మాజీ మంత్రి విజయరామారావు కన్నుమూత

నవతెలంగాణ-జూబ్లీహిల్స్‌
మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్‌ విజయ రామారావు(85) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం మరణించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంకు చెందిన విజయరామారావు 1959లో ట్రైనీ ఐపీఎస్‌గా విధుల్లో చేరారు. అనంతరం ఆయన సీబీఐ డైరెక్టర్‌గా పనిచేశారు. 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి పి.జనార్థన్‌రెడ్డిపై గెలిచి అప్పట్లో సంచ లనం సృష్టించారు. అప్పటి సీఎం చంద్రబాబు క్యాబినెట్‌లో రోడ్డు భవనాల శాఖామంత్రిగా పని చేశారు. 2004 ఎన్నికల్లో తిరిగి జనార్దన్‌రెడ్డి చేతిలో, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్‌ చేతిలో ఓడిపోయారు.
సంతాపం తెలిపిన మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
విజయ రామారావు మృతికి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సంతాపం తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో మృతదేహాన్ని సందర్శించి నివాళ్లర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. విజయ రామారావు అందించిన సేవలను స్మరించుకున్నారు.
సీఎం సంతాపం
మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్‌, ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ విజయ రామారావు మరణం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపాన్ని ప్రకటించారు. ప్రభుత్వ అధికారిగా, ప్రజాప్రతినిధిగా విజయరామారావు అందించిన సేవలు గొప్పవని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, అనంతరం తెలంగాణ రాష్ట్రంలోనూ విజయరామారావుతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.విజయరామారావు అంత్యక్రియలను ప్రభుత్వ లాంచనాలతో నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆయన ఆదేశించారు. విజయరామారావు మరణం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌చైర్మెన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌,మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు సంతాపాన్ని ప్రకటించారు.

Spread the love