చీల్చటం.. భయపెట్టడం

– ఫిరాయింపులు, దర్యాప్తు సంస్థలే బీజేపీ బలం
– ప్రజల మద్దతు లేకున్నా అధికారం చెలాయిస్తున్న కాషాయపార్టీ
– ప్రతిపక్ష ప్రభుత్వాల కూల్చివేత
– దారికి రాకుంటే ఈడీ, సీబీఐల ప్రయోగం : విశ్లేషకులు
ప్రతిపక్షాలను బలహీనపరిచేందుకు, భయపెట్టేందుకు, వేధించేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ బీజేపీ వదులుకోవడం లేదు. కమలదళం ప్రయత్నాలకు కొన్ని మీడియా సంస్థలు కూడా వంత పాడుతున్నాయి. అధికారాన్ని నిస్సిగ్గుగా దుర్వినియోగం చేయడం ఎంతమాత్రం ఆశ్చర్యాన్ని, దిగ్భ్రాంతినీ కలిగించడం లేదు. ఇటీవల మహారాష్ట్రలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఈ బీజేపీ నిజ స్వరూపాన్ని మరింత బయటపెట్టాయి. ఎన్నికలలో ప్రజల మద్దతు పొందడంలో విఫలమైనప్పటికీ ఎలాగైనా అధికార దర్పాన్ని అనుభవించాలన్న కోరికతో బీజేపీ ఆ రాష్ట్రంలో రెండు పర్యాయాలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. తాజాగా శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీని నిట్టనిలువుగా చీల్చడం బీజేపీ అధికార వ్యామోహానికి పరాకాష్టగా చెప్పవచ్చు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఎత్తుగడలు మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
న్యూఢిల్లీ : కేంద్రంలోనూ, పలు రాష్ట్రాలలోనూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు వాస్తవానికి ప్రజాబలంపై అధారపడి మనుగడ సాగించడం లేదు. ఆ పార్టీ కొన్ని రాష్ట్రాలలో ఫిరాయింపులను ప్రోత్సహించి దొడ్డిదారిన అధికారాన్ని అనుభవిస్తున్నది. మరికొన్ని రాష్ట్రాల్లో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి ప్రతిపక్ష నేతలను తన దారికి తెచ్చు కుంటున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత సంవత్సరం జూన్‌లో ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలో 40 మంది శివసేన ఎమ్మెల్యేలు గోడ దూకారు. దీంతో అప్పటి వరకూ అధికారంలో ఉన్న మహారాష్ట్ర వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం కుప్పకూలింది. శివసేనలో చీలికకు కారణమైన షిండేను ముఖ్యమంత్రి పదవి వరించింది. ఆ పార్టీని చీల్చడంలో తెరవెనుక పాత్ర పోషించిన బీజేపీ, ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతున్నది. అయినా దాని అధికార దాహం తీరలేదు. ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఈసారి ఎన్సీపీపై కన్నేసింది. అప్పుడు షిండే పోషించిన పాత్రను ఇప్పుడు అజిత్‌ పవార్‌ తలకెత్తుకున్నారు. ఫలితంగా అజిత్‌ పవార్‌, మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు.
కాంగ్రెస్‌ బలహీనపడడంతో…
వాస్తవానికి పార్టీ ఫిరాయింపులు ఈ దేశంలో కొత్తేమీ కావు. ఒకప్పుడు రాష్ట్రాల్లో ఫిరాయింపులను ప్రోత్సహించి, అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఆ తర్వాత వాటికే బాధితురాలిగా మారింది. ‘ఆయారాం గాయారాం’ల కారణంగా పలు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయింది. నరేంద్ర మోడీ ప్రధాని పదవి చేపట్టకముందే బీజేపీ మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, గోవా రాష్ట్రాల్లో సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటుచేసింది. బీహార్‌,
పంజాబ్‌ ప్రభుత్వాల్లో భాగస్వామిగా కొనసాగిం ది. 2014లో నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై దృష్టి సారించింది. అవి అధికారంలో ఉన్న చోట సామ దాన బేధ దండోపాయాలను ప్రయో గించింది. ఒక్కో రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకుంటూ అధికారాన్ని పటిష్టం చేసుకుంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం బలహీనంగా ఉండటం బీజేపీకి వరంలా మారింది. పలు రాష్ట్రాలలో కాంగ్రెస్‌ బలహీనపడడం, ఆ పార్టీ నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు కమలదళంలోకి క్యూ కట్టడంతో బీజేపీ పరిస్థితి రొట్టె విరిగి నేతిలో పడినట్లయింది.
2014 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ పూర్తిగా చతికిలబడింది. కాంగ్రెస్‌కు ఎన్నడూ లేనంత కని ష్టంగా కేవలం 44 స్థానాలు మాత్రమే లభించాయి. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకున్న కమలనాథులు హర్యానా, అసోం, ఉత్తరాఖండ్‌, ఉత్త రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అదే సమయంలో బీజేపీ ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’ ప్రాజెక్టును చేపట్టింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తన బుట్టలో వేసుకోవడానికి బలహీనంగా ఉన్న ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని వాడుకుంది. మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడితే వారికి చట్టం వర్తించదన్న నిబంధన కమల దళం పాలిట వరంగా మారింది.
ప్రభుత్వాలను కూలుస్తూ…
2014 అసెంబ్లీ ఎన్నికలలో 60 స్థానాలున్న అరుణాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ 47 స్థానాలు గెలుచుకున్నప్పటికీ రెండు సంవత్సరాలు తిరగకుం డానే దాని బలం కేవలం ఒకే ఒక్క స్థానానికి పరి మితమైంది. ముఖ్యమంత్రి పెమా ఖండూ నేతృత్వం లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు గంపగుత్తగా పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌లో చేరిపోయారు. ఆ తర్వాత ఆయన బీజేపీతో చేతులు కలిపి ముఖ్య మంత్రిగా కొనసాగారు. 2017లో జరిగిన మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలలోనూ కాంగ్రెస్‌కే ఎక్కువ స్థానాలు లభిం చాయి. అయినప్పటికీ ప్రాంతీయ పార్టీలైన ఎన్‌జీఎఫ్‌, ఎన్‌పీపీ, ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మద్దతుతో బీజేపీ గద్దె ఎక్కింది. ఆ ఒకే ఒక్కడికి ఆ తర్వాత మంత్రి పదవి దక్కింది.
కర్నాటకలో 2008లో ‘ఆపరేషన్‌ లోటస్‌’ను విజయవంతంగా అమలు చేసిన బీజేపీ, 2019లో కూడా దానిని పునరావృతం చేసింది. 13 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తన గూటికి చేర్చుకుంది. ముగ్గురు జేడీ(ఎస్‌) ఎమ్మెల్యేలు, ఒక కేపీజేపీ ఎమ్మెల్యే కూడా జత కలవడంతో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చింది.
కోవిడ్‌ సమయంలోనూ…
ఏడీఆర్‌ నివేదిక (2020) ప్రకారం 2014 తర్వాత వివిధ రాష్ట్రాలలో 405 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. వీరిలో 182 మంది (44.9%) బీజేపీలో చేరారు. 170 మంది (42%) కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. 2020లో కోవిడ్‌ మహమ్మారి దేశం తలుపు తట్టిన సమయంలో కూడా బీజేపీ తన కుయుక్తులు మానలేదు. మధ్యప్రదేశ్‌లో 21 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను లాక్కుని కమల్‌నాథ్‌ ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది. ప్రజల మద్దతు లేకపోయినప్పటికీ మరో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగలిగింది.
బీజేపీలో చేరితే పవిత్రులే…
ఫిరాయింపులను ప్రోత్సహించి దొడ్డిదారిన అధికారంలోకి రావడంతో బీజేపీ సంతృప్తి చెంద లేదు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై తన అధీనంలోని దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం మొదలు పెట్టింది. ప్రతిపక్షాలకు చెందిన పలువురు నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు వేధించాయి. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 121 మంది నేతలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ జరిపింది. వీరిలో 115 మంది బీజేపీ యేతర పార్టీ లకు చెందిన వారే. వేధింపులు భరించలేక బీజేపీ పంచన చేరాలని నిర్ణయించుకునే వారిపై మాత్రం దర్యాప్తు సంస్థలు కరుణ చూపాయి. కాంగ్రెస్‌ నుండి బీజేపీలో చేరిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మతో పాటు సువేందు అధికారి వంటి నాయకులపై నమోదైన కేసులు ఇప్పుడు ఎటు పోయాయో తెలియదు. కొందరి పైన నడుస్తున్న కేసులను ఉపసంహరించారు. అంటే బీజేపీలో చేరగానే వీరందరూ పవిత్రులు అయ్యారన్న మాట.
ఎన్నికలకు ముందు దాడులు
ఎన్నికలకు ముందు కేంద్ర దర్యాప్తు సంస్థల చేత ప్రతిపక్ష నేతల నివాసాలు, ఆస్తులపై దాడులు చేయించి వారిని చీకాకు పరచడం మరో ఎత్తుగడ. 2021 ఏప్రిల్‌లో… అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎంకే అధినేత, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ కుమార్తె సెంథామరై ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు చేశారు. తృణమూల్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ, ఆయన కుటుంబసభ్యుల ఆస్తులపై కూడా ఇలాగే దాడులు జరిపారు. కేరళ ఎన్నికలకు ముందు కూడా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను అప్రదిష్టపాలు చేసేందుకు కుట్రలు చేశారు. బంగారం స్మగ్లింగ్‌ కేసులో పట్టుబడిన స్వప్న సురేష్‌ ముఖ్యమంత్రి ఆదేశానుసారమే నేరానికి పాల్పడ్డా రంటూ కట్టుకథలు అల్లారు. ఇక 2020 అక్టోబర్‌లో కర్నాటక కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ నివాసాలపై సీబీఐ దాడులు చేసింది. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలెట్‌ మధ్య రాజకీయ వైరం కొనసాగుతున్న సమయంలోనే గెహ్లాట్‌ సన్నిహితులపై దాడులు జరిగాయి. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు హర్యానా కాంగ్రెస్‌ నేత భూపేందర్‌ సింగ్‌ హూడాపై భూసేకరణ కేసు పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీకి రాంరాం చెప్పిన తర్వాత ఆయనకూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
దారికి రాకపోతే…
బీజేపీ దారికి రాని వారిపై మాత్రం దర్యాప్తు సంస్థల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. సీబీఐ, ఈడీలు ఒక దాని వెంట మరొకటి కేసుల మీద కేసులు పెడుతూ ప్రతిపక్ష నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీనికి ఉదాహరణ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌, ఆయన కుటుంబమే. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా మరో ఉదాహరణ. ఆయన ఇప్పటికీ ఊచలు లెక్కబెడుతూనే ఉన్నారు. రాజకీయ శత్రువులను అతి క్రూరమైన మనీ లాండరింగ్‌ చట్టంలోని నిబంధనల కింద నిర్బంధించడం పరిపాటిగా మారింది. బిశ్వశర్మ, అధికారి, నారాయణ్‌ రాణే వంటి నాయకులు బీజేపీలో
చేరి కేసుల నుంచి బయటపడగా మిగిలిన వారు విచారణలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రత్యర్థులను దారికి తెచ్చుకునే ఎత్తుగడలను ప్రయోగించి గత సంవత్సరం మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వాన్ని కూల్చారు. షిండే శిబిరంలో చేరక ముందు పలువురు ఎమ్మెల్యేలపై ఈడీ కేసులు ఉన్నాయి.
ఇటీవల బీజేపీలో చేరిన ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై సైతం ఈడీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశం ఉన్నప్పటికీ ఆయా శాసనసభాపతులు సకాలంలో నిర్ణయం తీసుకోవడం లేదు. మహారాష్ట్రలో షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలపై శివసేన అనర్హత పిటిషన్‌ దాఖలు చేసినప్పటికీ సంవత్సర కాలంగా అది స్పీకర్‌ వద్ద పెండింగులోనే ఉంది.

Spread the love