సబ్బండ వర్ణాలకు అవస్థలు తప్పవు

– కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటుకు అంతా కృషి చేద్దాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
– మోడీ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ : ఎంపీ రేణుకా చౌదరి
– కాంగ్రెస్‌ అభ్యర్థి రాఘురామ్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ.. ఖమ్మం మిర్చియార్డులో కార్మికులు, వ్యాపారులతో సమ్మేళనం
నవతెలంగాణ- ఖమ్మం
లోక్‌సభ ఎన్నికల్లో పొరపాటున మోడీ మళ్ళీ అధికారంలోకి వస్తే.. దేశంలో ఇవే చివరి ఎన్నికలు అవుతాయని, రాజ్యాంగాన్ని ఎత్తివేసి ఆయన నియంతలా వ్యవహరిస్తారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం ఖమ్మంలోని మిర్చి మార్కెట్‌ సమీపంలోని ఆదిలక్ష్మి కోల్డ్‌ స్టోరేజ్‌ ప్రాంగణంలో దిగుమతి శాఖ అధ్యక్షులు దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు అధ్యక్షతన కార్మిక, వ్యాపారుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమ్మినేని మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించడమే పరిరక్షణ మార్గం అని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి దిక్సూచిలా ఉన్న భారత రాజ్యాంగాన్ని రద్దుచేసి, మనుధర్మ రాజ్యాంగాన్ని తీసుకొస్తారని విమర్శించారు. అందరికీ ఇండ్లు, అర్హులకు ఉద్యోగాలు, రైతులకు మూడింతల మద్దతు ధర అంటూ మోడీ అధికారంలోకి వచ్చి ఇవేమీ ఆచరణలో పెట్టలేదని తెలిపారు. బీసీ కులగణన చేపట్టి, అన్ని తరగతుల వారికి పూర్తిస్థాయిలో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌కు వామపక్షాలు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతున్నాయని, రాష్ట్రంలోనే ఖమ్మం ఎంపీ స్థానంలో అత్యధిక మెజారిటీ సాధిస్తుందని తెలిపారు.
రాజ్యసభ సభ్యులు రేణుకాచౌదరి మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, అరాచకపాలన సాగిస్తున్నారని అన్నారు. ప్రజలు చూస్తూ ఊరుకోవద్దని, ఓటు ద్వారా బుద్ధిచెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామ్‌రెడ్డి మాట్లాడుతూ.. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని, రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రజలపై పెనుభారం మోపిందని విమర్శించారు. తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని, ప్రజాసేవ చేసుకుంటానని తెలిపారు.
తీన్మార్‌ మల్లన్న మాట్లాడుతూ.. మోడీ నల్లధనం తీసుకొస్తానని తేలేదని, రెండు కోట్ల ఉద్యోగాలని ఉన్నవి పీకారని అన్నారు. ఈ దేశానికి ప్రధాని మోడీ మహమ్మారిలా తయారయ్యారని, వామపక్షాలతో కలిసి నిలువరిద్దామని అన్నారు. కాంగ్రెస్‌ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పనైపోయిందని, దానికి ఓటు వేస్తే మురిగిపోయినట్లేనని అన్నారు. రఘురామ్‌ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కాంగ్రెస్‌ నాయకులు తుమ్మల యుగేందర్‌, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, సీపీఐ రాష్ట్ర నాయకులు బాగం హేమంతరావు, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్‌, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.విక్రమ్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ మానుకొండ రాధా కిషోర్‌, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు యర్రా శ్రీనివాసరావు, తుశాకుల లింగయ్య, భూక్యా శ్రీనివాసరావు, టీపీసీసీ నేత మద్ది శ్రీనివాసరెడ్డి, మద్దినేని స్వర్ణకుమారి, కార్పొరేటర్లు యర్రా గోపి, యల్లంపల్లి వెంకట్రావు, బండారు యాకయ్య, బండారు వీరబాబు, వజినేపల్లి శ్రీనివాసరావు, ఎస్‌కే సైదులు, పత్తిపాక నాగ సులోచన, షేక్‌ హిమామ్‌, మద్ది సత్యం కైలాసప వేణు తదితరులు పాల్గొన్నారు.

Spread the love