కోర్డు ఆర్డర్లా…ఐతే ఏంటి?

ఏదైనా అన్యాయం జరిగితే న్యాయం కోసం న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తాం. కోర్టు పూర్వాపరాలు అన్నీ పరిశీలించాక తీర్పును వెలువరించి, దానికి కట్టుబడి ఉండాలని ఆదేశిస్తుంది. దానిపై కక్షిదారుడు బహుసంతోషంగా ఉంటాడు. తనకు న్యాయం జరిగిందని సంబురపడతాడు. కానీ ఆ కోర్టు తీర్పును సదరు సంస్థ అమలు చేయకుండా తాత్సారం చేస్తుంటే, ఆ తీర్పు కాపీని పట్టుకొని యాజమాన్యం చుట్టూ కాళ్లరిగేలా తిరగడం, అప్పటికీ పరిష్కారం కాకుంటే కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేయడం మినహా కక్షిదారుడికి మరో మార్గం లేదు.
న్యాయస్థానాల ప్రతిష్టను దిగజారుస్తున్న ఆర్టీసీ యాజమాన్యం
 మంత్రివర్గమన్నా నిర్ణయం తీసుకుంటుందా?
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కాలయాపనే లక్ష్యంగా పెట్టుకున్న యాజమాన్యానికి బాధితుల కష్టాలేవీ పట్టవు. ఈ కోర్టు కాకుంటే, పై కోర్టుకు వెళ్తాం అనే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే, ఇక న్యాయస్థానాల ఆదేశాలకు విలువెక్కడీ ఈ లక్షణాలన్నీ టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యానికి అక్షరాలా వర్తిస్తాయి. ఇక్కడ కక్షిదారులు, బాధితులు ఆర్టీసీ కార్మికులు. సహజంగా ఏ సంస్థ అయినా తమ కార్మికులు సంతోషంగా ఉంటే, మరింత మెరుగైన ఫలితాలు రాబడతారనే విశ్వాసంతో ఉంటాయి. కానీ టీఎస్‌ఆర్టీసీ యాజమాన్య తీరు అందుకు పూర్తి భిన్నం. కార్మికుల్ని ఎంత కాల్చుకుతింటే…వాళ్లంతట వాళ్లు సంస్థను వదిలేసి వెళ్లిపోతే, తమకు అంత లాభం అన్న రీతిలో ఆర్టీసీ యాజమాన్యం వ్యవహరిస్తున్నది. అప్పనంగా ప్రభుత్వ ప్రజా రవాణా వ్యవస్థను ప్రయివేటుకు అప్పగించి, చేతులు దులుపుకోవాలని భావిస్తున్నది. ఆర్టీసీ విషయంలో ప్రభుత్వ మౌఖిక ఆదేశాలు, యాజమాన్య చర్యలు దీన్ని బలపరుస్తూనే ఉన్నాయి.
సీసీఎస్‌ విషయంలో…
కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం చివరకు వారి కష్టార్జితాన్ని కూడా దోపిడీ చేసేసింది. టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్‌ క్రెడిట్‌ కో అపరేటివ్‌ సొసైటీ (సీసీఎస్‌) పూర్తిగా కార్మికులకు సంబంధించిన రుణ పరపతి సంస్థ. కార్మికుల జీతంలో నుంచి సొసైటీ సొమ్మును కట్‌ చేసి ఏ నెలకు ఆ నెల ఆ మొత్తాన్ని సీసీఎస్‌కు ఆర్టీసీ యాజమాన్యం అందించాలి. ఈ విధంగా ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల వేతనాల్లోంచి ప్రతినెలా రూ.18 కోట్లు కట్‌ చేస్తున్నది. రెండేండ్లుగా ఇలా కట్‌ చేసిన సొమ్మును సీసీఎస్‌కు చెల్లించకుండా, సొంతానికి వాడేసుకుంది. ఫలితంగా ఇప్పుడు సీసీఎస్‌ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఆ సంస్థ ఆర్థికంగా కుంగిపోతున్నదని ప్రచారం జరగడంతో దానిలోని సభ్యులు ‘సభ్యత్వం వద్దు. మేం కట్టిన డబ్బు మాకిచ్చేయండి’ అంటూ దరఖాస్తులు చేసుకోవడం మొదలు పెట్టారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కార్మికులకు సులభ వాయిదాల్లో రుణాలను మంజూరు చేస్తూ, నిన్న మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగిన ఈ సంస్థ ఇప్పుడు యాజమాన్య చర్యల ఫలితంగా బిత్తర చూపులు చూసే పరిస్థితి ఏర్పడింది. ఆడ పిల్లల పెండ్లిండ్లు, గృహ నిర్మాణాలు, పిల్లల స్కూలు, కాలేజీ ఫీజుల కోసం రుణాలు ఇమ్మంటూ కార్మికులు చేసుకున్న ఏడు వేల దరఖాస్తులు ఇప్పుడు పెండింగ్‌లో ఉన్నాయి. సీసీఎస్‌కు రూ.1,050 కోట్ల సొమ్మును ఆర్టీసీ యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. దీనిపై ఉలుకూ పలుకూ లేదు. దీనిపై సీసీఎస్‌ పాలకమండలి యాజమాన్యానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేసింది. సీసీఎస్‌కు అనుకూలంగా తీర్పులు వచ్చాయి. యాజమాన్యం అమలు చేయలేదు. వేచి చూసీ…చూసీ…విసిగి చివరకు కోర్టు ధిక్కరణ పిటీషన్‌ దాఖలు చేశారు. కోర్టుకు క్షమాపణలు చెప్పిన యాజమాన్యం, వాయిదాల పద్ధతిలో సీసీఎస్‌ సొమ్ము చెల్లిస్తామని చెప్పింది. దానికీ ఒప్పుకున్న న్యాయస్థానం తొలి విడతగా సీసీఎస్‌కు రూ.200 కోట్లు ఇమ్మంది. సరే…అని కోర్టుకు చెప్పిన యాజమాన్యం, ఇప్పటి వరకు ఆ సొమ్మును చెల్లించలేదు. ఇదే విషయాన్ని సీసీఎస్‌ పాలకమండలి తిరిగి కోర్టుకు విన్నవిస్తే, ఇంకో ఆరునెలలు గడువు ఇవ్వండంటూ యాజమాన్యం పిటీషన్‌ దాఖలు చేసింది. దీనిపై ఈనెల 27న విచారణ జరగాల్సి ఉండగా, భారీ వర్షాల వల్ల కేసు విచారణకు రాలేదు. సోమవారం ఈ కేసును విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది.
గుర్తింపు సంఘం ఎన్నికలు…
ఆర్టీసీలో కార్మిక సంఘాలే లేవంటూ అప్రకటిత నిషేధం విధించిన ప్రభుత్వ ఆదేశాలను యాజమాన్యం అమలు చేస్తున్నది. దీనిపైనా కార్మిక సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. మూడు నెలల్లో ఎన్నికలు పెట్టండంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కాపీలను యాజమాన్యానికి, కార్మిక శాఖ కమిషనర్‌కు సంఘాల ప్రతినిధులు అందచేశారు. ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. కార్మిక చట్టాలను అమలు చేయాల్సిన కార్మిక శాఖ కూడా చోద్యం చూడటానికే పరిమితం అయ్యింది. ఆర్టీసీ యాజమాన్యాన్ని పిలిచి, ఎన్నికలు పెట్టమని ఆదేశించే ధైర్యాన్ని ప్రదర్శించే స్థితిలో లేకపోవడం గమనార్హం. ఎన్నికల నిర్వహణకు కోర్టు ఇచ్చిన మూడు నెలల గడువు పూర్తికావడంతో కార్మిక సంఘాలు కోర్టు ధిక్కరణ పిటీషన్‌ దాఖలు చేశాయి. పంటలు, పెండిండ్ల సీజన్లు, వర్షాలు వంటి కుంటి సాకులతో ఇంకో ఆర్నెల్లు గడువు ఇవ్వండంటూ ఆర్టీసీ యాజమాన్యం కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. దీనిపై కూడా సోమవారం విచారణ జరగనుంది. మరోవైపు సీసీఎస్‌ పాలకమండలి గడవు కూడా తీరిపోయింది. దీనికీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనిపైనా కార్మిక శాఖ ఉలుకూ పలుకూ లేదు.
కోర్టు తీర్పు ఇచ్చినంతమాత్రాన దాన్ని కచ్చితంగా అమలు చేయాలనేం లేదనే ధోరణిలోనే ఆర్టీసీ యాజ మాన్యం ఉంది. సంస్థలోని ఉద్యోగులు కూడా వ్యక్తిగతంగా సర్వీసు అంశాలపై న్యాయస్థానాల నుంచి తెచ్చుకున్న ఉత్తర్వుల అమల్లోనూ ఇదే జాప్యం కనిపిస్తున్నది. వ్యక్తిగత కేసుల్లో తీర్పుల అమలు కోరుతూ సుప్రీంకోర్టు వరకు ఉద్యో గులు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. చేయాల్సిన పనులు చేయకుండా, కోర్టు తీర్పులూ అమలు చేయకుండా ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను అరిగోస పెడుతుంది! రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఆగస్టు 3వ తేదీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో అయినా ఆర్టీసీ అంశాలపై కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారో…లేదో… వేచిచూడాలి!!
చిత్తశుద్ధి లేదు
యాజమాన్యాలు కార్మికులకు జీతాలు పెంచి, వారి సంక్షేమాన్ని కాంక్షిస్తాయి. ఆర్టీసీలో ఇందుకు పూర్తి భిన్నం. కార్మికులకు ఇచ్చే అరకొర జీతాల సొమ్మునే యాజమాన్యం వాడుకుంటున్నది. ఇంతకంటే దుర్మార్గం, దౌర్భాగ్యం ఏముంది? కోర్టులు, కోర్టు తీర్పులన్నా ఏమాత్రం లెక్కలేనట్టే వ్యవహరిస్తున్నారు. కోర్టు ధిక్కరణ పిటీషన్లు వేస్తే, క్షమాపణలు చెప్పి, మళ్లీ అవే తప్పులు పునరావృతం చేస్తున్నారు. దీనిపై హైకోర్టే మరింత సీరియస్‌గా స్పందించాలి. మా సొమ్ము మాకివ్వమంటే యాజమాన్యానికి వచ్చిన కష్టం ఏంటి? సంస్థ నిర్వహణ, కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యానికి చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణం.
వీఎస్‌ రావు, ప్రధాన కార్యదర్శి, టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యూఎఫ్‌)
కోర్టు తీర్పులన్నా లెక్కలేదు…
కోర్టు తీర్పులను కూడా అమలు చేయని యాజమాన్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సంస్థలో సంక్షేమ మండళ్లు ఏర్పాటు చేసి, ఏం సాధించారు? కార్మికులకు ఏం ప్రయోజనాలు కల్పించారు? అవి ఏమాత్రం పనిచేయట్లేదు. తక్షణం ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలి. దీనిపై మేమే కోర్టుకు వెళ్లాం. ఆ తీర్పును యాజమాన్యం గౌరవిం చాలి. సీసీఎస్‌కూ ఎన్నికలు నిర్వహించాలి, బకాయిలన్నీ ఇచ్చేయాలి.
కే రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి, టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ)

Spread the love