నేటి నుంచి పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు

– ఆర్థిక బిల్లు ఆమోదమే తమ ప్రాధాన్యత : ప్రభుత్వం
– ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం వ్యూహం
– పెండింగ్‌లో 35 బిల్లులు
న్యూఢిల్లీ: నేటి నుంచి పార్లమెంట్‌ రెండో విడత బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్‌కు సంబంధించిన ఆర్థిక బిల్లును ఆమోదించడమే తమ ప్రాధాన్యతని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. బీజేపీ రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా కేంద్ర ఏజెన్సీల చర్య, అదానీపై ఆరోపణలు వంటి అంశాలను లేవనెత్తడానికి ప్రతిపక్షాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. సోమవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2022-23 కోసం రెండవ బ్యాచ్‌ గ్రాంట్ల కోసం అనుబంధ డిమాండ్లను సమర్పించనున్నారు. 2023-24 సంవత్సరానికి గాను జమ్మూ కాశ్మీర్‌ కేంద్ర పాలిత ప్రాంత బడ్జెట్‌ను కూడా ఆమె లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. సమాఖ్య నిర్మాణంపై దాడి, సంస్థల ”దుర్వినియోగం”కు వ్యతిరేకంగా నిరసనకు వామపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే సిద్ధమవుతున్నాయి. ఈ సమావేశాలు మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్‌ 6 వరకు కొనసాగుతాయి.
అదానీ-హిండెన్‌బర్గ్‌ అంశంపై ప్ర భుత్వం నుంచి సమాధానాలు కోరతామని ప్రతిపక్ష నేతలు తెలిపారు. జాయింట్‌ పార్లమెంటరీ కమిటి (జేపీసీ) విచారణకు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీల నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలపై ఇటీవల సీబీఐ, ఈడీ దాడులు నిర్వహించటంతోపాటు.. అరెస్టు చేయడంపైనా ప్రతిపక్షాలు పెద్దఎత్తున ఆందోళనకు దిగే అవకాశం ఉంది. ఎల్‌ఐసీ, ఎస్‌బీఐల రిస్క్‌ ఎక్స్‌పోజర్‌, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అంశాలను కూడా ప్రతిపక్షాలు లేవనెత్తనున్నాయి. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలపై ‘రాజకీయ ప్రతీకార’ అంశాన్ని, ఉపాధి హామీ వంటి పథకాలకు నిధులను నిలిపివేయడంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ మాట్లాడుతూ ఆర్థిక బిల్లును ఆమోదించడమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశమని అన్నారు. రైల్వేలు, పంచాయతీరాజ్‌, పర్యాటకం, సంస్కృతి, ఆరోగ్య మంత్రిత్వ శాఖల మంజూరు డిమాండ్లపై చర్చలు జరుపుతామని చెప్పారు. ఆర్థిక బిల్లు ఆమోదం పొందిన తరువాత, ప్రతిపక్షాలు లేవనెత్తిన డిమాండ్లను పరిశీలిస్తామని అన్నారు.
పెండింగ్‌లో 35 బిల్లులు
పార్లమెంట్‌ ఉభయ సభల్లో 35 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రాజ్యసభలో 26 బిల్లులు, లోక్‌సభలో 9 బిల్లులు ఆమోదం కోసం ఉన్నాయి. మల్టీ స్టేట్‌ కో ఆపరేటివ్‌ సొసైటీస్‌ (సవరణ) బిల్లు, జన్‌ విశ్వాస్‌ (నిబంధనల సవరణ) బిల్లులను ప్రభుత్వం గత శీతాకాల సమావేశాల్లో సంయుక్త కమిటీకి నివేదించింది. ప్రస్తుతం వాటిని ప్యానెల్‌ పరిశీలిస్తోంది.
రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నవి..
రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో అంతర్‌ రాష్ట్ర నదీ జలాల వివాదాల (సవరణ) బిల్లు, రాజ్యాంగం (షెడ్యూల్డ్‌ తెగలు) ఆర్డర్‌ (మూడో సవరణ) బిల్లు, రాజ్యాంగం (షెడ్యూల్డ్‌ తెగలు) ఆర్డర్‌ (ఐదో సవరణ) బిల్లులు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందాయి. ఏ పార్లమెంటరీ పరిశీలనకు సూచించబడనీ, ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్న బిల్లుల్లో తమిళనాడు లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ (రద్దు) బిల్లు-2012, పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాలలో షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల ప్రాతినిధ్య పునర్నిర్మాణం (మూడో) బిల్లు-2013, ఢిల్లీ అద్దె (రద్దు) బిల్లు-2013, రాజ్యాంగం (షెడ్యూల్డ్‌ తెగలు) ఆర్డర్‌ (సవరణ) బిల్లు-2019 ఉన్నాయి. రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న అనేక బిల్లులు పార్లమెంటు స్టాండింగ్‌ కమిటీ పరిశీలనతో క్లియర్‌ చేయబడ్డాయి. అస్సాం లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ బిల్లు-2013, బిల్డింగ్‌, ఇతర నిర్మాణ కార్మికుల సంబంధిత చట్టాల (సవరణ) బిల్లు-2013, రాజ్యాంగం ( 79వ సవరణ బిల్లు)-1992 (శాసన సభ్యులకు చిన్న కుటుంబ నిబంధనలు), ఢిల్లీ అద్దె (సవరణ) బిల్లు-1997, ఢిల్లీ అద్దె (రద్దు) బిల్లు-2013, ఎంప్లారుమెంట్‌ ఎక్స్ఛేంజ్‌ (ఖాళీల తప్పనిసరి నోటిఫికేషన్‌) సవరణ బిల్లు, ఇండియన్‌ మెడిక్‌లైన్‌ బిల్లు-2013, హౌమియోపతి ఫార్మసీ బిల్లు-2005, ఇంటర్‌-స్టేట్‌ మైగ్రెంట్‌ వర్క్‌మెన్‌ (ఉపాధి నియంత్రణ అండ్‌ సేవా నిబంధనలు) బిల్లు, మైన్స్‌ (సవరణ) బిల్లు-2011, మునిసిపాలిటీల నిబంధనలు (షెడ్యూల్డ్‌ ప్రాంతాలకు పొడిగింపు) బిల్లు-2001, రాజస్థాన్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ బిల్లు-2013, రిజిస్ట్రేషన్‌ (సవరణ) బిల్లు-2013, సీడ్స్‌ బిల్లు-2004, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సవరణ) బిల్లు-2008, మధ్యవర్తిత్వ బిల్లు-2021 తదితర బిల్లులు రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నాయి.
లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్నవి..
లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న 9 బిల్లుల్లో రెండు బిల్లులు స్టాండింగ్‌ కమిటీకి పంపించారు. బాల్య వివాహాల నిషేధ (సవరణ) బిల్లు-2021, విద్యుత్‌ (సవరణ) బిల్లు-2022, డిఎన్‌ఎ టెక్నాలజీ (యూజ్‌ అండ్‌ అప్లికేషన్‌) రెగ్యులేషన్‌ బిల్లు-2019, తల్లిదండ్రులు మరియు వృద్ధుల నిర్వహణ అండ్‌ సంక్షేమం (సవరణ) బిల్లు-2019, పోటీ (సవరణ) బిల్లుతో సహా స్టాండింగ్‌ కమిటీల నుండి పార్లమెంటు ఇప్పటికే నివేదికలను స్వీకరించిన మూడు బిల్లులు జాబితా చేయబడ్డాయి.

Spread the love