సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికుల ఒప్పందాన్ని అమలు చేయాలి

– హైదరాబాద్‌ ఎన్నికల సమావేశం వద్ద ధర్నా
– ఓటుహక్కు కల్పించాలి : బీ మధు డిమాండ్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికులతో యాజమాన్యం గతంలో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలని సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికుల సంఘం (సీఐటీయూ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సింగరేణిలో ఎన్నికలు నిర్వహించేందుకు డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ (సెంట్రల్‌) సింగరేణి యాజమాన్యం, కార్మిక సంఘాలతో హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశం వద్ద వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్రప్రధాన కార్యదర్శి బి.మధు మాట్లాడుతూ గతేడాది సెప్టెంబర్‌ 26న జరిగిన ఒప్పందంలోని అన్ని అంశాలను అమలు చేయాలనీ, సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంట్రాక్ట్‌ కార్మికులకు ఓటు హక్కు కల్పించాలనీ, కాంట్రాక్ట్‌ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. ఈ ఒప్పందం అమలులో సింగరేణి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు 20 శాతం బోనస్‌ పెంపు విషయాన్ని నెల రోజుల్లో ప్రకటిస్తామని అంగీకరించిన యాజమాన్యం, ఐదు నెలలైనా దాన్ని అమలు చేయలేదన్నారు. సింగరేణి హాస్పిటల్స్‌లో కుటుంబ సభ్యులకు వైద్యం, ఇఎస్‌ఐ సౌకర్యం, జాతీయ, పండగ సెలవుల అమలు, సేల్‌ పీకింగ్‌, బెల్ట్‌ క్లీనింగ్‌ తదితర కార్మికులకు సెమిస్కిల్డు, స్కిల్డ్‌ వేతనాల చెల్లింపు, నర్సరీ కార్మికుల కనీస వేతనాలు, ప్రయివేటు సెక్యూరిటీ గార్డులకు కామన్‌ యూనిఫామ్‌, ఉచిత యూనిఫాం వంటి అంశాలేవీ అమల్లోకి రాలేదన్నారు. సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యల్ని నెలరోజుల్లో పరిష్కరిస్తామని డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ (సెంట్రల్‌) శ్రీనివాసులు, సింగరేణి జనరల్‌ మేనేజర్‌ (పర్సనల్‌) కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. ధర్నా చేస్తున్న కార్మికులు, నాయకులను సమావేశంలోకి పిలిచి మాట్లాడారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు ఓటు హక్కు కల్పించే విషయమై పర్మినెంట్‌ కార్మిక సంఘాల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ధర్నాలో సంఘం నాయకులు ఏ సమ్మయ్య, సిహెచ్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఆర్‌ సతీష్‌, కె శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love