సింగరేణిని కాపాడింది చంద్రబాబే

– ఆ ఎన్నికల్లో గెలుపునకు సమిష్టి కృషి :టీడీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు
నవతెలంగాణ- హైదరాబాద్‌
సింగరేణి ఎన్నికల్లో టీఎన్టీయూసీ అనుబంధ సంఘమైన ఎస్‌.సి.ఎల్‌.యూ గెలుపు కోసం కషి చేయాలని ఆ సంఘం నాయకులకు తెలుగుదేశం పార్టీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో టీఎన్టీయూసీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అప్పుల్లో కూరుకుపోయిన సింగరేణి, టీడీపీ హయాంలో లాభాల బాట పట్టిందన్నారు. సింగరేణి బొగ్గు గని కార్మికులను కాపాడుకోవడానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశేష కషి చేశారని గుర్తు చేశారు. కేంద్రం ప్రభుత్వం సింగరేణిని ప్రయివేటు పరం చేసేందుకు సిద్దమైనపుడు 42 వేల మంది కార్మికుల భద్రతకు బరోసా ఇస్తూ.. కేంద్రం నుంచి రూ. 663 కోట్ల వడ్డీ లేని రుణాలు మాఫీ చేయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
నేడు సింగరేణిపై అధికారం చెలాయిస్తున్న అధికార టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘమైన టీ.జీ.బి.జీ.కే.ఎస్‌ కుటుంబ పాలనకు చరమగీతం పలికేందుకు టీఎన్టీయూసీ శ్రేణులు సమష్టిగా పోరాడాలన్నారు. ఎన్నో ఏండ్లుగా కాపాడుకుంటూ వస్తున్న సింగరేణి బొగ్గు గని కార్మికులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు. తెలంగాణలో తెలుగుదేశం గెలుపునకు రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ త్వరలో నిర్వహించే బస్సు యాత్ర విజయవంతానికి టీఎన్టీయూసీ కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ సమావేశంలో టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే బోస్‌, పెద్దపల్లి పార్లమెంటు టీడీపీ అబ్జర్వర్‌ బి.సంజరు కుమార్‌, రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడు కొండలు, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం కో-ఆర్డినేటర్‌ పెద్దపల్లి సత్యనారాయణ, టీటీడీపీ మీడియా కో-ఆర్డినేటర్‌ బియ్యని సురేశ్‌, టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు మోహన్‌ రావు, రత్నాకర్‌ రావు, ప్రసాద్‌ బాబు, మణి రామ్‌ సింగ్‌, గడల నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love