అగ్రస్థానంలో ఐఐటీ మద్రాస్‌

– వరుసగా ఐదోసారి టాప్‌
– 14వ ర్యాంకులో ఐఐటీ హైదరాబాద్‌
– ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్స్‌ విడుదల
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్‌ అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా ఐదో సంవత్సరం ఐఐటీ మద్రాస్‌ మొదటి స్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్సీ) బెంగళూరు, ఐఐటీ-ఢిల్లీ నిలిచాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) కింద కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ రూపొందించిన ఇండియన్‌ ర్యాంకింగ్స్‌ రిపోర్టు-2023ను సోమవారం కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌ విడుదల చేశారు.
టాప్‌ 10 విద్యా సంస్థలు (ఒవరల్‌)
ఐఐటీ మద్రాస్‌,ఐఐఎస్సీ బెంగళూరు,ఐఐటీ ఢిల్లీ,ఐఐటీ ముంబయి,
ఐఐటీ కాన్పూర్‌,ఎయిమ్స్‌ ఢిల్లీ, ఐఐటీ ఖరగ్‌పూర్‌, ఐఐటీ రూర్కే
ఐఐటీ గౌహతి,జేఎన్‌యూ (ఢిల్లీ)
తెలంగాణలో నాలుగు, ఏపీలో రెండు
14 వ ర్యాంక్‌లో ఐఐటీ హైదరాబాద్‌, 20 వ ర్యాంక్‌లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ, 53 వ ర్యాంక్‌లో ఎన్‌ఐటీ వరంగల్‌, 64వ ర్యాంక్‌లో ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్రప్రదేశ్‌ కి చెందిన కెఎల్‌ యూనివర్సిటీకి 50, ఆంధ్రా యూనివర్సిటీకి 74 వ ర్యాంక్‌లో నిలిచాయి.
టాప్‌ యూనివర్సిటీలు
బెంగుళూరులోని ఐఐఎస్సీ ఉత్తమ యూనివర్సిటీగా నిలిచింది. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ, బనారస్‌ హిందూ యూనివర్సిటీ, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ( హెచ్‌సీయూ) పదో స్థానంతో సరిపెట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్‌ కి చెందిన కెఎల్‌ యూనివర్సిటీకి 28వ ర్యాంకు, ఆంధ్రా యూనివర్సిటీకి 43, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి 60, విజ్ఞాన యూనివర్సిటీకి 75 ర్యాంక్‌ వచ్చింది. తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీకి 36, ట్రిపుల్‌ ఐటీ హైదారాబాద్‌ కి 84వ ర్యాంక్‌ వచ్చాయి.
టాప్‌ ఇంజనీరింగ్‌ సంస్థలు
ఇంజనీరింగ్‌ విభాగంలో మొదటి స్థానాన్ని ఐఐటీ (మద్రాస్‌) కైవసం చేసుకుంది. ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ ముంబయి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఎనిమిదో స్థానంలో ఐఐటీ (హైదరాబాద్‌), 21వ స్థానంలో ఎన్‌ఐటీ (వరంగల్‌), 55వ ర్యాంక్‌లో ట్రిపుల్‌ ఐటీ (హైదరాబాద్‌), 71వ ర్యాంక్‌లో యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, 83వ ర్యాంక్‌లో జేఎన్‌టీయూ హైదరాబాద్‌, 98వ ర్యాంక్‌లో ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ (వరంగల్‌) నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌లో కెఎల్‌ యూనివర్సిటీ 44, ఐఐటీ తిరుపతి 59, విజ్ఞాన్‌ యూనివర్సిటీ కి85, ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ 94వ ర్యాంక్‌లో నిలిచాయి.
టాప్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు
మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్‌ తొలి స్థానంలో నిలిచింది. ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోజీకోడ్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. మెడికల్‌ విభాగంలో ఎయిమ్స్‌ ఢిల్లీ, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (చండీగఢ్‌), క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్‌ (వెల్లూర్‌) మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఫార్మసీ విభాగంతో హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ మొదటి స్థానంలో నిలిచింది.
జామియా హమ్‌దర్ద్‌, బిట్స్‌ పిలానీ రెండో, మూడో స్థానాలు సాధించాయి. 22వ ర్యాంక్‌లో ఏయూ కాలేజీ ఆఫ్‌ ఫార్మసీ (విశాఖపట్నం) వచ్చింది.
న్యాయ విద్యలో బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ, ఢిల్లీలోని నేషనల్‌ లా యూనివర్సిటీ, హైదరాబాద్‌లోని ‘నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా’ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. కాగా ర్యాంకింగ్‌ కోసం గతేడాది 7,254 దరఖాస్తులు రాగా.. ఈ ఏడాది 8,686 దరఖాస్తులు వచ్చాయి.

Spread the love