ఉద్యమం ఆగదు..

– హోంమంత్రి అమిత్‌ షా నుంచి హామీ రాలేదు: రెజ్లర్‌ సాక్షి మాలిక్‌
నవతెలంగాణ..న్యూఢిల్లీ బ్యూరో
రెజ్లింగ్‌ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న భారత రెజ్లర్లు కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షాను కలిశారు. రాత్రి 11 గంటలకు ఢిల్లీలోని ఆయన నివాసంలో హౌం మంత్రిని కలిసిన రెజ్లర్లు దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. హౌం మంత్రిని కలిసిన వారిలో రెజ్లర్లు భజరంగ్‌ పునియా, సాక్షి మాలిక్‌, సంగీతా ఫోగట్‌, సత్యవర్త్‌ కడియన్‌ ఉన్నారు. మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై నిష్పాక్షిక విచారణ జరిపి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్‌ చేశారు.
అయితే హౌం మంత్రి అమిత్‌ షా వారికి సానుకూలంగా హామీ ఇవ్వలేదని రెజ్లర్లు తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని, చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని చెప్పినట్లు రెజ్లర్లు తెలిపారు. ”ఉద్యమం అపేశామనే వార్త పూర్తిగా తప్పు. న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో మేమేమీ వెనక్కు తగ్గలేదు. ఆందోళనతో పాటు రైల్వేలో నా బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది. దయచేసి ఎలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దు” అని సాక్షి మాలిక్‌ అన్నారు. సత్యవర్త్‌ కడియన్‌ మాట్లాడుతూ తమకు హౌంశాఖ మంత్రి నుంచి ఆశించిన ప్రతిస్పందన రాలేదని నిరాశ వ్యక్తం చేశారు. తాము కేంద్రమంత్రితో శనివారం రాత్రి భేటీ అయినట్లు బజంగ్‌ పునియా మీడియా వద్ద ధ్రువీకరించారు. అయితే, ప్రస్తుతానికి అంతకంటే తానేమీ చెప్పలేనని పేర్కొన్నారు. ఒలింపిక్‌ పతక విజేతలు సాక్షి మాలిక్‌, బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫోగాట్‌ రైల్వేలో తిరిగి విధుల్లో చేరారు.

Spread the love