– నష్టాలంటూ కష్టాల్లోకి నెడుతున్న యాజమాన్యం
– 9 ఏండ్లుగా పెరగని జీతాలు
– కార్మిక సంఘాలు లేవంటూ సర్కారు మొండివైఖరి
– తాడోపేడో అంటూ మరో ఐక్య పోరాటానికి సిద్ధమవుతున్న సంఘాలు
ఎస్‌ఎస్‌ఆర్ శాస్త్రి
”ఎవరికి చెప్పుకోవాలన్నా మా బాధ…చెప్పులు కొందామన్నా ఒకటికి రెండుసార్లు సోంచాయిస్తున్నాం. 8 గంటల పనిదినాలు పోయి చాలాకాలం అయ్యింది. ఏ సినిమా ఎంత కలెక్షన్ సాధించింది అన్నట్టే…ఏ ట్రిప్పుకు ఎంత కలెక్షన్ వచ్చిందనే లెక్కలే తప్ప, కాలుతున్న మా డొక్కల్ని యాజమాన్యం పట్టించుకోవట్లేదు. తొమ్మిదేండ్లుగా జీతాలు పెరగలేదు. ఖర్చులు మాత్రం పెరిగాయి. ఉప్పు, పప్పు సహా పిల్లల చదువుల ఫీజులూ పెరిగాయి. 25 ఏండ్లు దాటినా ఇంట్లో ఆడపిల్లలకు పెండ్లిండ్లు చేయలేక మానసికంగా కుంగిపోతున్నాం. పనిలో సుఖం లేదు. ఆఫీసర్ల బెదిరింపులు, ఛీత్కారాలు భరిస్తూ, ఆత్మాభిమానం చంపుకొని బతుకుతున్నాం” ఇది సగటు ఆర్టీసీ కార్మికుడి అరిగోస. వాళ్ల బాధలో వాస్తవం ఉంది. డిమాండ్లలో నిజాయితీ ఉంది. కానీ ఆ రెంటినీ పరిష్కరించాల్సిన ప్రభుత్వం, యాజమాన్యంలో మాత్రం కాఠిన్యం ఉంది. వేదికలపై తాము కార్మికుల పక్షమేనంటూ యాజమాన్యం గప్పాలు కొట్టడమే తప్ప, వారికి ఆర్థికంగా రావల్సిన ఏ ఒక్క ప్రయోజనాన్ని సకాలంలో అందించిన దాఖలా లేదు. 2015లో పెరిగిన 44 శాతం జీతం తప్ప, ఇప్పటి వరకు వాళ్లకు అదనంగా ఇచ్చింది ఏమీ లేదు. 2017, 2021లో జరగాల్సిన వేతన సవరణ ఒప్పందాలు జరగలేదు. ప్రతి ట్రిప్పుకూ ఇంత కలెక్షన్ తేవాలంటూ డిపో మేనేజర్లు నిర్మొహమాటంగా ఎస్‌ఆర్‌లపైనే రాసిచ్చి, టార్గెట్లు పెడుతున్నారు. ప్రయివేటు వాహనాలకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి, ఊబర్, ఓలా వంటి కార్పొరేట్ ఆన్‌లైన్ రవాణా సంస్థల్ని పెంచి పోషిస్తూ, ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) రావట్లేదంటే… డ్రైవర్, కండక్టర్లు ఏం చేస్తారు? గతంలో 55 రోజులు సమ్మె చేస్తే, ఉద్యోగాల్లోంచి పీకేస్తామని బెదిరించిన సర్కారు.. వాళ్ళ ఉద్యోగాలు వాళ్లకే తిరిగిచ్చి, ‘రాచరిక దయ’ చూపిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీలో అదే పరిస్థితి కనిపిస్తోంది. కలెక్షన్ తెస్తే డ్యూటీ…లేకుంటే స్పేర్ డ్యూటీ…అదేమని ప్రశ్నిస్తే ఆబ్సెంట్ లేదా సెలవులు పెట్టుకొని వెళ్లండంటూ డిపో మేనేజర్ల బెదిరింపులు. ఫోర్స్‌లోనే ఉన్న స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్). ఆర్టీసీని బాగుచేస్తున్నామనే అధికారిక ప్రకటనలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో జరుగుతుంది. అద్దె బస్సులు పెరిగాయి. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రయివేటు తెల్ల ఏనుగుల్ని పోషించమని ఆర్టీసీపైకి సర్కారు ఉసిగొల్పింది. దీనివల్ల సంస్థకు నష్టం వస్తుందని కార్మిక సంఘాలు లెక్కలు కట్టి నెత్తీనోరు కొట్టుకొని చెప్తున్నా ప్రభుత్వం, యాజమాన్యం చెవికి ఎక్కించుకుంటున్న దాఖలాలే లేవు. బస్సుల సంఖ్య తగ్గి, డిపోలు మూతపడుతున్నాయి. సంస్థలో ఉద్యోగుల సంఖ్య తగ్గుతున్నది. 2021-22లో ఆర్టీసీలో 8,902 షెడ్యూళ్లతో వంద కిలోమీటర్ల మేర బస్సులు తిరిగాయి. 2022-23లో 8618 షెడ్యూళ్లు నడిపి, 120 కి.మీ., తిప్పారు. అంటే 284 షెడ్యూళ్లు తగ్గించి, కార్మికులతో 20 కోట్ల కి.మీ., అదనంగా పనిచేయించుకున్నారు. వ్యక్తిగత జీవితాలను కోల్పోతున్న కార్మికులు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కుంగిపోతున్నారు. హైదరాబాద్‌లో మెట్రోలైనర్ బస్సు నడుపుతున్న ఓ ఆర్టీసీ డ్రైవర్ చెప్పులు తెగిపోయి, కాళ్లు వాచి ఉన్నా, అలాగే డ్రైవింగ్ చేస్తుండటాన్ని ‘నవతెలంగాణ’ క్షేత్రస్థాయిలో గమనించింది. ఆస్పత్రికి వెళ్లి చూపించుకొని, రెస్ట్ తీసుకోవచ్చు కదా…అని ఆ డ్రైవర్‌ను అడిగితే…చావుకి వెళ్తే సెల్ఫీలు వాట్సప్ చేయమని డిపో మేనేజర్లు అడుగుతున్నారు సార్…ఇక సెలవులు ఎక్కడ ఇస్తారు? అంటూ ఆవేదనగా చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో అసలు ఆర్టీసీ ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ బస్సు చక్రం ఆగితేనే సకల జనుల సమ్మె సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అలాంటి త్యాగాలు చేసిన ఆర్టీసీ కార్మికుల బతుకులు ఇప్పుడు ఆగం అవుతున్నాయి.
సంఘాలు లేవు…
ఆర్టీసీలో కార్మిక సంఘాలు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ 55 రోజుల సమ్మె విరమణ అనంతరం మౌఖికంగా చెప్పారు. ఆ స్థానంలో వెల్ఫేర్ కమిటీలు పనిచేస్తాయన్నారు. వీటివల్ల కార్మికులకు ఒనగూరిన ప్రయోజనాలు ఏమీ లేవు. దీనిపై ఆర్టీసీలోని ఓ యూనియన్ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ యాజమాన్యం, కార్మిక శాఖను ఆదేశిస్తూ తీర్పు ఇచ్చింది. దీని అమలును ఆ రెండూ తుంగలో తొక్కాయి.
ఐక్యమవుతున్న సంఘాలు
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సంస్థలోని అన్ని కార్మిక సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఐక్యకార్యాచరణతో ముందుకు వస్తాయనే ఆశాభావం కార్మికుల్లో కనిపిస్తున్నది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సమస్యలు పరిష్కరిస్తామనీ, వేతన సవరణకు ఎన్నికల నిబంధనావళి నుంచి మినహాయింపు ఇవ్వాలనీ అధికారులతో లేఖలు రాయించారు. ఆ ఎన్నిక జరిగిపోయి 8 నెలలు దాటినా, ఇప్పటికీ అప్పటి వాగ్దానాలు అమలు కాలేదు. సర్కారు నమ్మకద్రోహంపై కార్మికులు, కార్మిక సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, యాజమాన్యం ఆర్టీసీ కార్మికుల సమస్యలపై స్పందించి, పరిష్కరించాలి. వారికి న్యాయబద్ధంగా చెల్లించాల్సిన సీసీఎస్, పీఎఫ్ తదితర బకాయిలన్నీ ఇవ్వాలి. ప్రభుత్వాన్ని ఆర్థికసాయం చేయమని అడగడాన్ని యాజమాన్యం నామోషీగా భావించడం మానేయాలి. ప్రభుత్వం సంస్థకు ఇవ్వాల్సిన సొమ్మును వెంటనే చెల్లించాలి.