నేడు పీజీఈసెట్‌ ఫలితాలు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన పీజీఈసెట్‌ రాతపరీక్షల ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఈ మేరకు పీజీఈసెట్‌ కన్వీనర్‌ బి రవీంద్రారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌లోని జేఎన్టీయూ హైదరాబాద్‌లో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి ఈ ఫలితాలను విడుదల చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూ హైదరాబాద్‌ వీసీ కట్టా నర్సింహారెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్‌ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసరావు, పాల్గొంటారని పేర్కొన్నారు. కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్ష (సీబీఆర్టీ) విధానంలో గతనెల 29 నుంచి ఈనెల ఒకటో తేదీ వరకు పీజీఈసెట్‌ రాతపరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. పీజీఈసెట్‌కు 16,563 మంది దరఖాస్తు చేస్తే 14,882 (89.85 శాతం) మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.

Spread the love