గుడిసెలపై విధ్వంసం

— 8గంటల పాటు కొనసాగిన దమనకాండ
– యూనిఫాం శాఖల ముకుమ్మడి దాడి
– తాగునీటి వనరులు ధ్వంసం

– వంట పాత్రలు, ఇంటి సామాన్లు చెల్లాచెదురు
– మహిళలను అడ్డగించిన పోలీసులు

– తోపులాట… ఉద్రిక్తత
– అధికార యంత్రాంగం కక్ష సాధింపు

– పేదలపై దాడి అమానుషం :సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య
పొద్దు పొడవక ముందే.. తెల్లవారకముందే… పక్షులు గూడు వీడుతున్న వేళ ..ఉరుములేని పిడుగు లాగా పోలీస్‌ యంత్రాంగం పేదల గుడిసెలపై విధ్వంసం సృష్టించింది. కండ్లు మూసి తెరిచేలోగా గుడిసెలు నేలమట్టం అయ్యాయి. గుడిసెలను ప్రోక్లైన్లు, బుల్‌డోజర్లతో తొలగించారు. మున్సిపాలిటీ ట్రాక్టర్లతో సామాగ్రిని బయటపడేశారు. ఆరు శాఖల అధికారుల మూకుమ్మడి దాడికి పేదలు తల్లడిల్లిపోయారు. మహిళలు శక్తికి మించి ప్రతిఘటించినా పోలీసులు దాడులు ఆపలేదు. దాడికి కొందరు పేదలు సొమ్మసిల్లి పడిపోయారు. 8గంటల పాటు కొనసాగిన ఈ విధ్వంసం అందరిని విస్మయపర్చింది. ఇది మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది.
నవతెలంగాణ-మహబూబాబాద్‌
మహబూబాబాద్‌ పట్టణంలోని కురవి రహదారిని ఆనుకుని ఉన్న సర్వే నెంబర్‌255 /1లోని 200 ఎకరాల ప్రభుత్వ భూమిలో సుమారు 20 ఎకరాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పేదలు గుడిసెలు వేసుకున్నారు. నాలుగు నెలల క్రితం వివిధ ప్రాంతాల నుంచి మానుకోట జిల్లా కేంద్రానికి పొట్ట చేత పట్టుకొని వలస వచ్చి కూలీలు, హమాలీ, రిక్షా, భవన నిర్మాణ కార్మికులుగా కాయ కష్టం చేసుకుంటూ బతు కీడుస్తున్న పేదలంతా కలిసి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఎర్రజెండా నీడలో గుడిసెలు వేసుకున్నారు. అడవిలో దొరికే కర్రలతో టార్ఫాలిన్లు కప్పుకొని బతుకీడిస్తున్నారు. అక్కడే ఉంటున్నారు. తొమ్మిదేండ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్‌ గృహాలు ఇస్తాయని, ఇండ్లు కట్టిస్తాయని ఆనుకుంటే ఆశలు అడియాశలు అయ్యాయి. దిక్కులేని పరిస్థితుల్లో ప్రభుత్వ భూమిలో 60 నుంచి 70 గజాల స్థలంలో గుడిసె వేసుకొని నివసిస్తున్నారు. ఇందులో కొంత భూమిని గతంలో రియల్‌ వ్యాపారులు చదును చేసి మట్టి పోసి రోడ్లు వేసి అమ్ముకునే ప్రయత్నం మొదలుపెట్టారు. వారికి ప్రజా ప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో గుడిసెలు వేసుకున్న పేదలకు తరచూ అడ్డంకులు సృష్టిస్తూ వచ్చారు. ఇప్పటికే వారిపై మూడుసార్లు పోలీసులు లాఠీచార్జి చేశారు. 150 మందిపై కేసులు నమోదు చేశారు.
ఈ సారి మంగళవారం వేకువజామున జిల్లా అధికార యంత్రాంగం పక్కావ్యూహంతోనే పేదల గుడిసెల కూల్చివేతకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో ఒకవైపు దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. మంగళవారం ప్రత్యేకంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిపేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయినా మానుకోట అధికారం యంత్రాంగం మహిళలు వేసుకున్న గుడిసెలను తొలగించడం గమనార్హం. పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు తహసిల్దార్‌ ఇమ్మానుయేల్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్నారాణి, సీఐ సతీష్‌, ఎక్సైజ్‌, ఆర్టీవో, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సుమారు 800మంది వచ్చి గుడిసెలపై విధ్వంసానికి పాల్పడ్డారు. గుడిసెల్లోనికి పోలీస్‌ యంత్రాంగం పోనీయకుండా మహిళలు ప్రతిఘటించారు. సుమారు గంటసేపు ఇరువు వర్గాల మధ్య తోపులాట, ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాగ్వివాదం జరిగింది. అన్ని శాఖల అధికారులు వచ్చి బలవంతంగా మహిళలను పురుషులను లాగిపడేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండు ప్రోక్లైన్లు, నాలుగు బుల్‌డోజర్లు, 6 ట్రాక్టర్లను గుడిసెల తొలగింపునకు ఉపయోగించారు. మధ్యాహ్నం వరకు రెవెన్యూ, మున్సిపల్‌ అధికారుల సమక్షంలోనే గుడిసెల నేలమట్టం జరిగింది. అడ్డుకున్న మహిళలను, పిల్లలను, వృద్ధులను పక్కకు లాగి పడేశారు. ఈ క్రమంలో గుడిసె వాసుల వంట సామాగ్రి, మంచాలు దుప్పట్లు చల్లా చెదురయ్యాయి. తోపులాటలో కొంతమంది కింద పడిపోయి అస్వస్థతకు గురయ్యారు. ఫోన్లను కూడా అధికారులు లాక్కున్నారు. తాగునీటి అవసరాల కోసం తొవ్వుకున్న తాగునీటి బావులను, చెలిమెలను బుల్‌డోజర్లతో మూసివేయించారు. పేదలను భయభ్రాంతులకు గురి చేశారు. మీరు ఎన్నిసార్లు గుడిసెలు వేసినా తొలగిస్తామని హెచ్చరించారు అవసరమైతే భాష్ప వాయువులు, వాటర్‌ క్యాన్లు ప్రయోగిస్తామని హెచ్చరించారు. సెంటు భూమి కూడా పేదలకు దక్కనీయమని హెచ్చరించారు. పేదలు మాత్రం భూమిని వదిలేది లేదంటూ ఎక్కడికి అక్కడ పిల్లలు, వృద్ధులతో చెట్ల కింద బైఠాయించారు.
దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న వేళ పేదలపై దాడులా : సీపీఐ(ఎం) ఆగ్రహం
జిల్లాలో దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సమయంలో అధికారం యంత్రాంగం మహిళలు వేసుకున్న గుడిసెలను కూల్చివేయడం దారుణమని సీపీఐ(ఎం) ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదల గుడిసెల కూల్చివేతను సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు జి నాగయ్య జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సుర్ణపు సోమయ్య, గునిగంటి రాజన్న, అల్వాల వీరయ్య, సమ్మెట రాజమౌళి తీవ్రంగా ఖండించారు. పేదల గుడిసెలు తొలగింపు అమానుషమని, అక్రమం అని విలేకరుల సమావేశంలో నాగయ్య విమర్శించారు. జిల్లా కలెక్టర్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీలైన పేదలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని విమర్శించారు. పేదలకు అండగా ఉండాల్సిన అధికారులు రియల్‌ ఎస్టేట్‌ మాఫియాకు మద్దతు ఇవ్వడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి, ఎమ్మెల్యే అండదండలతోనే రియల్‌ఎస్టేట్‌ మాఫియా రెచ్చిపోతోందని అన్నారు. పేదల గుడిసెలు తొలగింపునకు ఆదేశించిన ప్రజాప్రతినిధులకు భవిష్యత్తు లేదని, ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదని హెచ్చరించారు.

Spread the love