– దద్దరిల్లిన పార్లమెంట్
– ఉభయ సభలు వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజైన గురువారం మణిపూర్ హింసాకాండ, అమానవీయ ఘటనలపై నిరసనలతో ఉభయ సభలూ దద్దరిల్లాయి. ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించినట్టు కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో మోడీప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మణిపూర్ హింస సహా ఇతర అంశాలపై పట్టుబడుతూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉభయసభ లు అట్టుడికాయి. ఇతర సభా కార్యక్రమాలన్నీ రద్దు చేసి మొదటి అంశంగా మణిపూర్ హింసపైనే చర్చించాలని ప్రతపక్షాలన్ని పట్టుబట్టడంతో ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగింది.లోక్ సభ సమావేశాలు ప్రారంభమైన తరువాత పంజాబ్‌లోని జలందర్ నుంచి ఎంపీగా గెలిపొందిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సుశీల్ కుమార్ రింకూ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల దివంగతులైన సభ్యులకు నివాళులర్పించిన తరువాత లోక్ సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు ”మణిపూర్, మణిపూర్..మణిపూర్ కాలిపోతుంది” అంటూ నినాదాల హౌరెత్తించాయి. ప్రతిపక్షాల ఆందోళన మధ్య సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలో…
ఇటీవల మరణించిన ఎంపీ హరిద్వార్ దూబేకు రాజ్యసభలో నివాళుర్పించిన తరువాత సభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్ష పార్టీల సభ్యులు మణిపూర్ హింసపై చర్చించాలని డిమాండ్ చేశారు. దీనికి రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్‌ఖర్ నిరాకరించడంతో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. అత్యంత సున్నితమైన ఈ అంశం ప్రాధాన్యతగా తీసుకోవాలని, దీనిపై ప్రధాని సమాధానమివ్వాలని ప్రతిపక్ష నేత మల్లికార్జునఖర్గే డిమాండ్ చేశారు. ప్రధాని నోరు విప్పాలన్నారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో సభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. సభ తిరిగి మొదలైన తరువాత కూడా మల్లికార్జున ఖర్గే మరోసారి తన నోటీసులపై చర్చించాలని కోరారు. మణిపూర్ తగలబడిపోతోందని, మహిళలపై ఆకృత్యాలు జరుగుతున్నాయని, మహిళలను నగంగా ఊరేగిస్తున్నారని, ఇంత జరుగుతున్నా ప్రధాని మౌనంగా ఉన్నారని ధ్వజమెత్తారు. సభలో సమాధానం ఇవ్వకుండా సభ బయట ప్రధాని దీనిపై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఖర్గే మాట్లాడుతున్న సమయంలో ఆయన మైక్ కట్ చేయడంతో కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
బాగున్నారా..!
సోనియాను పలకరించిన మోడీ
పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజు నేతలు ఒకరినొకరు పలుకరించుకోవడం సంప్రదాయం. దీని ప్రకారం మోడీ అనేక మంది నేతలను పలకరించారు. అదేవిధంగా సోనియా గాంధీ వద్దకు వెళ్లి, ఆమె ఆరోగ్యం గురించి అడిగారు. ఆమె తన ఆరోగ్యం బాగుందని బదులిచ్చారు. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ, మణిపూర్ పరిస్థితి గురించి సభలో చర్చించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని తమ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ కోరారని చెప్పారు. ఆమె ఆరోగ్యం గురించి మోడీ అడిగి తెలుసుకున్నపుడు ఆమె ఆయన ముందు ఈ డిమాండ్ పెట్టారని తెలిపారు.
ప్రతిపక్షాల భేటీ
పార్లమెంట్ ఉభసభలు ప్రారంభం కావడానికి ముందు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 26 పార్టీల నేతలు పాల్గొన్నారు. పార్లమెంట్‌లో వ్యవహరించాల్సిన వ్యూహం గురించి చర్చించారు.
చర్చకు సిద్ధమే: పియూశ్ గోయల్
ప్రతిపక్షాల ఆందోళనపై రాజ్యసభలో సభాపక్ష నేత పియూశ్ గోయల్ మాట్లాడుతూ ‘పార్లమెంట్‌ను నడపకూడదని ప్రతిపక్షాల వైఖరిని చూస్తే అర్థమవుతోంది. మణిపూర్ ఘటనలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసినా.. నిబంధనల ప్రకారం చర్చలు జరగనివ్వకుండా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి’ అని ఆరోపించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభలో మాట్లాడుతూ, సభా కార్యకలాపాలను శాంతియుతంగా నిర్వహించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.
రాజ్యసభ ప్యానెల్‌లో సగం మంది మహిళలే
రాజ్యసభ ఉపాధ్యక్షుల ప్యానెల్‌ను ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మైన్ జగదీప్ ధన్‌కర్ ప్రకటించారు. ఈ జాబితాలో 50 శాతం మంది మహిళలు ఉన్నారు. మొత్తం ఎనిమిది మంది ఉపాధ్యక్షుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. బీజేపీ ఎంపీలు పిటి ఉష, ఎస్ ఫంగ్నోన్ కొన్యక్, ఎన్‌సీపీ ఎంపీ ఫౌజియా ఖాన్, బీజేడీ ఎంపీ సులత దేవి ఈ పదవులను పొందారు.