దాహం..దాహం..

Thirst.. Thirst..– వేసవి ప్రారంభంలోనే గొంతెండుతున్న వైనం
– అధికారులకు పట్టని ప్ర’జల’ కష్టాలు
– కానరాని ముందస్తు ప్రణాళికలు
– అల్లాడిపోతున్న గ్రామ ప్రజలు
– ముఖం చాటేసిన ప్రత్యేకాధికారి
దాహం.. దాహం.. బిందెడు నీటి కోసం పల్లె ప్రజల అష్టకష్టాలు పడుతున్నారు. తాగునీటి కోసం ఎక్కడో దూరాన ఉన్న పంట పొలాల బాటపడుతున్నారు. దాహార్తిని తీర్చండి సారూ అంటూ ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని చెబుతున్నారు పల్లె జనం. గ్రామంలో ఎక్కడ చూసినా తాగునీటి కోసం అల్లాడి పోతున్న ఘటనలే కనిపిస్తున్నాయి. చిన్నా పెద్ద, ముసలి, ముతక అనే తేడా లేకుండా ఖాళీ బిందెలతో కులాయిల వద్దకు పరుగులు పెడుతున్నారు. వేసవి ఎండలు తీవ్రం కావడంతో బోరు బావుల్లో నీరు అడుగంటింది. రక్షిత నీటి పథకాలు దిష్టిబొమ్మల్లా మారాయి. అందుకు ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారం నిలువెత్తు సాక్ష్యం.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇబ్రహీంపట్నం మండలం, దండుమైలారం గ్రామ ప్రజలు వారం రోజులుగా దాహంతో అలమటించి పోతున్నారు. వీధుల్లో ఖాళీ బిందెలతో మహిళలు పరుగులు పెడుతున్నారు.. చిన్నా పెద్ద అనే తేడా లేకుండ తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. మిషన్‌ భగీరథ నీరు సరఫరా అవతున్నా సరిపోవడం లేదు. కొళాయిల ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదు. పూర్తిస్థాయిలో బోర్లు పనిచేయడం లేదు. ఇలా అనేక కారణాలతో ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇక మండు వేసవిలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్ర’జల’ కష్టాలపై ఇప్పటివరకు సంబంధిత అధికారులు స్పందించక పోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేకాధికారి పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. వేసవి నేపథ్యంలో తాగునీటి ఎద్దడి నివారణకు ఉన్నతాధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో ఇదీ పరిస్థితి…
ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారం 10వేల జనాభాతో 5వేల ఓటర్లు కలిగి ఉన్నారు. 1230 నల్లా కనెక్షన్లున్నాయి. ప్రతి రోజు కనీసం వీరి దాహర్థిని తీర్చేందుకు 5లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. కానీ మిషన్‌ భగీరథ 2లక్షల5వేల నుంచి 3లక్షల లీటర్ల నీరు కూడా సరఫరా కావడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజల దాహర్థి తీర్చేందుకు గ్రామ పంచాయతీ పాలకవర్గం ఉన్న సందర్భంగా ఒకటీ లక్షా 20వేల లీటర్ల సమార్థ్యం కలిగిన ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకు, మరోకటి 60వేల లీటర్లు, ఒకటి 90వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకులను నిర్మించారు. ఏ రోజు కూడా మిషన్‌ భగీరథ నీరు ఈ ట్యాంకులను నింపింది లేదు. చేసేది లేక 20 వరకు ఏడు ఆస్పర్లు, సింగిల్‌ ఫేజ్‌ మోటార్లను తవ్వించారు. అవి కూడా ఆదుకోలేని పరిస్థితి ఏర్పడింది.
వట్టిపోయిన బోర్లు..
ఇలాంటి తరుణంలో ప్రజల దాహర్థిని తీర్చేందుకు ఉపయుక్తంగా ఉంటాయని 20 వరకు బోర్లను ఏర్పాటు చేశారు. కానీ అవి కూడా ఒక్కొక్కటి వట్టిపోతున్నాయి. మొన్నటి వరకు 10 సింగిల్‌ ఫేజ్‌ మోటర్ల ద్వారా మినీట్యాంకులకు నీటిని సరఫరా చేశారు. వాటిలో నేడు ఆరు సింగిల్‌ ఫేజ్‌ బోర్లు ఎండిపోయాయి. కేవలం నాలుగు మాత్రమే చాలీచాలని నీళ్లను అందిస్తున్నాయి. ఇక 7 ఐదు హెచ్‌పీ సామర్థ్యం కలిగిన బోరు మోటార్లుంటే నేడు వాటిలో నాలుగు బోర్లు ఎండిపోయాయి. చుక్క నీరు రాల్చడం లేదు. కేవలం 3 బోర్లలో కొద్దికొద్దిపాటి నీరే వస్తుంది. ఓ వైపు ఎండలు.. మరోవైపు తాగునీరు అందకపోవడంతో ఆయా కాలనీ వాసులు దాహార్తితో అలమటిస్తున్నారు. ఏకంగా నాలుగైదు రోజులకొకసారే తాగు నీరు సరఫరా అవుతోంది.దీంతో ప్రజలు బిందెడు నీటి కోసం పరుగులు పెట్టాల్సి వస్తోంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా.. జిల్లాలో తాగునీటి సమస్య లేదని అధికారులు చెబుతుండటం గమనార్హం.
ప్రత్యేక అధికారి ఎక్కడ
గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతుంటే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాల్సిన తరుణంలో ప్రత్యేక అధికారి ముఖం చాటేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలు భేఖాతర్‌ చేస్తున్నారు. తాగునీటి సమస్యపై స్పందించడం లేదన్న విమర్శలున్నాయి. గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు సర్పంచ్‌ స్థాయిలో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశిస్తున్న దండుమైలారంలో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతుంటే తమకేమీ పట్టనట్టు ప్రత్యేక అధికారి వ్యవహరిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ స్పందించి దాహర్థిని తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ప్రజల దాహార్తిని తీర్చడంలో విఫలం
రాష్ట్ర ప్రభుత్వం వేసవిలో తాగునీటి సమస్యను పట్టించు కోవడం లేదు. మిషన్‌ భగీరథ నీరు సరఫరా అంతంత మాత్రంగానే ఉంది. ఉన్న స్కీం బోర్లు ఒక్కొ క్కటిగా ఎండిపో తున్నాయి. తాగునీటి కోసం ప్రజలు రోడ్డె క్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఖాళీ బిందెలతో జాగారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు మండే ఎండ.. మరోవైపు దాహం దప్పికలతో అలమటిస్తున్నారు. ప్రభుత్వ స్పందించకపోతే త్వరలోనే ఖాళీ బిందెలతో మహిళలను ధర్నా నిర్వహిస్తాం.
– కందుకూరి జగన్‌, వ్యకాస జిల్లా కార్యదర్శి

గ్రామపంచాయతీని ముట్టడిస్తాం
వేసవిలో ప్రజల దాహతిని తీర్చకపోతే మహిళలతో ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీని ముట్టడిస్తాం. తాగునీటి సమస్య తీర్చాలని ఇప్పటికే ఉన్నతాధి కారుల దృస్టికి తీసు కెళ్లిన పట్టించుకోవడం లేదు. ప్రత్యేక అధికారి తనకిష్టం వచ్చినప్పుడు వస్తున్నారే తప్ప తాగునీటి సమస్య పరి ష్కారం కోసం సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేవు. ఇప్పుడే ఇలా ఉంటే మరో రెండు మాసాలు తాగునీటి పరిస్థితి ఎలా ఉంటుందో ఆందోళన కలిగిస్తుంది. ఇప్ప టికైనా ప్రభుత్వం స్పందించాలి. నీటి సమస్య పరిష్క రించాలి.
– యాదగిరి, సీపీఐ(ఎం) కార్యదర్శి

Spread the love