11న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ యథాతథం

– వాయిదాకు హైకోర్టు నిరాకరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
      రాష్ట్రంలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ రాత పరీక్షను వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈనెల 11న యథాతథంగా జరుగుతుందని స్పష్టం చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ వాయిదా వేయాలన్న పిటిషన్లను కోర్టు సోమవారం కొట్టేసింది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాలు లీకైన నేపథ్యంలో గతేడాది అక్టోబర్‌ 16వ తేదీన నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అభ్యర్థులకు మరోసారి ఈనెల 11న ప్రిలిమ్స్‌ నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ హాల్‌ టికెట్లు కూడా విడుదల చేసింది. ఈనెల 11న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుంది. 503 గ్రూప్‌-1 పోస్టులకు మొత్తం 3,80,202 దరఖాస్తులొచ్చాయి. అయితే ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగినా టీఎస్‌పీఎస్సీ పాలకమండలి, సిబ్బందిలో మార్పులు చేయకుండా మళ్లీ వారితోనే పరీక్షను నిర్వహించడం సరైంది కాదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణ పూర్తయ్యేంత వరకు గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలంటూ కోరారు. యూపీఎస్సీ వంటి సంస్థకు పరీక్ష నిర్వహణ బాధ్యతలను అప్పగించాలని పిటిషన్‌ దాఖలు చేశారు. వాటిపై హైకోర్టు న్యాయమూర్తి ఎం సుధీర్‌కుమార్‌ విచారణ జరిపారు. అన్ని జాగ్రత్తలతో పారదర్శకంగా గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు ఏర్పాటు చేసినట్టు అడ్వకేట్‌ జనరల్‌ బిఎస్‌ ప్రసాద్‌ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది పరీక్ష రాయనున్నారని, ఇప్పటికే లక్షన్నర మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 995 పరీక్షా కేంద్రాలను కూడా టీఎస్‌పీఎస్సీ సిద్ధం చేసిందని పేర్కొన్నారు. ఇంకోవైపు ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో సిట్‌ దర్యాప్తు చురుగ్గా కొనసాగుతున్నదని వివరించారు. త్వరలోనే చార్జీషీట్‌ను దాఖలు చేయనున్నట్టు తెలిపారు. కొంత మంది అభ్యంతరాల కోసం లక్షలాది మంది అభ్యర్థుల్లో గందరగోళం సృష్టించడం సరైంది కాదని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు గ్రూప్‌-1 పరీక్షను వాయిదా వేసేందుకు నిరాకరిస్తూ పిటిషన్లను కొట్టేసింది.

Spread the love