అధికారులు దాడులు చేసినా.. ఆగని అక్రమ ఇసుక దందా..?

– రాత్రి, పగలు తేడా లేకుండా ట్రాక్టర్లతో రవాణ
– గ్రామాల్లో భారీగా డంపులు ఏర్పాటు
– రాత్రి వేళల్లో లారీలతో పట్టణాలకు తరలింపు
నవతెలంగాణ – మల్హర్ రావు
పోలీస్, రెవెన్యూ, పారెస్ట్ అధికారులు అక్రమ జీరో ఇసుక దందాపై దాడులతోపాటు, లారీల యజమానులు, డ్రైవర్లపై ఎన్ని కేసులు నమోదు చేసిన మల్హర్, కాటారం మండలాల్లో అక్రమ జీరో ఇసుక దందా ఆగడం లేదు.జీరో ఇసుక దందా యధేచ్చగా కొనసాగుతోంది. ఎక్కువగా  మండలంలోని  ఇప్పలపల్లి, కేశారంపల్లి గ్రామాల్లో కాటారం మండలంలో గంగారం, విలాసాగర్, రేగుల గూడెం గ్రామాల్లో అక్రమ ఇసుక దందా జోరుగా సాగుతుంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా రోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను మానేరు నుంచీ రవాణ చేస్తూ ఉరి చివరల్లో భారీగా డంపులు చేస్తూ రాత్రి వేళల్లో లారీల ద్వారా వరంగల్, హైదరాబాద్ పట్టణాలకు తరలిస్తూ లక్షల సంపాదిస్తున్నారు. కాటారంలోని  గంగారం, రేగుల గూడెం, విలాసాగర్ గ్రామాల్లోని కోళ్ల పారాలు, మోడల్ స్కూల్, అసంతృప్తిగా నిర్మాణంలో ఉన్న రైతు వేదిక, ఊరు చివరలో మానేరు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక రాత్రి వేళల్లో భారీగా డంపుల నిల్వలు చేస్తూ తెల్లవారుజామున లారీల ద్వారా పట్టణాలకు తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. ఇసుకాసురులు అందరి కళ్ళు గప్పి తాడిచెర్ల సెక్షన్ పరిధిలోని దేశబంధం మానేరు నుంచి ఇసుకను తోడేస్తూ ఆటవిమార్గం మీదుగా నాచారం, ఆన్ సాన్ పల్లి, వెంచరామి, నేరేడు పల్లి, గొర్లవిడు, కొంపల్లి మీదుగా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అయితే ఇటీవలే అధికారులు మాటు వేసి దాదాపు పది లారీలు పట్టుకొని కేసులు నమోదు చేశారు.అయిన అక్రమ ఇసుక రవాణా అగకపోవడం గమనార్హం.
జోరుగా రవాణ….
మల్హర్, కాటారం మండలాల్లో మానేరు పరివాహక ప్రాంతాల్లో అక్రమ ఇసుక జిరో దందా జోరుగా సాగుతోంది. మానేరులో నీటి ప్రవాహం తగ్గిపోయి ఎడారిగా మారడంతో అక్రమ ఇసుక వ్యాపారులు అడ్డుఅదుపు లేకుండా 4 నుంచి 6 పిట్ల వరకు భారీగా గుంతలు తోడేస్తూ వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఇసుక వ్యాపారులు అదురు, బెదురు లేకుండా మూడు ట్రాక్టర్లు ఆరు లారీలుగా సాగుతున్న ఈ అక్రమ దందాకు ముకుతాడు వేయాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధించిన జిల్లా ఉన్నతాధికారులు అక్రమ ఇసుక జీరో దందాకు అడ్డుకట్ట వేసి భూగర్భజలాలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.
Spread the love