వేసవి భత్యం ఉన్నట్లా.. లేనట్టా.?

– మూడేళ్ళుగా ఉపాది కూలీల నిరీక్షణ
– మార్గదర్శకాలు రాలేదంటున్న అధికారులు
నవతెలంగాణ- మల్హర్ రావు
 ఉన్న ఉరిలోనే పనులు కల్పించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని అమలు చేస్తోంది.పంట పొలాలు చదును చేయడం, చెరువులు, కుంటలు, బావుల్లో పూడిక తొలగించడం, వ్యవసాయ క్షేత్రాలకు దారులు వేయడం, హరితహారంలో మొక్కలు నాటడం, కంచె ఏర్పాటు చేయడం వంటి పనులు కల్పిస్తున్నారు. వ్యవసాయ పనులు పూర్తియిన తరువాత అంటే వేసవికాలంలో ఉపాది పనులు జోరుగా సాగుతుంటాయి. అయితే ఏటా అమలు చేసే వేసవి భత్యం విషయంపై ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది మూడేళ్ళుగా ఆ ఊసే లేకపోవడంతో ఉపాది కూలీలు డోలయానంలో పడ్డారు.
భత్యం ఉన్నట్టా.. లేనట్టా..?
వ్యవసాయ పనులు పూర్తీయిన తరువాత ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఉపాది పనులు జోరుగా సాగుతుంటాయి.ఎండల తీవ్రత నేపథ్యంలో పూర్తిస్థాయిలో పనులు చేయలేని పరిస్థితిలో వేసవి భత్యం అమలు చేసేవారు. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చి, ఏప్రిల్ లో 25 శాతం, మేలో 30 శాతం, జూన్ లో 25 శాతం అందించేవారు. అయితే ఈ ఏడాది మార్చి 3వ వారం పూర్తివుతున్న ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి టిసిఎస్ సాప్ట్ వేర్ లోనే కార్యకలాపాలు కొనసాగుతూ వచ్చాయి. కొత్తగా తీసుకొచ్చిన ఎన్ఐసి సాప్ట్ వేర్ లో వేసవి భత్యానికి సంబంధించిన ఎలాంటి ఆప్సన్ లేదు. దీంతో ఈసారి అమలవుతుందా.? లేదా.? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదనపు భత్యం లేకపోతే కూలీలు నష్టపోయే పరిస్థితి ఉంది.అసలే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఆర్డిక ఇబ్బందుల్లో కురుకపోతామని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ విషయంలో ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని అధికారులు పేర్కొంటున్నారు.
ఊపందుకున్న పనులు..
మండలంలోని 15 గ్రామాల్లో ఉపాది పనులు జోరందుకున్నాయి.రోజురోజుకు కూలీల సంఖ్య పెరుగుతూ మండల ఏపీఓ హరీష్ ఆధ్వర్యంలో కూలీలను పర్యవేక్షణ చేస్తున్నారు. మండలంలో ఉపాధిహామీ పథకంలో మొత్తం 8,441 కుటుంబాలకు జాబ్ కార్డులు ఉన్నాయి.వీరిలో 11,078 మంది సభ్యులుగా ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 4178 కుటుంబాలు హాజరు కాగా 19,6789 పని దినాలు చేశారు. ఒక్కొక్క కూలికి నిత్యం రూ.190.08 నుంచి రూ.200 వరకు చెల్లిస్తున్నారు.
సౌకర్యాల సంగతెంటి.?
ఏటా వేసవిలో ఉపాది పనుల వద్ద సౌకర్యాలు అందని ద్రాక్షగా మారాయి.సమావేశాల్లో చెప్పడమే తప్ప ఆచరణలో ఒరిగింది శూన్యం.మండుటెండలో పనులు చేసి వడదెబ్బకు గురైనవారు లేకపోలేదు.ఉపాది పనులు జరిగే చోట నీడ, నీళ్లు సౌకర్యం కచ్చితంగా కల్పించాలి.చలువ పందిళ్లు,మంచినీటి వసతి తప్పకుండా ఏర్పాటు చేయాలి.నీటి వసతి కల్పించని యెడల మంచినీటి భత్యం కింద రూ.5 అదనంగా చెల్లించాలి.పని ప్రదేశంలో ఓఆర్ఏస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలి.పని చేస్తున్న సమయంలో కూలీలకు గాయలైతే ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉంచాలి.కూలీలు ఎవరైనా అస్వస్థతకు గురైతే వారిని తక్షణమే ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించాలి.
మూడేళ్ళుగా భత్యం లేదు: రాజయ్య ఉపాది కూలి
ప్రతి సంవత్సరం ఉపాది కూలి పని చేసేవారికి అదనపు భత్యం ఇచ్చేవారు.మూడేళ్ళుగా ఆఉసే లేదు.ఇదెక్కడి అన్యాయం అని అధికారులను అడిగితే పై నుంచి ఆదేశాలు రాలేదంటున్నారు.
వసతులు కల్పించాలి: సమ్మక్క ఉపాధి కూలి
ఉపాది పనులు చేసే చోట సౌకర్యాలు కల్పించడం లేదు.అధికారులు పర్యవేక్షణకు వచ్చినప్పుడు వారికి చెప్పిన చర్యలు చేపట్టడం లేదు.ఎండలు ముదరకముందే ఏర్పాట్లు చేయాలి.లేకుంటే వడదెబ్బకు తట్టుకోలేం.
Spread the love