కమ్యూనిస్టులతో కయ్యం వద్దు

– మీరో మేమో తేల్చుకుంటాం
– ‘స్లమ్స్‌’ అనడానికి సిగ్గు అనిపించడం లేదా?
– కబ్జాకోరులను వదిలిపెట్టి..పేదలపై కేసులా?
– ఇండ్లులేని వారికి గూడు కల్పించే బాధ్యత సర్కారుదే : సీపీఐ ధర్నాలో కూనంనేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్న భూ కబ్జాకోరులను వదిలిపెట్టి పేదలు తలదా చుకునేందుకు సర్కార్‌ భూముల్లో గుడిసెలేసుకుంటే…వారి పై కేసులు పెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. పేదల పక్షాన పోరాడుతున్న కమ్యూనిస్టులతో కయ్యం వద్దనీ, అవసరమైతే పేదల కోసం మీరో మేమో తెల్చుకునేందుకు సిద్ధమని సర్కారుకు హెచ్చరించారు. హైదరాబాద్‌ నగరంలో 14వందల మురికి వాడలున్నాయనీ, వాటిని ‘స్లమ్స్‌’ అంటూ ఉచ్చరించటానికి ఈ సర్కారుకు సిగ్గు అనిపించటం లేదా? అని ప్రశ్నించారు. ఇండ్లు లేని వారికి ఇండ్లు నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ‘భూదాన్‌ భూముల్లో గుడిసేలుసుకున్న పేదలకు పట్టాలు’ ఇవ్వాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ 75ఏండ్ల స్వతంత్ర దేశంలో కోట్లాది మందికి కనీసం తలదాచుకునేందుకు చోటు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరోక్షంగా పన్నుల రూపంలో పేదలనుంచి వసూలు చేసిన డబ్బునంతా సంపన్నులకు ఖర్చు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ అదే పరిస్థితి ఉందని చెప్పారు. ప్రభుత్వం వాగ్దానాలు చేయటం కాదనీ, వాటిని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పేదల బాధలు పట్టని ప్రభుత్వం ఉంటే ఎంత?చస్తే ఎంతని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తమ మద్దతు వల్లనే ప్రభుత్వం నిలబడిందని గుర్తుచేశారు. భూదాన్‌ బోర్డ్‌ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నంచే వారికి పోలీసులు మద్దతుగా నిలుస్తున్నారని, పేదలు గుడిసెలు వేసుకుంటే మాత్రం కేసులు పెడుతున్నారన్నారు. ఈ పద్దతి మార్చుకోకపోతే.. ‘మీరో మేమో తేల్చుకుంటామ’ని హెచ్చరించారు. 58 జివో ప్రకారం ప్రతి గుడిసెకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఎర్రజెండాను తక్కువ చెయ్యొద్దని సూచించారు. ప్రభుత్వం చేసే వాగ్దానాలను జీవో రూపంలో ఇవ్వాలనీ, అప్పుడే ప్రజలు విశ్వసిస్తారని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అజీజ్‌పాషా తెలిపారు. అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామంటూ చెబుతున్న ప్రభుత్వం, మురికివాడలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మురికివాడల్లో మాత్రమే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను నిర్మించారనీ, పేదల దగ్గర దళారులు డబ్బులు తీసుకొని ఇళ్లను కేటాయించారని విమర్శించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పరోక్ష పన్నుల ద్వారా ప్రజల రక్తాన్ని జలగల్లాగా పీలుస్తున్నాయన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున తమపై కేసులు పెడుతున్నారనీ, కేసులు కమ్యూనిస్టులకు కొత్త కాదన్నారు. పాలకులు మారినా ప్రజల బతుకుల్లో మార్పుల రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటి.నరసింహ అధ్యక్షత వహించగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఎస్‌.బోస్‌, పశ్య పద్మ, ఎన్‌.బాలమల్లేష్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love