ఐసీడీఎస్‌కు బడ్జెట్‌ పెంచాలి

– అంగన్‌వాడీ టీచర్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి
– సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌
నవతెలంగాణ-మహేశ్వరం
ఐసీడీఎస్‌కు బడ్జెట్‌ పెంచకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించడానికి అంగన్‌వాడీలు సిద్ధమని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, అంగన్‌వాడీ టీచర్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి స్పష్టంచేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో జరిగిన జీపు జాత ముగింపు సభలో వారు మాట్లాడారు. ఐసీడీఎస్‌కు బడ్జెట్లో కేటాయింపులు తగ్గడంతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్‌వాడీలు, లబ్దిదారులు నష్టపోతున్నారన్నారు. అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, వారికి అన్ని సదుపాయాలు కల్పించాల్సిన ప్రభుత్వాలు.. ఉద్యోగ భద్రతకు ప్రమాదం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కార్మికులకు కనీస చట్టబద్ద హక్కులు, ఈఎస్‌ఐ, పీఎఫ్‌, గ్రాడ్యూటీ, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వడం లేదని విమర్శించారు. 13 ఏండ్ల క్రితం ఇండియన్‌ లేబర్‌ కాన్ఫరెన్స్‌ సిఫారసు చేసిన.. కనీస వేతనం ప్రతిపాదననూ అమలు చేయడం లేద న్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో గ్రాడ్యు టీ ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్నేండ్లుగా బడ్జెట్లో కేటాయింపులు తగ్గిస్తుండటం తోనే, నేడు 60 శాతం నిధులతో ఐసీడీఎస్‌ అనేక సమస్యలతో సతమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పెరిగిపోతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీతాలు పెంచలేదన్నారు. 2018లో టీచర్లకు రూ.1500, హెల్పర్లకు రూ.750, మినీ వర్కర్లకు రూ.1250 పెంచాలని కోరినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాధ్యం కాదంటున్నాయని తెలిపారు. నూతన విద్యావిధానం వల్ల ఐసీడీఎస్‌ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఐసీడీఎస్‌కు బడ్జెట్‌ కేటాయించి, అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిం చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్‌, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజు, చంద్రమోహన్‌, అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు రాజ్యలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి కవిత, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్‌, కిషన్‌, జగదీష్‌, రుద్రకుమార్‌, సాయిబాబు, జిల్లా సహాయ కార్యదర్శి స్వప్న, జిల్లా కమిటీ సభ్యులు శేఖర్‌, బాలరాజ్‌, పోచంనేని కృష్ణ, బుగ్గ రాములు, కె.కృష్ణ, సీహెచ్‌ ఎల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love