– మంచినీరు కోసం బావి పూడిక తీసిన గ్రామస్తులు
– జైనుర్ మండలం పట్నపూర్ వాసుల ఐక్యత
నవతెలంగాణ- జైనుర్
ఎవరి కోసం ఎదురు చూడకుండా తమ ప్రాంతంలో ఉన్న మంచినీటి సమస్యను సొంతంగా పరిష్కరించుకునేందుకు ఆ ఊరు గ్రామస్తులు నడుం బిగించారు. భగీరథ ప్రయత్నమే చేశారు. ఊరిలో ఉన్న పెద్దబావిలో పూడిక తీశారు. కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నపూర్ గ్రామంలో మంచి నీటి సమస్యతో గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. ఒకవైపు ఎండలు, మరోవైపు మంచినీరు వచ్చే ప్రత్యామ్నాయ మార్గాలు లేవని గ్రామస్తులు అంటున్నారు. మూగజీవాలకు నీరు కరువు ఏర్పడింది. అందరికీ బావి నీరే దిక్కు.దీంతో సిద్దేశ్వర్ యూత్, పట్నపూర్ యువత ఒక్కటై గ్రామానికి కిలో మీటర్ దూరంలో ఉన్న మంచి నీటి భావిలో నీరు అడుగున చేరడంతో పూడిక తీశారు. మంచి నీరు వచ్చే భావి పూడిక తీసి ఆదర్శంగా నిలిచారు. గ్రామ సర్పంచ్ ఖండరే బాలాజీ గ్రామ పటేల్ హన్మంతరావు లింగు దంబి పటేల్ పవన్ పట్నపూర్ సిద్దేశ్వర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.