– అందుకే ప్రధాని మోడీ మణిపూర్ వెళ్లలేదు :
– కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
మణిపూర్‌లో మహిళలను హత్య చేయడమంటే, భారత మాతను హత్య చేయడమేనని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. అందుకే ప్రధాని మోడీ మణిపూర్ వెళ్లలేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై బుధవారం రెండోరోజు కూడా చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా చర్చలో పాల్గొన్న రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుప డ్డారు. ‘భారత్ అంటేనే ఓ గొంతు. భారత్ మన ప్రజల గొంతుక. అది ప్రజల హృదయ స్పందన. అలాంటి గొంతుకను మీరు( బీజేపీ ప్రభుత్వం) మణిపూర్‌లో హత్య చేశారు. అంటే భారత మాతను మీరు మణిపూర్‌లో హత్య చేశారు. మణిపూర్‌ప్రజలను హత్య చేయడంతో దేశాన్ని హత్య చేశారు. అందుకే మీ ప్రధాని మణిపూర్ వెళ్లడం లేదు. మీరు దేశ ప్రేమికులు కాదు. దేశ ద్రోహులు’ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
మణిపూర్ రెండుగా విభజన
ఇటీవలి తన మణిపూర్ పర్యటన అంశాలను, అక్కడ తనకు ఎదురైన అనుభవాలను రాహుల్ సభ దృష్టికి తీసుకెళ్లారు. ‘కొన్ని రోజుల క్రితం మణిపూర్ వెళ్లాను. అక్కడికి ప్రధాని మాత్రం వెళ్లలేదు. ప్రధాని దృష్టిలో మణిపూర్ లేదు. నేను ‘మణిపూర్’ అనే పదాన్ని వాడాను. కాని ఇకపై మణిపూర్ ఉండదు. దానిని రెండుగా విభజించారు. బీజేపీ ప్రభుత్వం దానిని రెండుగా విభజించి విఛ్చిన్నం చేసింది’ అని ధ్వజమెత్తారు. ‘నేను మణిపూర్‌లోని సహాయ శిబిరాలకు వెళ్లాను. నేను అక్కడ ఉన్న మహిళలు, పిల్లలతో మాట్లాడాను. ఇది మన ప్రధాని ఇంతవరకు చేయలేదు. నేను అక్కడ ఒక మహిళను’ అక్క, నీకు ఏమైంది?’ అని అడిగా, దీనికి ఆమె ‘నాకు ఒకే కొడుకు ఉన్నాడు. నా కండ్ల ముందే అతనిని కాల్చిచంపారు. రాత్రంతా, నేను అతని మృతదేహంతో కూర్చున్నాను. ఆ తరువాత భయంతో నేను నా ఇంటిని విడిచిపెట్టాను. నా బట్టలు, ఓ ఫొటో మాత్రమే నా దగ్గరే ఉన్నాయి’ అని ఆమె తెలిపిందని వివరించారు. అక్కడ ఉన్న మరొక స్త్రీని ‘మీకు ఏమైంది?’ అని అడగగానే, ఆమెకు జరిగింది గుర్తుకు వచ్చి వణికిపోవడం మొదలుపెట్టి తరువాత మూర్ఛపోయింది’అని వివరించారు. మణిపూర్‌లో భారత్‌ను హత్య చేశారని, దేశం ప్రాణం తీశారని దుయ్యబట్టారు.
దేశం మొత్తం కిరోసిన్ జల్లుతున్నారు
‘భారత సైన్యం ఒక్క రోజులో మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించగలదు. కానీ ప్రభుత్వం వారిని మోహరింపచేయటం లేదు. ఎందుకంటే ప్రభుత్వం మణిపూర్‌లో దేశాన్ని హత్య చేయాలనుకుంటుంది. ప్రధాని మోడీ ఇద్దరి మాటలు మాత్రమే వింటున్నారు. రావణాసురుడు కేవలం మేఘనాధుడు, కుంభకర్ణుడి మాటలే వింటారు. అదే మాదిరి మోడీ కేవలం అదానీ, అమిత్ షాల మాటలే వింటారు’ అని పేర్కొన్నారు. ‘మీరు దేశం మొత్తం కిరోసిన్ పోస్తున్నారు. మణిపూర్‌లో అలా చేసి నిప్పులు రేపారు. హర్యానాలో కూడా అదే చేస్తున్నారు’ అని రాహుల్ ధ్వజమెత్తారు. రాహుల్ ప్రసంగం సాగినంత సేపు అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, పరస్పర విమర్శల దాడి కొనసాగింది. ప్రతిపక్షాలు ‘ఇండియా’ అని నినాదాలు చేయగా, అధికార పక్ష సభ్యులు ‘మోడీ..మోడీ’ అంటు నినాదాలతో హౌరెత్తించారు. సభలో గందరగోళం ఏర్పడింది.
స్పీకర్‌కు ధన్యవాదాలు
అవిశ్వాస తీర్మానంపై రాహుల్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ”స్పీకర్ సార్, లోక్ సభలో నన్ను పునర్నియమించినందుకు ధన్యవాదాలు. గతంలో నేను మాట్లాడినపుడు, నేను అదానీ మీద, మీ సీనియర్ నేతల మీద ఎక్కువ దృష్టి పెట్టాను. అందువల్ల నేను బహుశా మిమ్మల్ని బాధించి ఉంటాను. ఈరోజు నేను అదానీ గురించి మాట్లాడను” అని చెప్పారు.
‘క్షమాపణ చెప్పాలి’ కిరణ్ రిజిజు, కేంద్ర మంత్రి
భారత దేశ ఆత్మను ప్రభుత్వం హత్య చేసిందని, మణిపూర్‌లో భారత మాత హత్యకు గురైందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనే ఈశాన్య రాష్ట్రాలను అవమానిస్తున్నారని మండిపడ్డారు.
వివాదంలో రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. లోక్ సభ నుంచి వెళ్లిపోతూ ఆయన మహిళా ఎంపీల వైపు చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. మహిళలంటే ఇష్టపడనివారు మాత్రమే ఇటువంటి పనులు చేయగలరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మహిళా మంత్రులు, ఎంపిలు ఆయనపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఆరోపణలలో ఎంత వాస్తవముందో అధికారులు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్, రాహుల్ గాంధీ తాను సభ నుంచి వెళ్తున్నట్టు అందరి చెప్పడానికి సైగు చేశారని, అంతేతప్ప ఆయన ఏఒక్కరిని ఉద్దేశించి ఫ్లయింగ్ కిస్ ఇవ్వలేదని తెలిపింది. అయితే రాహుల్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చినట్టు తాను చూడలేదని బీజేపీ మహిళ ఎంపీ హేమమాలిని తెలిపారు.