– ఈడీ డైరెక్టర్ పదవీ కాలం పొడిగింపు చట్టవిరుద్ధం : సుప్రీంకోర్టు
– పదవి నుంచి వైదొలగడానికి మిశ్రాకు 31 వరకు గడువు
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ పెద్దల కనుసన్నల్లో పని చేస్తున్నాయనే ఆరోపణల నడుమ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజరు కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని పొడిగించడం చట్ట విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మిశ్రా పదవీకాలం పొడిగింపు చెల్లదని పేర్కొంది. ఈ పదవి నుంచి వైదొలగడానికి ఆయనకు ఈ నెల 31 వరకు గడువునిచ్చింది. మిశ్రా పదవీ కాలాన్ని పొడిగించటాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేతలు జయ ఠాకూర్, రణదీప్ సింగ్ సూర్జేవాలా, టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా, టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే, కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించింది. సుదీర్ఘ విచారణ తరువాత మే నెలలో తీర్పును రిజర్వ్ చేసింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవారు, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సంజరు కరోల్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం వెలువరించింది. ఈడీ డైరెక్టర్‌గా సంజరు మిశ్రా పదవీ కాలాన్ని పొడిగించడం సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ 2021లో ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని పేర్కొంది. 2021 నవంబరు తర్వాత ఆయన పదవీ కాలాన్ని పొడిగించరాదని 2021నాటి తీర్పులో సుప్రీంకోర్టు మాండమస్ జారీ చేసిందని గుర్తుచేసింది. ఈడీ డైరెక్టర్ పదవీ కాలాన్ని పొడిగించేందుకు చట్టాన్ని చేసే అధికారం చట్టసభలకు ఉందనీ, అయితే మిశ్రా పదవీ కాలాన్ని పొడిగించరాదని 2021నాటి తీర్పు స్పష్టంగా చెప్తున్నదని ధర్మాసనం తెలిపింది. అయితే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టాల్లో సవరణలను సుప్రీంకోర్టు సమర్థించింది. సీబీఐ చీఫ్, ఈడీ డైరెక్టర్ పదవీ కాలం రెండేండ్లు పూర్తయిన తర్వాత మరో మూడేండ్ల వరకు పొడిగించేందుకు ఈ సవరణల వల్ల కేంద్ర ప్రభుత్వానికి అధికారం లభించింది. మిశ్రా మొదట 2018 నవంబరులో ఈడీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. రెండేండ్ల పదవీ కాలం పూర్తయిన తరువాత 2020 నవంబరులో ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. 2020 మే నెలలో ఆయన వయసు 60 సంవత్సరాలు నిండింది. 2020 నవంబర్ 13న ‘రెండేండ్ల’ కాలాన్ని ‘మూడేండ్ల’ కాలానికి మార్చే విధంగా రాష్ట్రపతి 2018 ఉత్తర్వును సవరించినట్టు పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ సవరణను సుప్రీంకోర్టు 2021 సెప్టెంబరులో ఆమోదించింది. మిశ్రాకు మరిన్ని పొడిగింపులు ఇవ్వవద్దని రూలింగ్ ఇచ్చింది. ఈ కేసులో అమికస్ క్యూరీ అయిన సీనియర్ న్యాయవాది కెవి విశ్వనాథన్ (ఇప్పుడు సుప్రీం కోర్టు న్యాయమూర్తి) ఫిబ్రవరిలో మిశ్రా పదవీకాలం పొడిగింపు చట్టవిరుద్ధమని సమర్పించారు.