తెలంగాణలో 10 మావే

– ఈ ఎన్నికలు రాహుల్‌ వర్సెస్‌ మోడీ మధ్యే..
– భువనగిరి సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా
నవతెలంగాణ-భువనగిరి రూరల్‌
తెలంగాణలో 10 ఎంపీ స్థానాల్లో పాగా వేయబోతున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం రాయగిరిలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో అమిత్‌షా మాట్లాడారు. 2024 ఎన్నికలు రాహుల్‌ వర్సెస్‌ మోడీ మధ్య.. కుటుంబ అభివృద్ధి, దేశాభివృద్ధి మధ్య నడుస్తున్న ఎన్నికలని అన్నారు. ఈ ఎన్నికలు రాహుల్‌ పిల్ల చేష్టల్లాంటి గ్యారంటీలు, మోడీ కచ్చితమైన గ్యారంటీల మధ్య జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే జరిగిన మూడు విడతల లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 200 స్థానాలకు మించి గెలుస్తుందని జోస్యం చెప్పారు. మొత్తం 400 సీట్లు పక్కా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణలో డబుల్‌ డిజిట్‌ స్థానాల్లో గెలిస్తే దేశంలో 400 స్థానాల్లో గెలిచినట్టేనన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చెప్పిన హామీలు అమలు కాలేదన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, వరి, గోధుమలకు రూ.500 బోనస్‌ అమలు చేయలేదని విమర్శించారు. కాలేజీలకు వెళ్లే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని ఇవ్వ లేదన్నారు. కాంగ్రెస్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను ముస్లింలకు పంచిందని ఆరోపించారు. బీజేపీ గెలిస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి వాటిని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచుతామని స్పష్టం చేశారు. ముగ్గురు ఒక్కటేనని ఏబీసీ అంటే అసదుద్దీన్‌, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అని వ్యాఖ్యానించారు. టెక్స్‌టైల్‌ రంగంలో మోడీ 8 లక్షల మందికి ఉపాధి కల్పించారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌, బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి, గంగిడి మనోహర్‌ రెడ్డి, తాడూరి శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్‌, నాయకులు పడాల శ్రీనివాస్‌, పడుమటి జగన్మోహన్‌రెడ్డి, పిట్టల అశోక్‌, బొల్ల సుదర్శన్‌ పాల్గొన్నారు.

Spread the love