– ఏపీ హైకోర్టు సీజేగా ధీరజ్ సింగ్ ఠాకూర్
– మరో ఐదు హైకోర్టులకు సీజేలు..
సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ అలోక్ అరదే , ఏపీ హైకోర్టుకు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ను కొలీజియం సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సహా కేరళ, ఒడిశా, బాంబే, గుజరాత్, మణిపూర్ ఏడు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులను సిఫారసు చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ సంజరు కిషన్ కౌల్ , జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన కొలీజియం ఆమోదించిన తీర్మానాలను బుధవారం రాత్రి అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరదే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ,బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకానికి సిఫారసు చేసింది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్‌ను గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, గుజరాత్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆశిష్ జె దేశారును కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుభాసిస్ తలపాత్రను అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్‌ను మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయను బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించేందుకు సిఫారసు చేశారు. వీరి నియామకానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపాల్సి ఉంది
జస్టిస్ అలోక్ అరదే నేపథ్యం
జస్టిస్ అలోక్ అరదే 1964లో అప్పటి మధ్యప్రదేశ్‌లోని రారుపూర్‌లో జన్మించారు. 1988లో జబల్‌పూర్‌లోని మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2007లో సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. 2009లో అక్కడి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
2016 సెప్టెంబర్ 16 జమ్మూకాశ్మీర్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2018 మే 11న జమ్మూ కాశ్మీర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2018 నవంబర్ 17 నుంచి కర్నాటక హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. కర్నాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. తాజాగా తెలంగాణ హైకోర్టు సిజెగా జస్టిస్ అలోక్ అరదేను కొలీజియం సిఫారసు చేసింది.
జస్టిస్ ధీరజ్ సింగ్ నేపథ్యం
జమ్మూకాశ్మీర్‌కు చెందిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 1964 ఏప్రిల్ 25న జన్మించారు. 1989 అక్టోబర్ 18న ఆయన బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో, తరువాత బార్ కౌన్సిల్ ఆఫ్ జమ్ము కాశ్మీర్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2011లో సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి పొందారు. 2013 మార్చి8న జమ్మూకశ్మీర్ హైకోర్టుకు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 2022 జూన్ 10 నుంచి ముంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 9న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. అయితే ఆ సిఫార్సు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉండటంతో, దాన్ని కొలీజియం రద్దు చేసింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను సిఫారసు చేసింది.