జల్‌.. జంగల్‌.. జమీన్‌ కల సాకారం

– ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌
– 6శాతం రిజర్వేషన్లు 10శాతానికి పెంపు
– గడపగడపకూ సంక్షేమ ఫలాలు :మంత్రి కొప్పుల ఈశ్వర్‌
– రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోడు హక్కు పత్రాల పంపిణీ
నవతెలంగాణ – సిరిసిల్ల
జల్‌ జంగల్‌ జమీన్‌.. గిరిజన హక్కుల కోసం పోరాడిన కొమురం భీమ్‌ స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్‌ గిరిజనుల కల సాకారం చేశారని ఐటీ, పరిశ్రమల, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి గిరిజన రైతులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేశారు. సందర్భంగా సభలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంలో దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు. కొమురం భీమ్‌ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన పేరుతో కొమురం భీమ్‌ జిల్లాను ఏర్పాటు చేసుకున్నామన్నారు. అదే స్ఫూర్తితో గిరిజనులకు 6శాతం ఉన్న రిజర్వేషన్లను 10శాతానికి పెంచినట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలను మెరుగుపరచడంతోపాటు ఇంటింటికీ సాగునీరు, విద్య, వైద్యం చేరువ చేశామన్నారు. రాష్ట్రంలో లక్ష 50మంది గిరిజనులకు 44.6లక్షల ఎకరాలపై భూమి హక్కు పత్రాలు ఇచ్చామని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,614మంది రైతులకు 2,850ఎకరాలపై యాజమాన్య హక్కు పత్రాలను అందిస్తున్నట్టు వివరించారు. ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. గిరిజనుల గడప గడపకూ సంక్షేమ ఫలాలను తీసుకెళ్లి అన్ని రంగాల్లో వారు ఎదిగేందుకు దోహదం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ బాబు, పవర్‌లూమ్‌ టెక్స్‌టైల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ గూడూరి ప్రవీణ్‌, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, సెస్‌ చైర్మెన్‌ చిక్కాల రామారావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.

Spread the love