ఫీజు కట్టలేదని.. పిల్లలకు శిక్ష

– పాఠశాల పని వేళల్లో బయటకు పంపిన వైనం
– ఇంటికి పంపించాలని డ్రైవర్లకు హుక్కుం
– ఎర్రటి ఎండలో బస్సులోనే చిన్నారుల నిరీక్షించిన 
– ఇబ్రహీంపట్నం ప్రియాంక పాఠశాల యాజమాన్యం నిర్వాకం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ప్రయివేటు పాఠశాలల ఆగడాలు రోజు రోజుకు శృతిమించుతున్నాయి. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పరీక్షలు వచ్చే సమయానికి ఫీజులు చెల్లించలేదంటూ విద్యార్థులను ఇంటికి పంపించడం లేదా? వారికి పనిష్ మెంట్ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు అవమానాలకు గురవుతున్నారు. ఎర్రటి ఎండలో బయటకు పంపిస్తున్నారు. 
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ప్రియాంక ప్రైవేట్ పాటశాలలో ఇలాంటి ఘటనే గురువారం చోటు చేసుకుంది.  ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రియాంక ప్రైవేటు పాఠశాలలో చదివేందుకు కందుకూరు మండలంలోని కొనలగూడ, మంచాల మండలంలోని తిప్పాయిగూడ, జాపాల, ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని పోచారం గ్రామాలకు  చెందిన విద్యార్థులు ఈ పాఠశాలకు వస్తుంటారు. అయితే ఆయా గ్రామాలకు చెందిన విద్యార్థులు ఫీజులు కట్టలేదన్న నెపంతో వారిని పాఠశాల పని దినాల సమయంలోనే గేటు బయటకు పంపించారు. ఫీజులు కట్టని పిల్లలను బస్సులో పాఠశాలకు తీసుకు రావద్దని చెప్పినప్పటికీ డ్రైవర్ ఆ పిల్లలను స్కూలుకు తీసుకురావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని యధావిధిగా తమ ఇండ్లలో దింపి రావాలని పాఠశాల బస్సు డ్రైవర్లకు యాజమాన్యం హుకుం జారీ చేస్తూ సుమారు 20 మంది పిల్లలను పాఠశాల బయటికి పంపించేశారు. గత్యంతరం లేక ఆ విద్యార్థులంతా ఎర్రటి ఎండలో పార్కింగ్ స్థలంలో నిలుచున్న బస్సుల్లో కూర్చుని ఎర్రటి ఎండలో మాడిపోయారు. ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు నేరుగా మీడియాను ఆశ్రయించారు. పలువురు మీడియా ప్రతినిధులు జోక్యం చేసుకుని పాఠశాల పార్కింగ్ స్థలంలో నిలుచున్న ప్రైవేట్ బస్సుల్లో సుమారు 20 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థులతో మీడియా మాట్లాడే ప్రయత్నం చేసింది. తమ తల్లిదండ్రులు పాఠశాల ఫీజుతో పాటు బస్సు ఫీజు కట్టలేదని, అందుకే తమని పాఠశాల నుంచి బయటికి పంపించారని పిల్లలు కన్నీళ్ల పర్యంతమయ్యారు. మీడియా ప్రతినిధులు వచ్చి విద్యార్థులతో మాట్లాడుతున్న విషయన్ని తెలుసుకున్న పాఠశాల యాజమాన్యం చేరుకొని ఆ విద్యార్థులు అందరిని తిరిగి పాఠశాలకు తీసుకువెళ్లారు. ఫీజు కట్టలేని పిల్లల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి ఫీజు కట్టాలని కోరిన వినిపించుకోకపోవడం వల్లనే పిల్లలను బయటికి పంపించాల్సి వచ్చిందని పాఠశాల యాజమాన్యం చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. విద్యార్థులు పాఠశాల ఫీజు కట్టలేదన్న నెపంతో విద్యార్థులను బయటకు పంపించడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం మాత్రం నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడం హాస్యాస్పదం.
రూ.11 వేల బిల్లు కట్టలేదని..
జాపాల గ్రామానికి చెందిన హిందూజా రెండో తరగతి చదువుతోంది. ఈ విద్యార్థిని స్కూల్ ఫీజు రూ.7000 బస్సు ఫీజు రూ4000 కలిపి మొత్తం రూ.11వేలు చెల్లించాల్సి ఉంది. కానీ పాఠశాల ముగిసే సమయానికి మా నాన్న ఫీజు చెల్లిస్తాడని చెప్పిన వినిపించుకోకుండా బయటకు పంపించారని ఆ విద్యార్థిని వాపోయింది.
రూ.6వేల కోసమే బయటకు..
అదే గ్రామానికి చెందిన మరో విద్యార్థి తపస్వి ఐదవ తరగతి చదువుతోంది. తన తమ్ముడు రిషి నాలుగో తరగతి చదువుతున్నాడు. ఈ ఇద్దరికీ కలిపి రూ.6000 ఫీజు చెల్లించాల్సి ఉంది. కేవలం రూ.6000 ఫీజు చెల్లించలేదన్న నెపంతో ఆ ఇద్దరు విద్యార్థులను పాఠశాల బయటకు పంపించేశారు. సుమారు 20 మంది విద్యార్థులతో కలిసి ఎర్రటి ఎండలో పార్కింగ్ స్థలంలో నిలుచున్న బస్సుల్లో పడిగాపులు కాశారు. పాఠశాల ముగిసే సమయానికి ఫీజు చెల్లిస్తామని చెప్పిన వినిపించుకోకుండా తమను టీచర్లు బయటకు పంపించారని ఆ విద్యార్థిని వాపోయింది.
Spread the love