అందాల పోటీల్లో 60 ఏండ్ల భామకు కిరీటం..

నవతెలంగాణ – హైదరాబాద్: అందాల పోటీలు అంటే ముందుగా గుర్తొచ్చేది టీనేజీ అమ్మాయిలే. అయితే, అందాల పోటీల్లో విజేతగా నిలవాలంటే యువతే కానవసరం లేదని నిరూపించింది ఓ మహిళ. ఏకంగా ఆరు పదుల వయసులోనూ టీనేజీ అమ్మాయిలతో పోటీ పడి అందాల పోటీల్లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఆవిడే అర్జెంటీనాకు చెందిన అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్. అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌ ప్రావిన్స్‌ రాజధాని లా ప్లాటాకు చెందిన ఆమె వయసు ప్రస్తుతం 60 ఏండ్ల. వృత్తిరీత్యా న్యాయవాది, జర్నలిస్ట్‌. అయితే, ఆరు పదుల వయసులోనూ తన అందంతో కుర్రకారు మతిపోగొడుతోన్న ఈ భామ సంకల్పానికి వయసు అడ్డుకాదని నిరూపించింది. ఇటీవలే అర్జెంటీనాలోని బ్యూనస్‌ ఎయిర్స్‌లో జరిగిన అందాల పోటీల్లో పాల్గొని ఏకంగా కిరీటం దక్కించుకుంది. ఆమె చిరునవ్వు, మనోహరమైన ప్రవర్తన న్యాయనిర్ణేతల, ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఈ వయసులో కిరీటం దక్కించుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు.. బ్యూటీ క్వీన్‌గా చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఈ పోటీల్లో గెలుపొందినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా రోడ్రిగ్జ్‌ పేర్కొంది. ఇక వచ్చే నెలలో జరగనున్న మిస్ యూనివర్స్ అర్జెంటీనా- 2024 అందాల పోటీల్లో బ్యూనస్‌ ఎయిర్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు రోడ్రిగ్జ్ సిద్ధమవుతోంది. అక్కడ గెలిస్తే సెప్టెంబర్‌ 28న మెక్సికో వేదికగా జరిగే ‘విశ్వసుందరి 2024’ పోటీల్లో తన దేశం తరఫున పాల్గొంటుంది.

Spread the love