగ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరగడం లేదన్నారు. చాలా కంపెనీల్లో బాల కార్మికులతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపించారు. 2014 నుంచి కనీస వేతనాన్ని అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులు ఈఎస్‌ఐ, పీఎఫ్‌, సెలవులు, ఓటి డబల్‌ వేతనం, యూనిఫామ్‌, బూట్లు, క్యాంటీన్‌ ప్రమాదం తర్వాత ఆదుకోవడం తదితర సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మహాలక్ష్మి, గ్లోస్టర్‌, గ్లోబల్‌, సాగరేసియా, కాలకల్‌ ఫౌండ్రి, బీహార్‌, ఒడిశా, ఇతర రాష్ట్రాల కార్మికులకు సరైన సేఫ్టీ పరికరాలు ఇవ్వకుండా 12 గంటల పనులు చేయిస్తున్నారని చెప్పారు. వలస కార్మికులనైతే కంపెనీల ఆవరణలో చిన్న చిన్న గదుల్లో 10 నుంచి 15 మందిని పెట్టి, కనీస సౌకర్యాలు లేకుండా బానిసల మాదిరిగా గొడ్డు చాకిరీ చేయించుకుంటు న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అనువైన ప్రదేశాల్లో ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. వలస కార్మికుల చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ.మల్లేశం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 73 షెడ్యూల్డ్‌ ఎంప్లాయిమెంట్‌లో కనీస వేతనాలు వెంటనే సవరించాలని కోరారు. ఐదు రంగాలకు చెందిన ఫైనల్‌ నోటిఫికేషన్‌ జీవో నెంబర్లు 21 ,22, 23, 24, 25ను గెజిటెడ్‌ చేయాలన్నారు. పెరుగుతున్న శాస్త్ర సాంకేతికత దృష్ట్యా రోజుకు 7 గంటలు, వారానికి ఐదు రోజుల పని దినం ఉండాలన్నారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు చట్టబద్ధత సౌకర్యాలు పీఎఫ్‌, ఈఎస్‌ఐ, సెలవులు, బోనస్‌, గ్రాట్యూటీ అమలు చేయాలన్నారు. 1979 అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం ప్రకారం హక్కులు, సౌకర్యాలు అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా వలస కార్మికులు ఉంటున్న ప్రదేశాలు, గదులను పరిశీలించారు. విద్యుత్‌ నీటి సౌకర్యం, వాష్‌ రూమ్‌, ఎలాంటి సౌకర్యాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై ఈనెల 14న జిల్లా కలెక్టరేట్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులను, జిల్లా అధ్యక్షులను, అపోలో కార్మికులు సన్మానం చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి. బస్వరాజ్‌, అధ్యక్షులు ఏ. మహేందర్‌ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బి. బాలమణి, అపోలో ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు గడ్డమీది రామస్వామి, సతీష్‌ గౌడ్‌, గ్రామపంచాయతీ జిల్లా కార్యదర్శి ఆసిఫ్‌, స్వామి, రాములు, వీరేష్‌, సుగుణ ప్రధాన కార్యదర్శి యాదగిరి, ఇండస్మేడ్‌ కేర్‌ ప్రధాన కార్యదర్శి బాలేష్‌, పారిశ్రామిక కార్మికులు, గ్రామపంచాయతీ సఫాయి కార్మికులు, పాల్గొన్నారు.

Spread the love