ఆన్‌లైన్‌ గేమ్‌లపై 28 శాతం జీఎస్టీ…

– అదే బాటలో గుర్రపు పందెం, కాసినోలపై పన్ను.. ప్రయివేట్‌ సంస్థలు ఉపగ్రహ ప్రయోగాలకు మినహాయింపు
– మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో ట్రిబ్యునల్‌ బెంచ్‌ల ఏర్పాటు
– సినిమా హాళ్లలో ఆహార పదార్ధాలపై జీఎస్టీ 5 శాతానికి తగ్గింపు
– క్యాన్సర్‌ మందు దిగుమతిపై మినహాయింపు : 50వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం
– జీఎస్టీఎన్‌ను పీఎంఎల్‌ఏ కింద చేర్చడంపై ప్రతిపక్షాల అభ్యంతరం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఆన్‌లైన్‌ గేమ్స్‌, గుర్రపు పందెం, కాసినోల పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీ విధిస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. అలాగే క్యాన్సర్‌ మందు డినుటుక్సిమాబ్‌ దిగుమతిపై జీఎస్టీ మినహాయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన మంగళవారం నాడిక్కడ విజ్ఞాన్‌ భవన్‌లో 50వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐటీ సిస్టమ్‌ సంస్కరణలపై ఒక ప్రజెంటేషన్‌ జరిగింది. అనంతరం ముందస్తు చర్చ లేకుండానే వస్తు సేవల పన్ను నెట్‌వర్క్‌ (జీఎస్‌టీఎన్‌)ని మనీ-లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద చేర్చడంపై ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, ఢిల్లీ రాష్ట్రాలు ఈ అంశాన్ని లేవనెత్తాయి. సమావేశ అనంతరం నేషనల్‌ మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడారు. ”ఫుడ్‌ ఫర్‌ స్పెషల్‌ మెడికల్‌ పర్పస్‌ (ఎఫ్‌ఎస్‌ఎంపీ) వంటి కీలకమైన ఫార్మా ఉత్పత్తులపై జీఎస్టీని మినహాయించార. సినిమా హాళ్లలో అందించే ఆహార పదార్థ్థాలపై జీఎస్టీ రేటును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని నిర్ణయించాం. పశ్చిమ బెంగాల్‌లో రెండు, మహారాష్ట్రలో ఏడు అప్పిలేట్‌ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో మొదటి దశలో నాలుగు జీఎస్‌టీఏటీ బెంచ్‌లను, రెండవ దశలో మరో మూడు బెంచ్‌లను ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో జీఎస్టీ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌లు ఎక్కువగా రాష్ట్రాల రాజధాని నగరాల్లో, హైకోర్టు బెంచ్‌లు ఉన్న చోట ఏర్పాటు చేయనున్నాం. ప్రయివేట్‌ సంస్థలు ఉపగ్రహ ప్రయోగ సేవలకు జీఎస్టీ మినహాయింపు, ఎంయూవీలపై 22 శాతం సెస్‌ రేటును కౌన్సిల్‌ ఆమోదించింది. అయితే సెడాన్‌ జాబితాలో చేర్చలేదు. కరిగే పేస్ట్‌, ఎల్‌డీ స్లాగ్‌తో సహా నాలుగు వస్తువులపై రేట్లు 18 శాతం నుండి 5 శాతానికి తగ్గించాం. జీఎస్టీ చట్టంలో సవరణ తరువాత మార్పులు అమల్లోకి వస్తాయి” అని తెలిపారు.
ఆన్‌లైన్‌ గేమింగ్‌, క్యాసినోలపై 28 శాతం జీఎస్టీకి సంబంధించిన నిర్ణయాలు ఏదైనా ప్రత్యేక పరిశ్రమను లక్ష్యంగా చేసుకోవడం కాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ఈ నిర్ణయాలు తీవ్రమైనవని, గోవా, సిక్కిం వంటి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారితో సహా సభ్యులందరితో సంప్రదించిన తరువాతే తీసుకున్నామని తెలిపారు. పర్యాటక రంగంలో క్యాసినో కీలక భాగమని ఆమె అన్నారు. ”జీఎస్టీ కౌన్సిల్‌ ఉద్దేశం కాసినోలతో ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమ లేదా రాష్ట్రాలను దెబ్బతీయడం కాదు. కొన్ని రాష్ట్రాలు తమ ఆందోళనలను వ్యక్తం చేశాయి. కానీ ఒక నైతిక ప్రశ్న ఉంది. మనం వాటిని నిత్యావసర వస్తువుల కంటే ఎక్కువగా ప్రోత్సహించ గలమా? కౌన్సిల్‌ ఈ విషయాన్ని లోతుగా చర్చించి, అర్థం చేసుకుని, 2-3 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న నిర్ణయం తీసుకుంది. సమస్య చాలా సంక్లిష్టమైనది” అని ఆర్థిక మంత్రి సీతారామన్‌ అన్నారు. నకిలీ ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటిసి)కు వ్యతిరేకంగా పన్నుల శాఖ చేపట్టిన డ్రైవ్‌లో మొత్తం రూ.17,000 కోట్ల పన్ను ఎగవేత జరిగిందని రెవెన్యూ కార్యదర్శి సంజరు మల్హోత్రా తెలిపారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ కోరుకునే వ్యక్తి బ్యాంక్‌ ఖాతా వివరాలు ఇప్పుడు తప్పనిసరి అని సీబీఐసీ చైర్మెన్‌ వివేక్‌ జోహ్రీ తెలిపారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ పైలట్‌ అధికారిక ప్రాతిపదికన ఉంచామని ఆయన అన్నారు. ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి మర్లెనా మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీఎన్‌ను పీఎంఎల్‌ఏ కింద చేర్చడంపై నోటిఫికేషన్‌ జారీ చేయడానికి ముందే జీఎస్టీ కౌన్సిల్‌లో చర్చించాల్సి ఉందని అన్నారు. దీనిపై చాలా రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయని తెలిపారు. పంజాబ్‌ ఆర్థిక మంత్రి హర్పాల్‌ సింగ్‌ చీమా ఇది ‘పన్ను ఉగ్రవాదానికి సమానం’ అని ధ్వజమెత్తారు. చిన్న వ్యాపారులను భయపెట్టడమేనని విమర్శించారు.
తెలంగాణకు జీఎస్టీ పరిహారం ఇవ్వండి జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో మంత్రి టి. హరీశ్‌ రావు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
2020-21, 2022-23 సంవత్సరాలకు గాను తెలంగాణకు రావాల్సిన రూ.698.97 కోట్ల జీఎస్టీ పరిహారం చెల్లించాలని రాష్ట్రమంత్రి టి.హరీశ్‌ రావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడిక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షత జరిగిన 50వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక, వైద్య శాఖ మంత్రి టి.హరీశ్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మాట్లాడుతూ ”2021-22 కాలానికి రూ.164.43 కోట్లు బకాయి ఉంది. ఏజీ ఇప్పటికే సర్టిఫికేట్‌ జారీ చేసింది. కాబట్టి, ఈ పరిహారం మొత్తాన్ని వీలైనంత త్వరగా విడుదల చేయాలి. 2022-23 సంవత్సరానికి రూ.534.54 కోట్లు పెండింగ్‌లో ఉంది. దీన్ని ఏజీ ధ్రువీకరించాలి” అని అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్రానికి ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌ కింద ఇంటర్‌ హెడ్‌ నగదు బదిలీ ఖాతాలోకి రూ.112.99 కోట్లు రావాలని, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మే నెలలో ఆర్థిక మంత్రిత్వ శాఖ రెవెన్యూ డైరెక్టర్‌కు లేఖ రాస్తూ ఈ మొత్తాన్ని విడుదల చేయాలని అభ్యర్థించారని తెలిపారు. ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. తెలంగాణ వంటి వినియోగ రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని పన్ను ఇన్‌ వాయిస్‌ నిబంధనలకు సవరణలను సిఫార్సు చేసినందుకు లా కమిటీ సకాలంలో జోక్యం చేసుకోవడం అభినందనీయ మన్నారు. అదే సందర్భంలో లావాదేవీలు చేస్తున్న ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్‌ చేయబడిన నిర్దిష్ట పన్ను చెల్లింపుదారులు తప్పుగా సరఫరా స్థలాన్ని ప్రకటించారు. దాంతో వినియోగ స్థితి పేరు తప్పుగా ఉంటుందని, దీనివల్ల జీఎస్టీ ఆదాయం మళ్లిందని అన్నారు. ఐసీఐసీఐ లిమిటెడ్‌, మహారాష్ట్ర విషయంలో తెలంగాణ రాష్ట్రానికి రూ.82.38 కోట్ల బకాయిలు ఉన్నాయని, ఈ సమస్య కేవలం తెలంగాణాలోనే కాదు, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, లడఖ్‌, ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఉందని అన్నారు.
ఈ సమస్యను గతంలో (47వ జీఎస్టీ సమావేశం) కౌన్సిల్‌ దృష్టికి కూడా తీసుకొచ్చానని, దానికి రెవెన్యూ కార్యదర్శి త్వరితగతిన పరిష్కారాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయినప్పటికీ, ఇప్పటి వరకు అటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయలేదని, సమస్య పరిష్కరించలేదని అన్నారు. అందువల్ల, ఈ సమస్యపై ప్రత్యేకంగా ఒక మంత్రుల గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.
వెనుకబడిన జిల్లాలకు నిధులు విడుదల చేయాలి
తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.
2015-16, 2016-17, 2017-18, 2018-19, 2020-21 సంవత్సరా లకు గాను ఏడాదికి రూ.450 కోట్లు మేర నిధులు ఇచ్చా రని, 2014-15, 2019-20, 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాలకు గాను తెలంగాణకు నిధులు మంజూరు చేయలేదని తెలిపారు. అందువల్ల తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు గాను ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love