టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో 53,777 మంది ఉత్తీర్ణత

– బాలికలదే పైచేయి
– సిద్ధిపేట ప్రథమం, జగిత్యాల అధమొం ఫలితాలు విడుదల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను శుక్రవారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదలయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు ఒక ప్రకటన విడుదల చేశారు. గతనెల 14 నుంచి 22 వరకు ఈ పరీక్షలను నిర్వహించామని తెలిపారు. అదేనెల 24 నుంచి 26 వరకు మూల్యాంకనం ప్రక్రియ చేపట్టామని వివరించారు. 71,695 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకుంటే, 66,732 మంది పరీక్షలు రాశారని పేర్కొన్నారు. వారిలో 53,777 (80.59 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. 38,888 మంది బాలురు పరీక్షలు రాస్తే, 30,528 (78.50 శాతం) మంది పాసయ్యారని వివరించారు. 27,844 మంది బాలికలు పరీక్షలు రాయగా, 23,249 (83.50 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. అంటే బాలురు కన్నా బాలికలు 5 శాతం అధికంగా ఉత్తీర్ణత పొంది పైచేయి సాధించారు. రాష్ట్రంలో 99.47 శాతం ఉత్తీర్ణత సాధించి సిద్ధిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. ఆ జిల్లా నుంచి 189 మంది పరీక్ష రాస్తే, 188 (99.47 శాతం) మంది ఉత్తీర్ణత పొందారని వివరించారు. 53.69 శాతం ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా చివరిస్థానంలో ఉందని పేర్కొన్నారు. ఆ జిల్లా నుంచి 1,922 మంది పరీక్షలు రాయగా, 1,032 (53.69 శాతం) మంది పాసయ్యారని తెలిపారు. ఫలితాల కోసం www.bse.telangana.gov.in, http://results.bsetelangana.org వెబ్‌సైట్లను సంప్రదించాలని సూచించారు.
రీకౌంటింగ్‌ దరఖాస్తు గడువు 18
మార్కులు తిరిగి లెక్కింపు కోరుకునే విద్యార్థులు సబ్జెక్టుకు రూ.500 చొప్పున ఈనెల 18 వరకు ఎస్‌బీఐ ద్వారా హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ కింద చలానా చెల్లించాలని కృష్ణారావు తెలిపారు. ఆ దరఖాస్తులను నేరుగాకానీ, పోస్టు ద్వారాకానీ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుల కార్యాలయం, హైదరాబాద్‌కు పంపించాలని కోరారు. డిమాండ్‌ డ్రాఫ్ట్‌లు అంగీకరించబోమని స్పష్టం చేశారు.
అన్ని జిల్లాల్లో రీవెరిఫికేషన్‌ కేంద్రాలు
అన్ని సబ్జెక్టులకూ సమాధాన పత్రాల పున:పరిశీలనా విధానాన్ని అన్ని జిల్లా కేంద్రాలకూ వికేంద్రీకరించామని కృష్ణారావు తెలిపారు. దరఖాస్తు ఫారాలను సంబంధిత ప్రధానోపాధ్యాయుల ధృవీకరణ సంతకం చేయించి హాల్‌టికెట్‌ జిరాక్స్‌ ప్రతితోపాటు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్‌లో సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుల కార్యాలయానికి పోస్టు లేదా కొరియర్‌ ద్వారా పంపించే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.వెయ్యి చొప్పున వ్యక్తిగతంగా చలానా తీయాలని కోరారు. పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా కేంద్రాల్లోని డీఈవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఈనెల 10 నుంచి 18 వరకు స్వీకరించబడతాయని తెలిపారు. సవరించిన ధ్రువపత్రాలను గ్రేడ్‌ మారితేనే జారీచేస్తామని వివరించారు. రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మార్కుల లెక్కింపు (రీకౌంటింగ్‌) కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

Spread the love