క్వారీలో ఇంటర్‌ విద్యార్థి గల్లంతు

– రాత్రి వరకు గాలించినా లభించని నితిన్‌ ఆచూకీ
– నితిన్‌ మతితో కంకరాళ్ళ తండాలో విషాదఛాయలు
నవతెలంగాణ-కేశంపేట
క్వారీలో ఈత కోసం వెళ్లి ఇంటర్‌ విద్యార్థి గల్లంతైన ఘటన కేశంపేట మండలం పుట్టోనిగూడెం గ్రామంలో శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం పుట్టోనిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని కంకరాళ్ళ తండాకు చెందిన ఇంటర్‌ విద్యార్థి నితిన్‌(17) పుట్టోనిగూడెం, దత్తాయపల్లి రెండు గ్రామాల మధ్య ఉన్న క్వారీలోకి ఈత కోసం వెళ్లాడు. ఈత కొడుతూ నితిన్‌ క్వారీలో గల్లంతయ్యాడు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు క్వారీ వద్దకు చేరుకున్నారు. నితిన్‌ ఆచూకీ కనబడకపోవడంతో కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు. వారి రోధన గ్రామస్తులను కంటతడి పెట్టించింది.గ్రామానికి చెందిన కొందరు యువకులు క్వారీలో గాలించినా నీరు అధికంగా ఉండడంతో నితిన్‌ ఆచూకీ లభించలేదు. అధికారులు స్పందించి క్వారీలో నుంచి నీటిని తరలిస్తేనే నితిన్‌ ఆచూకీ లభ్యం కావచ్చని తెలిపారు. ఉదయం 11 గంటలకు ఈతకు వెళ్లి క్వారీలో మునిగిపోయిన నితిన్‌ సాయంత్రం వరకు కూడా ఆచూకీ తెలియ రాలేదు. ఈనేపథ్యంలో కంకరాళ్ళ తండా, పుట్టోని గూడెం, దత్తాయపల్లి గ్రామాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.

Spread the love