13 వేలతో ఎట్ల బతకాలో చెప్పండి

– జీవో 21 గెజిట్‌ చేసి రూ.27వేల వేతనం ఇవ్వాలి ?
– ధరలు పెరిగేలా చేస్తున్న పాలకులకు జీతాలు పెంచాలనే సోయి లేదా?
– మార్కెట్‌ యార్డుల సెక్యూరిటీ గార్డులను పర్మినెంట్‌ చేయాలి : యూనియన్‌ ధర్నాలో పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కార్మికులకు, చిరుద్యోగులకు జీతాలు పెంచాలనే సోయిలేదా? చేతికొచ్చే రూ.13 వేల జీతంతో ఎట్ల బతకాలో చెప్పండి? అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ ప్రశ్నించారు. కనీస వేతనాల జీవో 21ని వెంటనే గెజిట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అంజయ్య భవన్‌(కార్మిక శాఖ కమిషనరేట్‌) ఎదుట మార్కెట్‌ సెక్యూరిటీ గార్డులు ధర్నా చేశారు. జేసీఎల్‌ చంద్రశేఖరానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి మార్కెట్‌ సెక్యూరిటీ గార్డుల యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాటల సోమన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భాస్కర్‌ మాట్లాడుతూ..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులు, చట్టాల మీద దాడి చేస్తున్నదనీ, అదే దారిలో రాష్ట్ర ప్రభుత్వమూ ప్రయాణిస్తున్నదని విమర్శించారు. నిత్యావసరాల ధరలు, జీవన వ్యయాలు పెరిగాయని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీఎం కేసీఆర్‌ జీతాలు పెరచుకున్నారని విమర్శించారు. అదే సమయంలో కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలన్నా బుద్ధి ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. షాపులోకి పోయి టమాటలు కొంటే ఎమ్మెల్యే కాబట్టి ఎక్కువ ధర, కూలోడు కాబట్టి తక్కువ ధరకు ఇస్తారా? ఇద్దరికీ ఇచ్చే రేటు ఒకటే కదా? అలాంటప్పుడు రూ.13 వేల జీతంతో సెక్యూరిటీ గార్డులు ఎట్ట బతుకతరు? జీవో విడుదల చేస్తే ప్రభుత్వ సొమ్మేం పోదుకదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. జీవో జారీ చేసిన తేదీ నుంచీ మార్కెట్‌ సెక్యూరిటీ గార్డులకు ఎరియల్స్‌ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు ఉన్నట్టుగానే మార్కెట్‌ సెక్యూరిటీ గార్డులకూ వెల్ఫేర్‌ బోర్డును ఏర్పాటు చేయాలనీ, గతంలో ఇచ్చిన హామీ మేరకు మార్కెట్‌ యార్డుల్లో స్థలమిచ్చి ఇల్లు కట్టివ్వాలని కోరారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. మార్కెట్‌ సెక్యూరిటీ గార్డుల యూనియన్‌ గౌరవాధ్యక్షులు వంగూరు రాములు మాట్లాడుతూ..ఐదేండ్ల కోసారి సవరించాల్సిన కనీసవేతనాల జీవోలను పదేండ్లు దాటినా ఎందుకు సవరించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సుమారు 180 వ్యవసాయ మార్కెట్లలో 28 ఏండ్ల నుంచి కాంట్రాక్ట్‌,ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన మార్కెట్‌ యార్డుల్లో, చెక్‌పోస్టులలో సెక్యూరిటీ గార్డులుగా సుమారు 1,200 మంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. వారిని ఎందుకు పర్మినెంట్‌ చేయడం లేదని ప్రశ్నించారు. జీవితాంతం అదే పద్ధతిలో పనిచేయాలా? అని నిలదీశారు. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా కనీస వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు.
ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తుమ్మల సాంబయ్య, యాటల సోమన్న మాట్లాడుతూ…ఏజెన్సీలు జీతాల్లో, పీఎఫ్‌ చెల్లింపుల్లో కోతలు పెడుతున్నాయనీ, దీనివల్ల సెక్యూరిటీ గార్డులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. నేరుగా మార్కెట్‌ కమిటీల నుంచే వేతనాలు, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆ యూనియన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సారిక రాము, కోశాధికారి టి. జనార్ధన్‌, ఉపాధ్యక్షులు జి. లక్ష్మణ్‌, వెంకట నారాయణ, పి. రాము, మహమూద్‌, మహేందర్‌ రెడ్డి, సభ్యులు వెంకటేష్‌, ఎండి. యాకూబ్‌, ముత్తయ్య, ఎం. యాకయ్య, ఎం. భాస్కర్‌, లక్ష్మయ్య, నర్సయ్య, చంటన్న, శ్రీను, నర్సోజి, రమణ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love