– న్యాయం జరిగేలా చూడాలి
– బంగ్లాదేశ్‌లో కార్మిక నాయకుడి హత్యపై మానవ హక్కుల సంఘం డిమాండ్
ఢిల్లీ: బంగ్లాదేశ్‌లో యూనియన్ నాయకుడు షాహిదుల్ ఇస్లాం దారుణ హత్య తీవ్ర ఆందోళనలకు దారి తీస్తున్నది. హత్యకు నిరసనగా వందలాది మంది గార్మెంట్ కార్మికులు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వీధుల్లోకి వచ్చారు. గతనెల 25న బంగ్లాదేశ్ గార్మెంట్ మరియు ఇండిస్టియల్ వర్కర్స్ ఫెడరేషన్ గాజీపూర్ జిల్లా కమిటీ అధ్యక్షుడు ఇస్లాం, కార్మికులకు చెల్లించని వేతనాలను పొందేందుకు గాజీపూర్‌లోని ఒక ఫ్యాక్టరీని సందర్శించారు. ఆ సమయంలో ఆయనను కొట్టి చంపిన ఘటన చోటు చేసుకున్నది. షాహిదుల్ ఇస్లాం హత్యకు వ్యతిరేకంగానే అక్కడి కార్మికులు, మానవ హక్కుల కార్యకర్తలు తమ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ హత్యపై స్వతంత్ర, పారదర్శక దర్యాప్తు జరపాలని మానవ హక్కుల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగేలా చూడాలని బంగ్లాదేశ్ అధికారులను కోరారు.హ్యూమన్ రైట్స్ వాచ్‌లోని సీనియర్ న్యాయవాది క్లాడియో ఫ్రాంకావిల్లా ఒక ప్రకటనలో ”షాహిదుల్ ఇస్లాం మరణానికి న్యాయం, నష్టపరిహారం అందించడం ప్రపంచం చూస్తున్నందున బంగ్లాదేశ్‌కు భారీ పరీక్ష అవుతుంది. కార్మిక నాయకుడి హత్య కార్మికుల స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుంది” అని వివరించారు.
హ్యూమన్ రైట్స్ వాచ్‌కు అందిన సమాచారం ప్రకారం.. షాహిదుల్ ఇస్లాం జూన్ 25న ప్రిన్స్ జాక్వర్డ్ స్వెటర్ లిమిటెడ్‌కి వెళ్లి రెండు నెలలపాటు చెల్లించని వేతనాలు, ఈద్ సెలవుదినం కోసం బోనస్ డిమాండ్ చేశాడు. కర్మాగారం వెలుపల అతనితో పాటు మరో ముగ్గురిపై ఒక ముఠా దాడి చేసింది. వేతనాలు డిమాండ్ చేసినందుకు అతనిని దారుణంగా కొట్టారు. దుర్భాషలాడారు.