ఫార్మాసిటీ భూ సేకరణలో అవినీతి

–  2013 భూ చట్టానికి విరుద్ధంగా భూ సేకరణ
– కంపెనీలతో ఈ ప్రాంతం సర్వనాశనం
– వెంటనే ఫార్మాసిటీ ఏర్పాటును విరమించుకోవాలి :టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం
– కుర్మిద్ధ నుంచి చింతపట్ల వరకు చెరువుల పరిశీలన
నవతెలంగాణ-యాచారం
ఫార్మాసిటీ భూ సేకరణలో అవినీతి జరిగిందని టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం ఆరోపించారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్ధ నుంచి ‘ఫార్మాసిటీ హటావో తెలంగాణ బచ్చావో’ అంశంపై తాడిపర్తి, నానక్‌నగర్‌, మేడిపల్లి, తక్కల్లపల్లి, చింతపట్ల చెరువులను పరిశీలించారు. ఫార్మాతో జరగబోయే ప్రమాదాన్ని అంచనా వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ.. రైతుల భూమిని టీఎస్‌ఐఐసీ పేరుమీద మార్చుకోవడం దుర్మార్గమన్నారు. 2013 భూ చట్టానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం విచ్చలవిడిగా భూసేకరణ చేపట్టిందని తెలిపారు. 2013 భూ సేకరణ చట్టం నిబంధనలను గౌరవించకుండా స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నిజమైన లబ్దిదారులకు ఇప్పటి వరకు ఫార్మా పరిహారం అందలేదని అన్నారు. ఫార్మాసిటీలో వచ్చే కంపెనీలతో ఈ ప్రాంతం మొత్తం సర్వనాశనం అవుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో విపరీతమైన కాలుష్య భరితంగా మారి, భవిష్యత్తు తరాలకు, పర్యావరణానికి పెను ప్రమాదం రానుందని హెచ్చరించారు. ఫార్మాసిటీతో గొలుసుకట్టు చెరువులు, కుంటలు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్2013 భూ చట్టానికి విరుద్ధంగా భూ సేకరణనారు. ఫార్మా కంపెనీలు విసర్జించే విషపూరితమైన రసాయనాలతో గాలి, నీరు, నేల పూర్తిగా కలుషితమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఫార్మాసిటీని రద్దు చేసే వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండరెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజవర్గ కాంగ్రెస్‌ నాయకులు మర్రి నిరంజన్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు లిక్కి పాండురంగారెడ్డి, సర్పంచ్లు దంతుక పెద్దయ్య, బందే రాజశేఖర్‌రెడ్డి, దోస రమేష్‌, ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట సమితి నాయకులు దార సత్యం, కౌవుల సరస్వతి, కనమొని గణేష్‌, శ్రీకాంత్‌ నాయక్‌, వెంకటేష్‌, కమలాకర్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి, స్థానిక నాయకులు, యుగంధర్‌రెడ్డి, గడ్డం యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

Spread the love