సొమ్మొకడిది.. సోకొకడిది క్రిమినల్స్‌కు

– మోడీ సర్కార్‌ ఎర్ర తివాచీ
– పేదల సొమ్ముతో పెద్దల రుణాలు మాఫీ.. ఆర్‌బీఐ తాజా ఆదేశాల సారాంశం ఇదే
మీరు బ్యాంకుకు సకాలంలో రుణం చెల్లించకపోతే ఏమవుతుంది? అధికారులు మీ ఇంటి మీద పడతారు. చెంబూ, గ్లాసూ, కంచం, మంచం… ఇలా అన్నీ వీధిలోకి గిరాటేస్తారు. ఇంటికి తాళం వేస్తారు. మిమ్మల్ని రోడ్డున పడేస్తారు. మరి బడా బాబులు రుణం ఎగవేస్తేనో? సాదరపూర్వక స్వాగతం పలికి రాజీ పరిష్కారం చేసుకుంటారు. కొందరి రుణాలు మాఫీ చేస్తారు కూడా. అంటే చిన్న చిన్న మదుపుదారులు దాచుకున్న కష్టార్జితం సొమ్మును బడా బాబుల రుణాల మాఫీకి వినియోగిస్తారు. సొమ్మొకడిది… సోకొకడిది అంటే ఇదే!
న్యూఢిల్లీ : రిజర్వ్‌బ్యాంక్‌ తాజాగా విడుదల చేసిన సర్క్యులర్‌ రుణాల ఎగవేతదారులకు వరంగా మారుతోంది. మోసానికి పాల్పడిన ఎగవేతదారులు, కంపెనీలు తాము బకాయి పడిన బ్యాంకులతో, బ్యాంకేతర ఆర్థిక సంస్థలతో రాజీ చేసుకొని సమస్యను పరిష్కరించుకోవచ్చు. లేదా సాంకేతికంగా బకాయిని రద్దు చేయించుకోవచ్చు. ఇదీ ఆ సర్క్యులర్‌ సారాంశం. బ్యాంకింగ్‌ నిర్వచనం ప్రకారం తీసుకున్న రుణాలను చెల్లించే స్థోమత ఉన్నప్పటికీ వాటిని ఉద్దేశపూర్వకంగానే నిరాకరించే వారిని ఎగవేతదారులు అంటారు. ఇక తప్పుడు పత్రాలు, సమాచారంతో కావాలనే బ్యాంకులను మోసం చేసి డబ్బును దుర్వినియోగం చేసే వారిని మోసగాళ్లు అంటారు. ఈ రెండూ క్రిమినల్‌ నేరాలే. అలాంటి నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ అందుకు బదులుగా వారికి వెసులుబాటు కల్పిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రుణాలు తీసుకున్న వారు మోసానికి పాల్పడినా, ఉద్దేశపూర్వకంగా ఎగవేసినా, అక్రమాలు చేసినా వారిని అనర్హులుగా పరిగణించాలని ఆర్‌బీఐ 2019లో జారీ చేసిన సర్క్యులర్‌ ద్వారా బ్యాంకులను ఆదేశించింది. ఈ సంవత్సరం జూన్‌ 8వ తేదీ వరకూ ఇలాంటి సర్క్యులర్లే జారీ చేస్తూ వచ్చింది. అయితే అనూహ్యంగా తాజాగా జారీ చేసిన సర్క్యులర్‌ అందరినీ నివ్వెరపరుస్తోంది. నేరస్థులైన రుణాల ఎగవేతదారులు, మోసకారులకు సహాయపడేలా ఉన్న ఈ సర్క్యులర్‌ వారి పాలిట వరంగా మారింది. బోర్డు అనుమతితో అలాంటి వారితో రాజీ పరిష్కారం చేసుకోవచ్చునని అందులో స్పష్టం చేసింది. గతంలో జారీ చేసిన సర్క్యులర్లకు ఇది పూర్తి విరుద్ధం. ఎగవేతదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వారితో రాజీ చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తోంది.
రాజీతో అనర్థాలు
రాజీ పరిష్కారాలతో అనేక అనర్థాలు చోటుచేసుకుంటాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. రుణం రద్దయ్యాక ఎగవేతదారుడు మరోసారి దర్జాగా, కొత్తగా అప్పు తీసుకోవచ్చు. అతని సిబిల్‌ రేటింగ్‌ మెరుగుపడుతుంది. అతని సమాచారం యావత్తూ మల్లెపూవులా స్వచ్ఛంగా ఉంటుంది. రుణాలు తీసుకునే మంచి వ్యక్తులు కూడా ఈ తతంగాన్ని గమనించి తాము కూడా ఎగవేతకు పాల్పడవచ్చు. దీంతో బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి వస్తుంది.
లాభపడేది ఎవరు?
ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో లాభపడేది ఎవరు? 2018లో 5,600 మంది బ్యాంక్‌ రుణాలకు ఎగనామం పెట్టారు. వీరిలో పదిహేను శాతం మంది గుజరాతీలే. ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు రుణాలు ఎగవేసిన ఏబీజీ షిప్‌యార్డ్‌ (రిషి అగర్వాల్‌), విన్‌సమ్‌ డైమండ్స్‌ (జతిన్‌ మెహతా) సహా పలు సంస్థలు, వ్యక్తులు అధికారంలో ఉన్న వారికి సన్నిహితులే. వీరిలో కొందరు విదేశాలకు చెక్కేశారు. ఎబీజీ షిప్‌యార్డ్‌ కంపెనీ అధిపతి రిషి అగర్వాల్‌ 28 బ్యాంకులను రూ.23,000 కోట్ల మేర మోసం చేశాడు. ఇప్పుడు ఆయన రాజీ పరిష్కారం చేసుకుంటున్నాడు. మెహతాదీ అదే దారి. ఆయన అదానీకి సన్నిహిత బంధువు. ఆయన కూడా విదేశాలకు పారిపోయాడు. ఆర్‌బీఐ సర్క్యులర్‌ పుణ్యమా అని ఇప్పుడు ఆయన తిరిగి దేశంలో అడుగు పెట్టవచ్చు. విజరు మాల్యా, మేహుల్‌ చోక్సీ, నీరవ్‌ మోడీ తదితరులు కూడా ఇదే దారిలో నడవవచ్చు. స్వదేశంలో ప్రవేశించిన తర్వాత వారు అధికార పార్టీకి ఎన్నికల నిధులు అందిస్తారు.
పారు బకాయిలు ఎందుకు తగ్గాయంటే…
జాతీయ లా ట్రిబ్యునల్‌ కంపెనీ (ఎన్‌సీఎల్‌టీ) ఇప్పటికే రుణాల ఎగవేతదారులకు సహాయపడుతోంది. ఇందుకు ఎన్‌సీఎల్‌టీని పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ తీవ్రంగా తప్పుపట్టింది కూడా. గత పది సంవత్సరాలలో దేశంలో పారు బకాయిలు తగ్గిపోయాయి. రుణాలు పొందిన వారు ఆ సొమ్మును బ్యాంకులను తిరిగి చెల్లించడం వల్లనే పారు బకాయిలు తగ్గాయని భావిస్తే అది పొరబాటే. బ్యాంకులు అక్షరాలా రూ.13,22,309 కోట్ల మేర పారు బకాయిలను రద్దు చేయడం వల్లనే అవి తగ్గాయన్నది వాస్తవం.
రాజకీయ ప్రయోజనాల కోసమే…
ఇప్పుడు అధికార పార్టీకి అతి పెద్ద రాజకీయ ప్రయోజనాన్ని కలిగించిన ఉదంతం గురించి తెలుసుకుందాం. గత తొమ్మిది సంవత్సరాల కాలంలో బ్యాంకులు 42 కోట్ల మందికి రూ.24,05,753 కోట్ల మేర ముద్ర రుణాలు అందించాయి. వీటితో పాటు బ్యాంకేతర ఆర్థిక కంపెనీలకు రుణాలు ఇవ్వాల్సిందిగా ఆర్థిక మంత్రి వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు లక్ష్యాలు నిర్దేశించారు. ఇదంతా బహుమతిగా ఇస్తున్నదని, రుణాలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని పలు చోట్ల అధికార పార్టీ నాయకులు రుణ గ్రహీతలకు చెప్పేశారు. ఇంకేముంది? మొండి బాకీలు పెరిగిపోయాయి. బ్యాంకులు 25% రుణాలను మాఫీ చేసి, 75% రుణాలను రుణ గ్యారంటీ నిధి నుండి పొందాయి. కానీ రుణాలు తీసుకున్న వారి సిబిల్‌ స్కోరుపై ప్రభావం పడింది. వీరిలో చాలా మంది ఉద్దేశపూర్వకంగానే రుణాలు ఎగవేశారు. ఇప్పుడు వారు ఎంతో కొంత చెల్లించి, సిబిల్‌ స్కోరును పొందవచ్చు. తిరిగి రుణాలు తీసుకోనూ వచ్చు. రుణాల మాఫీ, రాజీ పరిష్కారాలు ప్రజలకు, డిపాజిటర్లకు ఏ మాత్రం ప్రయోజనం కలిగించవు. ఈ చర్యలు చట్ట విరుద్ధం. దేశంలోని 100 కోట్ల మంది చిన్న మదుపుదారుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి తమ ఎన్నికల ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలు బ్యాంకులను ఉపయోగించుకోవడం సరికాదు.
యూనియన్ల నిరసన
ఆర్‌బీఐ నిర్ణయాన్ని అఖిలభారత బ్యాంక్‌ అధికారుల సమాఖ్య, అఖిలభారత బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం తీవ్రంగా ఖండించాయి. తాజా ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. లేకుంటే డిపాజిటర్ల ప్రయోజనాలు దెబ్బతింటాయని, ఎగవేతదారులు పెరిగిపోతారని, బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందని తెలిపాయి. చివరికి ఈ వ్యవస్థ కుప్పకూలుతుందని హెచ్చరించాయి.
బోర్డులదే ఇష్టారాజ్యం
2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ ప్రభుత్వ రంగ బ్యాంకులకు డైరెక్టర్ల నియామకాలు చేపట్టలేదు. బ్యాంకుల బోర్డుల్ని బీజేపీ మద్దతుదారులతో నింపేశారు. డైరెక్టర్లను నియమించకపోవడాన్ని ఆర్‌బీఐ ఏనాడూ ప్రశ్నించలేదు. ఇలాంటి పరిస్థితులలో రాజీ పరిష్కారాలకు బోర్డులు ఏ విధంగా ఆమోదం తెలుపుతాయో ఎవరైనా ఊహించుకోవచ్చు. అధికారులు, ఉద్యోగుల మాదిరిగా బోర్డు సభ్యులకు ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. బ్యాంక్‌ సంఘాలు, యూనియన్లతో సంబంధం లేకుండా బోర్డు తీసుకునే నిర్ణయాలు సమాచార హక్కు చట్టం కింద కూడా అందుబాటులో ఉండవు.
మోసాలు ఇవే…
ఈ సంవత్సరంలో ఇప్పటి వరకూ 13,530 మోసాలు జరిగాయని బ్యాంకులు ఆర్‌బీఐకి తెలిపాయి. 2021, 2022 సంవత్సరాలలో ప్రభుత్వ రంగ బ్యాంకులను రూ. 97,245 కోట్ల మేర మోసం చేశారు. గత ఐదు సంవత్సరాల కాలంలో
మోసాలు ఇవే…
బ్యాంకులను మోసం చేసిన ఉదంతాల కారణంగా బ్యాంకులకు వాటిల్లిన నష్టం రూ.3,76,400 కోట్లు. ఇలాంటి మోసకారులతో రాజీ పడడం సబబేనా? ఇది బ్యాంకులను దోపిడీ చేయడం కాక మరేమిటి? ఎన్‌సీఎల్‌టీ ద్వారా లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని మాఫీ చేశారు. కొన్ని బడా కార్పొరేట్‌ సంస్థలు కోలుకునేందుకు బ్యాంకులు మళ్లీ రుణాలు అందించాయి. ఆ సంస్థలు, వ్యక్తులు ఎన్నికల బాండ్లు, ఇతర పద్ధతుల ద్వారా రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తున్నారు. డిపాజిట్‌ చేసే చిన్న మదుపుదారులకు తక్కువ వడ్డీ చెల్లిస్తూ బ్యాంకులు లాభాలు మూటకట్టుకుంటున్నాయి. తక్కువ వడ్డీ తీసుకుంటూ, అధిక బ్యాంక్‌ ఛార్జీలు చెల్లిస్తూ వారు తమ జేబులకు చిల్లులు పెట్టుకుంటున్నారు. మరోవైపు తక్కువ మొత్తంలో రుణాలు తీసుకునే వారు సైతం అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తోంది.

Spread the love