మనమెక్కడున్నాం…?

 టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న
నవతెలంగాణ -హైదరాబాద్‌
తొమ్మిది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ప్రస్థానంలో మనం ఎక్కడ ఉన్నామో ఆలోచించుకోవాల్సిన అవసరమున్నదని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్న ప్రశ్నించారు. స్వరాష్ట్రాన్ని సిద్ధించుకుంటే బతుకులు బాగుపడతాయని కార్మికులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు భావించారని చెప్పారు. అందుకే ప్రతి ఒక్కరూ పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. జూన్‌ రెండు నుంచి 22వ తేదీ వరకు రోజూ ఒక ప్రభుత్వ శాఖ గత తొమ్మిదేండ్లల్లో సాధించిన ప్రగతిని ప్రజల ముందు ఉంచుతున్నదన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు జరిగాయో పరిశీలించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికులు స్వరాష్ట్రం కోసం విరోచితంగా పోరాడి సకల జనుల సమ్మెను విజయవంతం చేయడంలో దోహదపడ్డారని అన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం 2019లో స్వరాష్ట్రంలోనే సమ్మెబాట పట్టారని గుర్తు చేశారు. అప్పట్లో ఆర్టీసీకి ప్రతియేటా రూ. 1000 కోట్లు ఆర్టీసీకి విడుదల చేస్తామన్న కేసీఆర్‌ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ నిధులలో 50 శాతం కూడా ఇవ్వలేదని విమర్శించారు. . 10 వేల మందిని ఆర్టీసీలో నియమిస్తామని చెప్పి తొమ్మిది సంవత్సరాలలో ఒక్క నియామకం కూడా జరపలేదన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకపోగా వారిపై వేధింపులు పెరిగాయని గుర్తు చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు.

Spread the love