కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి

– 4 లేబర్‌ కోడ్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలి
– జీపు జాతా ప్రారంభోత్సవంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో కార్మికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా వారికి కనీస వేతనాలు అమలు కావడం లేదని, ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కార్మికులకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య అన్నారు. షెడ్యూల్‌ ఎంప్లాయిమెంట్స్‌లో కనీస వేతనాలు సవరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన జీపుజాతాను.. రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌ చౌరస్తాలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.వీరయ్య జెండా ఊపి మంగళవారం ప్రారంభించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, మల్లిఖార్జున్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర బృందం ఈ జీపుజాతాకు నాయకత్వం వహిస్తోంది. కాటేదాన్‌ నుంచి కొత్తూరు, షాద్‌నగర్‌ మీదుగా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల వరకు మొదటి రోజు జీపుజాతా కొనసాగింది. ఈ సందర్భంగా కాటేదాన్‌లో నిర్వహించిన సభలో వీరయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో 73 షెడ్యూల్‌ ఎంప్లాయిమెంట్స్‌లో పనిచేస్తున్న కార్మికులకు 15 ఏండ్ల నుంచి వేతనాలు సవరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఐదేండ్లకోకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా చట్టబద్ధంగా ప్రభుత్వం వేతనాలు సవరించాల్సి ఉన్నా.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం పెంచకపోవడం బాధాకరం అన్నారు. 2021 జూన్‌లో ఐదు రంగాలకు కనీస వేతనం రూ.18వేలు నిర్ణయించినా ఉన్నత అధికారులు ఇచ్చిన ఫైనల్‌ నోటిఫికేషన్లను కూడా యాజమాన్యాల ఒత్తిడికి లొంగి గెజిట్‌ చేయకుండా ముఖ్యమంత్రి కార్యాలయం అడ్డుకుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు మూడుసార్లు కనీస వేతన సలహా మండలి ఏర్పాటు చేసి కాలయాపన చేస్తుందే తప్పా కార్మికులకు ఎలాంటి న్యాయం చేయడం లేదన్నారు. కార్మికులు పోరాడి తెచ్చుకున్న కార్మిక చట్టాలనూ మోడీ ప్రభుత్వం కాలరాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పెట్టుబడిదారులకు, బడా కాంట్రాక్టర్లకు ఈ ప్రభుత్వాలు కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కనీస వేతనాల జీవో కూడా యాజమాన్యాలకు అనుకూలంగా ఉందన్నారు. కార్మికులకు కనీస వేతనాలు పెంచే వరకూ తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. అనంతరం భూపాల్‌, మల్లికార్జున్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు పెరిగాయే కానీ కార్మికుల జీతాలు మాత్రం పెరగడం లేదన్నారు. కార్మికులతో 12 గంటలు వెట్టి చాకిరి చేయించుకొని యాజమా న్యాలు వారికి కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వలస కార్మికులు ఎక్కువగా పని చేస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో కాంట్రాక్ట్‌ లేబర్‌ యాక్ట్‌ 1979, అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టం అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న శాస్త్ర సాంకేతికతతో రోజుకు ఏడు గంటలు, వారానికి ఐదు రోజుల పని దినాలు ఉండాలని డిమాండ్‌ చేశారు. జులై 4 నుంచి 13 వరకు జరిగే జీపు జాతాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 17న అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట జరిగే పికెటింగ్‌లో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్‌, జిల్లా కమిటీ సభ్యులు రమేష్‌, రుద్ర కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love