మనువాదం దేశానికే ప్రమాదకరం

– ప్రత్యామ్నాయ సాంస్కృతిక రంగాన్ని అభివృద్ధి చేయాలి:జనచైతన్య యాత్ర గెట్‌ టూ గెదర్‌లో వక్తలు
– సీపీఐ(ఎం) యాత్రలకు సామాజిక, ప్రజా సంఘాల మద్దతు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశ భవిష్యత్‌కు ప్రమాదకరంగా మారిన బీజీపీ మనువాద భావజాలాన్ని వెనక్కి కొట్టడమే లక్ష్యంగా జనచైతన్యయాత్రతో ముందుసాగాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. దేశంలో ప్రత్యామ్నాయ సాంస్కృతిక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. మనువాదం దేశానికే ప్రమాదకరమని హెచ్చరించారు. సీపీఐ(ఎం) తలపెట్టిన జనచైతన్య యాత్రలకు ముక్తకంఠంతో మద్దతు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ అధ్యక్షతన సామాజిక, ప్రజా సంఘాల గెట్‌ టూ గెదర్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మార్పు కోరుకుంటారనీ, అది సమాజ హితంగా ఉండాలని ఆకాంక్షించారు. బీజేపీ మాత్రం మనుధర్మం ద్వారా చాతుర్వర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తూ కులధర్మం యధాతథంగా ఉంచేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. అంబేద్కర్‌ రాజ్యాంగం వద్దనీ, మనుధర్మమే ఉండాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్యులు గోల్వాల్కర్‌, సావర్కర్‌, హేడ్గేవార్‌ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. వారి అజెండానే నేడు బీజేపీ ముందుకు తీసుకెళ్తున్నదన్నారు. కులాన్ని బట్టి చదువులు, ఆస్తులు, శిక్షలు ఉండాలన్నదే మనుధర్మం ఉద్దేశమన్నారు. ఇలా చేయడమంటే దేశాన్ని మళ్లీ వెనక్కి తీసుకుపోవడమేనన్నారు. గర్భ సంస్కార్‌ పథకం అమలు చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. ఎన్ని మతాలున్నా, ఎన్ని వైరుధ్యాలున్నా ప్రజలు ఐక్యంగా జీవిస్తున్న మన దేశంలో మతచిచ్చు పెట్టి లబ్ది పొందాలని బీజేపీ చూస్తున్నదని విమర్శించారు. దేశంలోని కీలకమైన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టి దేశ ఆర్థిక సారభౌమత్వాన్ని దెబ్బతీస్తున్న తీరును వివరించారు. రాష్ట్రాల హక్కులను హరించి ఫెడరల్‌ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నదని విమర్శించారు. సామాజిక న్యాయం విషయంలోనూ ఉల్లంఘన జరుగుతున్నదన్నారు. దేశంలో రోజురోజుకీ మహిళలపై దాడులు పెరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 17 నుంచి 29 వరకు సీపీఐ(ఎం) తలపెట్టిన జనచైతన్య యాత్రలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వీసీకే రాష్ట్ర అధ్యక్షులు జిలకర శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్‌ అసలు లక్ష్యం ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక తరగతులను తొక్కిపెట్టమేనన్నారు. ఒకరినొకరు విమర్శించుకుంటూ కూర్చుంటే బీజేపీని ఎదుర్కోవడం కష్టమన్నారు. కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు, ప్రజాస్వామిక వాదులు ఐక్యంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ..బీసీల ఓట్లతో గెలిచి ప్రధాని అయిన మోడీ వారికి చేసిందేమీ లేదని విమర్శించారు. కులగణన చేసి జనాభా ధామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్‌వీ పౌండేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..కాలనీల్లో, అపార్టుమెంట్లలోకి, అసోసియేషన్లలోకి ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం వేగంగా వ్యాప్తి చెందుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందన్నారు. హెచ్‌ఆర్‌ఎల్‌ఎన్‌ బోర్డు మెంబర్‌ రచన మాట్లాడుతూ..ట్రాన్స్‌జెండర్ల పట్ల వివక్ష తగదన్నారు. తామూ మనుషులేనన్న భావనను మరవొద్దని కోరారు. తమకు రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. ఓయూ ప్రొఫెసర్‌ బి.సుదర్శన్‌ మాట్లాడుతూ…సాంస్కృతిక రంగాన్ని మరింత బలోపేతం చేసి బీజేపీని ఎదుర్కోవాలన్నారు. బీజేపీ ప్రమాదం గురించి వివరించడంలో లోపాన్ని సవరించుకుని ముందుకు సాగాలన్నారు. ఎమ్‌బీసీ నేత పాలూరి రామకృష్ణయ్య మాట్లాడుతూ..బీసీలకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నది బీజేపీనే అని చెప్పడంలో కాంగ్రెస్‌ విఫలమైందన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ బీసీలను ఏదో రకంగా మభ్యపెట్టి బీజేపీ రాజకీయ లబ్ది పొందుతున్నదన్నారు. దళిత సేన వ్యవస్థాపకులు జేబీ రాజు మాట్లాడుతూ..రాజ్యాంగ స్ఫూర్తిని నాశనం చేస్తున్న బీజేపీ తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. విశ్వజనక్‌ కళామండలి అధ్యక్షులు మాష్టార్‌ జీ మాట్లాడుతూ..సాంస్కృతిక చైతన్యాన్ని ప్రజల్లో పెంచడం ద్వారానే బీజేపీని ఎదుర్కోగలమన్నారు. కుల నిర్మూలనా సంఘం నేత గుత్తా జ్యోత్స్న మాట్లాడుతూ..బీజేపీని వ్యతిరేకించే శక్తులంతా పిడికిలి బిగించి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గౌడ కల్లుగీత సంఘం సమన్వయ కమిటీ చైర్మెన్‌ బి.బాలరాజుగౌడ్‌ మాట్లాడుతూ… బీజేపీ ట్రాప్‌లో పడకుండా బుద్ధిబలంతోనే దాన్ని ఎదుర్కోవాలన్నారు. స్వేచ్ఛ జేఏసీ కో-కన్వీనర్‌ కె.జనార్ధన్‌ మాట్లాడుతూ..గుజరాత్‌ పెట్టుబడిదారులకు దేశ సంపదను దోచిపెట్టే పనిలో మోడీ సర్కారు ఉందని విమర్శించారు. టెక్నాలజీ అందిపుచ్చుకుని బీజేపీ విషప్రచారాలకు గట్టిగా కౌంటర్‌ ఇవ్వాలన్నారు. భారత నాస్తిక సమాజం అధ్యక్షులు సారయ్య మాట్లాడుతూ..ప్రజల్లో సామాజిక చైతన్యం పెరగాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. అడ్వకేట్‌ నయిముల్లా షరీఫ్‌ మాట్లాడుతూ..దేశాన్ని కాపాడుకునే చివరి అవకాశం ఇదే అన్నారు. ఏఐఆర్‌డబ్ల్యూఓ రాష్ట్ర కార్యదర్శి అనూష మాట్లాడుతూ..నిరంతరం ప్రజల్లోకి వెళ్లి ప్రజల సాదకబాధకాలను తెలుసుకోవాలనీ, వారికి భరోసా కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో పట్నం ప్రధాన కార్యదర్శి డీజీ నర్సింహారావు, ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్‌డీ అబ్బాస్‌, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీరాంనాయక్‌, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు అరుణజ్యోతి, ఆదివాసీ గిరిజన సంఘం నేత బండారు రవికుమార్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్‌, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్‌వీ రమణ, రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య, సీఐటీయూ రాష్ట్ర నేత కోటంరాజు, టీపీటీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ విజరుకుమార్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకటేశ్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు, ఉపాధ్యక్షులు రవి, పీవైఎల్‌ రాష్ట్ర కార్యదర్శి కెఎస్‌.ప్రదీప్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌, స్వేచ్ఛ జేఏసీ నాయకులు టి.రమేశ్‌, టీపీఎస్‌కే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.హిమబిందు, కల్లుగీత వృత్తిదారుల సంఘం అధ్యక్షులు ఎ.వెంకన్న, అంబేద్కర్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బి.శ్రీనివాస్‌, వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.విఘ్నేష్‌, తెలంగాణ క్షౌరవృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నారం మల్లేశం, అడ్వకేట్‌ మహ్మద్‌ ఖుద్దుస్‌ ఘోరి, సామాజిక కార్యకర్త షాబాజ్‌ అలీఖాన్‌, తెలంగాణ లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షులు మన్నారం నాగరాజు, వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌వీ చెన్నారావు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love