రేపటినుంచి ఇంటర్‌ పరీక్షలు

– సర్వం సిద్ధం చేసిన అధికారులు
– పరీక్ష రాయనున్న 9,47,699 మంది
– 1,473 పరీక్షా కేంద్రాలఏర్పాటు
– విద్యార్థులు ఒత్తిడికి లోనుకావొద్దు : సబిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్‌ బోర్డు అధికారులు సర్వంసిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకో కుండా ఏర్పాట్లను పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ ప్రథమ సంవత్సరం నుంచి 4,82,677 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 4,65,022 మంది కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. రాష్ట్రంలో 1,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, ప్రభుత్వ రంగ కాలేజీలు 614, ప్రయివేటు జూనియర్‌ కాలేజీలు 859 ఉన్నాయి. రాష్ట్రంలో 1,473 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 1,473 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులు, 26,333 మంది ఇన్విజిలేటర్లు, 75 మంది ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు, 200 మంది సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఇంటర్‌ బోర్డు నియమించింది. ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి సోమవారం హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఒత్తిడి, భయాందోళనలకు లోనుకాకుండా పరీక్షలకు హాజరై విజయం సాధించాలని తెలిపారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలకు విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా చూడాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతో పాటు అధ్యాపకులు, తల్లిదండ్రులకు ఉందని అన్నారు. పరీక్షలపై విద్యార్థులకున్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి వారిలో మనోధైర్యాన్ని నింపాలని కోరారు. రాష్ట్రంలో బుధవారం నుంచి నిర్వహించనున్న ఇంటర్‌ పరీక్షలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశామని వివరించారు. జిల్లా స్థాయి కమిటీ చైర్మెన్లుగా కలెక్టర్లు బాధ్యతతో వ్యవహరించి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ఇంటర్‌ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలతోపాటు విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు, తాగునీరు, ఓఆర్‌ఎస్‌ అందుబాటులో ఉంచాలని కోరారు. పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు సకాలంలో చేరేందుకు వీలుగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసి అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ సమయంలో తలెత్తే సమస్యలకు సత్వర పరిష్కారం లభించే విధంగా ప్రత్యేకంగా కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షలు సమర్థవంతమైన రీతిలో, పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. పరీక్షల సమయంలో విద్యుత్‌కు ఆటంకం కలగకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించామ న్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థుల్లోని ఒత్తిడిని తగ్గించడానికి కౌన్సిలర్ల ద్వారా వారికి మోటివేషన్‌ ఇప్పించి పరీక్షలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయించాలని కోరారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love