నల్లేరుపై నడక కాదు!

– అంతర్గత కుమ్ములాటలతో బీజేపీ సతమతం
అగ్నిపరీక్షగా మారిన అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సంవత్సరం జరగబోయే లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్షగా మారబోతున్నాయి. ఆ రాష్ట్రాలలో విజయం నల్లేరుపై నడక కాదని తేలిపోయింది. కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్‌ చేతిలో పరాభవాన్ని చవిచూసిన తర్వాత ఆ పార్టీని సంక్షోభాలు ఒక దాని వెంట ఒకటిగా వెంటాడుతున్నాయి. బాలాసోర్‌ రైలు ప్రమాదం, కోవిన్‌ సమాచారం లీకేజీ ఉదంతాలు బీజేపీ ప్రతిష్టను మసకబార్చాయి. రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణ, అంతర్జాతీయ క్రెడిట్‌ కార్డు లావాదేవీలపై పన్ను విధింపు వంటి నిర్ణయాలతో పార్టీ వ్యతిరేకతను మూటకట్టుకుంటోంది.దీనిని గ్రహించిన బీజేపీ అధిష్టానం నష్టనివారణ చర్యలు చేపట్టినప్పటికీ వివిధ రాష్ట్రాలలో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు పార్టీని చీకాకు పరుస్తున్నాయి. మరోవైపు మహిళా మల్లయోధుల నిరసన కూడా ఆ పార్టీకి అప్రదిష్ట తెచ్చిపెట్టింది.

న్యూఢిల్లీ :  2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం తన ఐదేళ్ల పదవీకాలాన్ని పెద్దగా కుదుపులు లేకుండానే పూర్తి చేసుకుంది. కానీ 2019లో రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘర్‌ రాష్ట్రాలలో సంస్థాగత సమస్యలతో పాటు ముఠా కుమ్ములాటలు కూడా బీజేపీని కలవరపరుస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌లో నాయకత్వ పోరు
మధ్యప్రదేశ్‌లో 2005 నుండి అధికారంలో ఉన్న శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. మోడీకి వ్యతిరేకిగా ముద్ర పడినప్పటికీ బీజేపీ కేంద్ర నాయకత్వం మరోసారి చౌహాన్‌ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. అయితే పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 2018 ఎన్నికలలో పార్టీ పరాజయం పాలైనప్పటికీ కాంగ్రెస్‌కు చెందిన జ్యోతిరాదిత్య సింథియా నేతృత్వంలో 23 మంది ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరడంతో ఫిరాయింపుల ద్వారా ఆ పార్టీ అధికారాన్ని చేపట్టింది. అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలే బీజేపీకి తలనెప్పిగా మారారు. పార్టీలో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎప్పటి నుండో కొనసాగుతున్న బీజేపీ విధేయుల మధ్య అసెంబ్లీ టిక్కెట్ల కోసం పోటీ నడుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్‌ నుండి ఫిరాయించిన వారికి సీట్లు ఇస్తే విధేయుల నుండి తిరుగుబాటు తప్పకపోవచ్చు.
మరోవైపు సింధియా కూడా చౌహాన్‌కు సవాలు విసురుతున్నారు. దీనికితోడు చౌహాన్‌ ఇప్పటికే పార్టీలో అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. నేతలు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకుంటూ పార్టీ పరువును బజారున పడేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తమ తమ నియోజకవర్గాలలో ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. తమను పార్టీ నాయకత్వం పట్టించుకోవడం లేదని వారు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. గత రెండు నెలల కాలంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. సింథియాకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వీరి నిష్క్రమణతో దళితులు, ఆదివాసీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న స్థానాలలో పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఛత్తీస్‌గడ్‌లో పారని పాచిక
ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బాఘెల్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి రామన్‌ సింగ్‌ మినహా చాలా మంది బీజేపీ నేతలు ఇప్పుడు రాజకీయ చిత్రం నుండి కనుమరుగయ్యారు. రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాలను సమీకరించడంలో బాఘెల్‌ విజయం సాధించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకుందామనుకుంటున్న బీజేపీ పాచిక పారడం లేదు. బీజేపీ నుండి కాంగ్రెస్‌లోకి ఫిరాయింపులు కూడా జరుగుతున్నాయి.
రాజస్థాన్‌లో లోపించిన ఐక్యత
రాజస్థాన్‌లో పార్టీ ప్రచార సారథి ఎవరో బీజేపీ నాయకత్వం నిర్ణయించుకోలేకపో తోంది. వసుంధర రాజె నాయకత్వాన్ని మోడీ-షా ద్వయం వ్యతిరేకిస్తున్నప్పటికీ మరో సమర్ధ నాయకుడిని ఎంపిక చేసుకోలేక సతమతమవుతోంది. పార్టీ టికెట్లు ఆశిస్తున్న వారు, మెజారిటీ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వసుంధర నాయకత్వాన్నే సమర్ధిస్తున్నారు. పార్టీలో ఐక్యత లేకపోవడం బీజేపీ నాయకత్వాన్ని కలవరపెడుతోంది. కాంగ్రెస్‌లో అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌ మధ్య కొనసాగుతున్న విభేదాలను సైతం సొమ్ము చేసుకునే పరిస్థితి కానరావడం లేదు. వసుంధర స్థానంలో పలువురు నేతల పేర్లు తెరపైకి వస్తున్నప్పటికీ కేంద్ర నాయకత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది.
ఇతర రాష్ట్రాలలోనూ…
ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో పరిస్థితి ఇలా ఉంటే అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సైతం ఆశాజనకంగా లేదు. మణిపూర్‌లో పార్టీకి అండగా ఉంటున్న మైతీలు, కుకీల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. బీజేపీలోని కుకీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌పై బాహాటంగానే గళం విప్పుతున్నారు. వీరంతా ఢిల్లీలో మకాం వేసి తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మద్దతు పెరుగుతోంది.
త్రిపురలో మాజీ ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌, ప్రస్తుత ముఖ్యమంత్రి మాణిక్‌ సాహాలకు ఏ మాత్రం పొసగడం లేదు. వాస్తవానికి దేవ్‌ మద్దతుతోనే సాహా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. దేవ్‌ను పదవి నుండి తప్పించేంత వరకూ సాహా ఆయనకు విధేయుడిగానే ఉన్నారు. సాహాను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడంతో ఇప్పుడు ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎమ్మెల్యేలు కూడా ఇద్దరు నేతల మధ్య చీలిపోయారు.
జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ నాయకత్వం విముఖంగా ఉంది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పాలనలో మితిమీరిన అవినీతి ఆ పార్టీ అవకాశాలను దెబ్బతీస్తోంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలలోనే కాకుండా తాను అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సైతం పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పుడు కొత్త మిత్రుల కోసం వెతుకుతోంది. ఒకప్పటి ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలైన అకాలీదళ్‌, తెలుగుదేశం, జనతాదళ్‌ (సెక్యులర్‌)తో మంతనాలు జరుపుతోంది.

Spread the love