ఆటవిక రాజ్యం..!

– నగంగా ఊరేగింపు…ఆపై లైంగికదాడి
– విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, మహిళా కమిషన్‌
– నష్ట నివారణ చర్యలలో రాష్ట్ర ప్రభుత్వం
– ప్రధాన నిందితుడి అరెస్ట్‌
మణిపూర్‌ ఘటనపై భారతావని దిగ్భ్రాంతి
       హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించిన ఉదంతంపై భారతావని యావత్తూ తీవ్ర దిగ్భ్రాంతిని, ఆందోళనను వ్యక్తం చేసింది. ఈ ఘటనను ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి. ఈ దారుణంపై స్పందించిన సుప్రీంకోర్టు, జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా విచారణకు స్వీకరించాయి. రాష్ట్రంలో హింసాకాండ ప్రారంభమై 79 రోజులు గడిచినా స్పందించని ప్రధాని నరేంద్ర మోడీ ఎట్టకేలకు పెదవి విప్పారు. సంఘటనకు బాధ్యులైన వారిని వదిలి పెట్టబోమన్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో మణిపూర్‌ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది.
న్యూఢిల్లీ/ఇంఫాల్‌: మణిపూర్‌ మంటలు చల్లారటంలేదు. బీజేపీ మరింత ఆజ్యం పోస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజా ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటా మని, వారికి ఉరిశిక్ష పడేలా చేస్తామని ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ చెప్పారు. ప్రధాన నిందితుడిని అరెస్ట్‌ చేశామని పోలీసులు తెలిపారు. మరోవైపు మహిళల ను నగంగా ఊరేగించిన దృశ్యాల వీడియోను సామాజిక మాధ్యమాల నుండి తొలగించాలని కేంద్రం ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా వీడియోను ప్రసారం చేసిన ట్విట్టర్‌పై చర్యలకు ఉపక్రమించింది. కాగా మణిపూర్‌ ఘటనపై వెంటనే చర్చించాలంటూ విపక్షాలు చేపట్టిన ఆందోళనతో పార్లమెంట్‌ ఉభయసభలు స్తంభించాయి. ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే శుక్రవారం నాటికి వాయిదా పడ్డాయి.
శిక్షిస్తాం : బీరేన్‌
మణిపూర్‌ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌పై విమర్శల జడివాన కురుస్తోంది. ఆయనను వెంటనే పదవి నుంచి తప్పించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. అయితే దర్యాప్తు కొనసాగుతోందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. దోషులకు మరణశిక్ష పడేలా చేస్తామంటూ ట్వీట్‌ చేశారు. కాగా ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్‌ చేశారు.
సోషల్‌ మీడియాపై ఆగ్రహం
వీడియోను వైరల్‌ చేసిన సామాజిక మాధ్యమాలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని తక్షణమే తొలగించాలని ట్విట్టర్‌ సహా అన్ని మాధ్యమాలనూ ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ట్విట్టర్‌పై చర్యలకు కేంద్రం ఉపక్రమించిందని తెలుస్తోంది.
మండిపడిన విపక్షం
ఈ నెల 4న మణిపూర్‌లో జరిగిన దారుణానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఘాటుగా స్పందించాయి. మోడీ మౌనం, చేతకానితనం కారణంగానే మణిపూర్‌లో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో మండిపడ్డారు.
మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని దుండగుల చేతిలో పెట్టిందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో మానవత్వం చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో జరుగుతున్న హింసపై మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలని, ఏం జరుగుతోందో జాతికి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మౌనాన్ని దేశం ఎన్నటికీ క్షమించదని అన్నారు. రాజ్యాంగ బాధ్యతలను మోడీ గాలికి వదిలేశారని చెప్పారు.
అసలేం జరిగిందంటే..
– వివస్త్రలను చేసి ఊరేగించారు
– ఒకరిపై సామూహిక లైంగికదాడి
– పోలీసులే అప్పగించారు !
– మణిపూర్‌ బాధిత మహిళల వెల్లడి
గువహటి : రెండు మాసాలుగా హింసాకాండ, అల్లర్లతో అట్టుడికిపోతున్న మణిపూర్‌లో బుధవారం రాత్రి వెలుగు చూసిన ఒక వీడియోపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రగిలాయి. రాజకీయ పార్టీలు, నేతలే కాకుండా సుప్రీం కోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. కొంతమంది అల్లరి మూక 20, 40 ఏండ్లు వయసులో వున్న ఇద్దరు మహిళలను నగంగా రోడ్డుపై నడిపించుకుంటూ సమీపంలోని పొలాల వద్దకు తీసుకెళ్లడం ఆ వీడియోలో కనిపిస్తోంది. వారిలో కొంతమంది ఆ ఇద్దరి శరీర భాగాలు అసభ్యంగా తడుముతూ బలవంతంగా నెట్టుకుంటూ తీసుకెళుతున్నారు. మే 4న ఈ ఘటన జరగగా, మే 18న దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులే తమను ఆ దుండగులకు అప్పగించారని మణిపూర్‌ బాధిత మహిళల్లో ఒకరు తెలిపారు. ఈ ఘటనలోని బాధితురాల్లో ఒకరు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడారు. ”మా గ్రామంపై దాడి చేసిన అల్లరి మూకతోనే పోలీసులు కూడా వున్నారు. మమ్మల్ని ఇంటికి సమీపం నుంచి తీసుకెళ్లిన పోలీసులు కొంత దూరం వెళ్లిన తర్వాత రోడ్డుపై ఆ అల్లరి మూక దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులే మమ్మల్ని వారికి అప్పగించారు.” అని చెప్పారు. తన ఇంటి నుండి ఫోన్‌లో ఆమె ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడారు. తామిద్దరిలో చిన్నదైన మహిళపై పట్టపగలే దారుణంగా సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారని మరో మహిళ తెలిపింది. కాంగ్‌పోక్పి జిల్లాలోని తమ గ్రామంపై దాడి జరగడంతో తామందరం ఆశ్రయం కోసం సమీపంలోని అడవుల్లోకి పారిపోయామని చెప్పారు. ఆ తర్వాత తమని తోబుల్‌ పోలీసులు కాపాడారని, పోలీసు స్టేషన్‌కు తీసుకువస్తుండగా, స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో అల్లరి మూక తమని అడ్డగించి, వారితోపాటూ లాక్కెళ్లారని, ఆ సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తంగా అయిదు మంది ఆ గ్రూపులో వున్నారని చెప్పారు. యువ మహిళ తండ్రి, సోదరుడిని కూడా వారు చంపేసినట్లు తెలిపారు. ఆ గ్రూపులో కొద్దిమందిని గుర్తు పట్టగలనని బాధిత మహిళ చెప్పారు. వారిలో ఒకరు తన సోదరుడి స్నేహితుడిగా తెలుసునని చెప్పారు. తమని ఇలా నడిపించుకుంటూ తీసుకెళ్లిన ఘటనకు సంబంధించి వీడియో వుందన్న విషయం కూడా తమకు తెలియదని బాధిత మహిళ తెలిపారు. తాజాగా ఈ వీడియో వైరల్‌ అవడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయి.
ఎఫ్‌ఐఆర్‌ నమోదు, ఇద్దరు అరెస్టు
ఈ ఘటనపై గురువారం దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు తలెత్తిన నేపథ్యంలో తక్షణమే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఘటన జరిగిన రెండు మాసాల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.
మోడీ ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు? : సీతారాం ఏచూరి
మణిపూర్‌ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో సమాధానం చెప్పాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. ‘మణిపూర్‌ వివాదంపై స్పందించేందుకు మోడీకి 75 రోజులు పట్టింది. ఇంతకాలం ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? మణిపూర్‌ అంశాన్ని పార్లమెంట్‌లో చర్చకు ఎందుకు అనుమతించడం లేదు. ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు?’ అని ఏచూరి ప్రశ్నించారు. ‘మే 4న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దశ్యాలు నిన్న విడుదలయ్యాయి. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బీరేన్‌ సింగ్‌ ప్రభుత్వాన్ని మార్చాలి. బాలికలపై దాడి చేసిన నిందితులకు మరణశిక్ష విధించాలి. అది చట్టప్రకారమే అమలు చేయాలి.’ అని డిమాండ్‌ చేశారు.

Spread the love