కొనలేం-తినలేం

– సెంచరీ దాటేసిన టమాటా
భారతీయ వంటకాలలో టమాటాకు ఉన్న ప్రాధాన్యత చెప్పనవసరం లేదు. అది కూర, చట్నీ , రసం, పప్పు కావచ్చు. టమాటా లేని వంటను ఊహించడం కష్టమే. అలాంటి టమాటాలపై ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో బోలెడన్ని ట్రోలింగ్‌లు. దానికి కారణం టమాటా ధరలు పెట్రోలు, డీజిల్‌ ధరలతో పోటీపడి పైపైకి ఎగబాకడమే. చాలా ప్రాంతాలలో ధర ఎప్పుడో సెంచరీని దాటేసింది.
పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పోటి
రాజధాని న్యూఢిల్లీ, కొల్‌కతా, ముంబయి, చెన్నరు నగరాలలో బుధవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నగరాలలో లీటరు పెట్రోల్‌ రూ.96.72 నుండి రూ.106.31కు, డీజిల్‌ రూ.89.62 నుండి రూ.94.27కు లభిస్తోంది. అంటే పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పోలిస్తే కిలో టమాటా ధరే అధికంగా ఉంది.
న్యూఢిల్లీ : సామాన్య,మధ్యతరగతి జనంపై భారం మరింతగా పెరుగుతోంది. పొద్దున లేచినప్పటినుంచి పూట గడవటమెలాగా అని బెంగపట్టుకుంటోంది. పెరుగుతున్న నిత్యావసరాలకు తోడుగా కూరగాయల ధరలు..జనం జేబులకు చిల్లులు పెడుతున్నాయి. కొద్దిరోజుల వరకు టమాటా కేజీ రూ. పది కూడా దాటనిది.ఇపుడు ఏకంగా వందకు పైనే పలుకుతుండటంతో..ఆచితూచి కొనాల్సివస్తుందని వినియోగదారులు అంటున్నారు. ఇక పలు ప్రాంతాలలో రుతుపవనాల కారణంగా జోరుగా వానలు పడుతుండడంతో టమాటాల రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో డిమాండ్‌, సరఫరాల మధ్య వ్యత్యాసం పెరిగి ధరలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. జిహ్వచాపల్యాన్ని చంపుకోలేక కొన్నామా… జేబులు ఖాళీ అవడం ఖాయం. ఒకప్పుడు రూ.10-20కి దొరికిన కిలో టమాటాలు ఇప్పుడు కనీసం వంద రూపాయలు పెడితే కానీ రావడం లేదు. కొన్ని ప్రాంతాలలో అది కూడా కష్టమే. ఒక్క మాటలో చెప్పాలంటే పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పోలిస్తే టమాటా ధరే ఎక్కువగా ఉంది.
ప్రధాన నగరాలలో కిలో టమాటాను రూ.58 నుండి రూ.148 రూపాయల వరకూ విక్రయిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోనూ, దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోనూ కిలో టమాటాలు రూ.80కి దొరుకుతుంటే కొల్‌కతాలో మాత్రం రూ.148 పలుకుతోంది. రాజధాని ఢిల్లీలో ధర రూ.110-117 మధ్య ఉంది. వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించిన సమాచారం ప్రకారం దేశంలో కిలో టమాటాల సగటు ధర రూ.83.29గా ఉంది. మొత్తంమీద టమాటా సగటు ధర కిలోకు రూ.25-41 పెరిగింది. బెంగళూరులోని కేఆర్‌ మార్కెట్‌లో ఒకప్పుడు రూ.20-30కి దొరికిన టమాటాలు ఇప్పుడు రూ.100 పలుకుతున్నాయి. మిగిలిన కూరగాయల ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా టమాటాలు సామాన్యులకు ఏ మాత్రం అందుబాటులో లేవు. విశాఖపట్నం, విజయవాడ నగరాలలో ధర రూ.90-120 పలుకుతోంది. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి. కేరళలోని కొచ్చిలోనూ, ఇతర ప్రాంతాలలోనూ ధర ఇప్పటికే సెంచరీ దాటింది.
అతిశయోక్తి కాదు కానీ కర్నాటకలో ఓ వ్యాపారి తాను విక్రయిస్తున్న టమాటాలను దొంగలు అపహరించకుండా కాపాడుకునేందుకు కూరగాయల పెట్టెలోనే ఓ కెమేరాను అమర్చాడు. టమాటాలను బంగారం కంటే భద్రంగా చూసుకుంటున్నారనడానికి ఇది ఓ ఉదాహరణ.
ఎందుకు పెరుగుతోంది?
రుతుపవనాలు ఆలస్యం కావడం, అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ ఉత్పత్తి వంటి కారణాలు టమాటా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. టమాటాలు పండించే ప్రాంతాలలో వీచిన వడగాలులు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో పంటకాలంలో వచ్చిపడిన అకాల వర్షాలు, వరదల కారణంగా ధరలు పెరిగాయని వ్యాపారులు తెలిపారు. అదీకాక టమాటాలు అధికంగా పండించే ప్రాంతాలలో భారీ వర్షాలు, వరదల కారణంగా పంట లభ్యత బాగా తగ్గిపోయింది. కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలోనూ, కొన్ని కొండ ప్రాంతాలలోనూ వర్షాల కారణంగా కూడా పంట దెబ్బతిన్నది. దీంతో సరఫరాలపై ప్రభావం పడింది. ఇటీవల తమిళనాడులో కురిసిన భారీ వర్షాలతో పంటకు బాగా నష్టం జరిగింది. దీనితో పాటు వంగ, మునగ, క్యారట్‌, బీట్‌రూట్‌, ఉల్లిగడ్డ, బంగాళదుంప దిగుబడులు కూడా పడిపోయాయి.

Spread the love