గురుకులంలో కనీస సౌకర్యాలు లేవంటూ..

– డోర్నకల్‌ మైనార్టీ పాఠశాల ముందు తల్లిదండ్రుల ధర్నా
– మైనార్టీ బోర్డు నాయకునిపై దాడి
నవతెలంగాణ-మహబూబాబాద్‌
మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థినీలకు సరైన వసతులు లేవంటూ విద్యార్థినుల తల్లిదండ్రులు ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తల్లిదండ్రులను సముదాయించేందుకు వచ్చిన మైనార్టీ సంక్షేమ సంఘం నాయకులు అఖిల్‌ కాన్‌పై తల్లిదండ్రులు దాడి చేశారు. తల్లిదండ్రులు, విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండేండ్లుగా డోర్నకల్‌లో కనీస సౌకర్యాలు, భవన వసతి లేదంటూ డోర్నకల్‌ నియోజకవర్గంలోని కొరివి మండల కేంద్రంలో పాఠశాల కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆ పాఠశాలను డోర్నకల్‌ మండల కేంద్రంలోని ప్రయివేటు భవనానికి మార్చారు. జూన్‌ 12వ తేదీన పాఠశాల ప్రారంభమైంది. అయితే, 500 మంది విద్యార్థినులు ఉన్న హాస్టల్‌లో ఐదు బాత్‌రూమ్‌లు మాత్రమే ఉన్నాయని, అవి ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. అంతేకాకుండా త్రాగునీరు సక్రమంగా లేదని, విద్యార్థులకు స్నానాలకు సరిపోయేంతగా నీళ్లు రావడంలేదని, మోటార్లు పనిచేయడం లేదని, భోజనం సరిగ్గా ఉండటం లేక తమ పిల్లలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం తమ పిల్లలను చూడటానికి వస్తే తమకు మంచినీళ్లు లేవని, బాటిళ్లు కొనుక్కురమ్మని చెప్పడం తమ హృదయాలను కలిచివేసిందని వాపోయారు. మైనార్టీ సంక్షేమ సంఘం కమిటీ సభ్యుడైన అఖిల్‌, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తో పాటు కొందరు అధికారపార్టీ నేతల రాజకీయ ఒత్తిళ్లతోనే పాఠశాలను డోర్నకల్‌కు తరలించి పిల్లల భవిష్యత్తులో ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొరవిలో అన్ని హంగులతో సౌకర్యవంతంగా ఉందని, ఇప్పటికైనా కొరివికి పాఠశాలను తరలించాలని డిమాండ్‌ చేశారు.కాగా, తల్లిదండ్రుల ఆందోళన సమయంలో ప్రిన్సిపాల్‌ పుష్పజా రెడ్డి అందుబాటులో లేకపోవడంతో మైనార్టీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ సభ్యులు అఖిల్‌ ఖాన్‌ పాఠశాలకు రాగా, అతని ద్విచక్ర వాహనం తాళం చెవి, సెల్‌ఫోన్‌ లాక్కొని అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన విషయం తెలసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని తల్లిదండ్రులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రిన్సిపల్‌ పద్మజా రెడ్డి హాస్టల్‌కు చేరుకున్నారు. ఇదే క్రమంలో వరంగల్‌కు చెందిన విజిలెన్స్‌ అధికారులు అంజద్‌ పాషా, మక్బూల్‌ ఆశ పాఠశాలకు చేరుకున్నారు. కాగా, ఈ మొత్తం ఘటనకు ప్రిన్సిపాల్‌ బాధ్యతా రహిత్యమే కారణమని మున్సిపల్‌ చైర్మెన్‌ వాంకుడోత్‌ వీరన్న అధికారులకు ఫిర్యాదు చేశారు. కొరవి నుంచి డోర్నకల్‌కు పాఠశాలను తరలించడం ప్రిన్సిపాల్‌కి ఇష్టం లేదని, అం దుకే తల్లిదండ్రుల చేత ఆందోళన చేపిస్తుందని ఆరోపించారు. ఈ మేరకు డోర్నకల్‌కు చెందిన మైనార్టీ నాయకులంతా సంఘటన స్థలానికి వచ్చి ఆందోళన చేశారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీ సులు సంఘటన స్థలంలో పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

Spread the love