వికసిత్‌ భారత్‌ లేదు..అచ్ఛేదిన్‌ రాలేదు..

– బీజేపీ ఎజెండాలో ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్స్‌, అబద్ధాలే
రూపాయి పని చేయని బండి సంజరు మాట్లాడే భాషేందో తెల్వదు..
– ఇప్పటికే తేలిపోయిన 420 హామీలిచ్చిన కాంగ్రెస్‌ పని: కరీంనగర్‌ రోడ్‌షోలో మాజీ సీఎం కేసీఆర్‌
– డాలర్‌తో పోల్చితే రూ.84కు పడిపోయిన రూపాయి విలువ
– బీజేపీ ఎజెండాలో ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌, అబద్ధాలే!
– రూపాయి పని చేయని బండి సంజరు మాట్లాడే భాషేందో తెల్వదు..
– ఇప్పటికే తేలిపోయిన 420 హామీలిచ్చిన కాంగ్రెస్‌ పని : కరీంనగర్‌ రోడ్‌షోలో మాజీ సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
సబ్‌కాసాత్‌, సబ్‌కా వికాస్‌ అని చెప్పిన నరేంద్ర మోడీ తన పదేండ్ల పాలనలో సబ్‌కా సత్యనాశ్‌, దేశ్‌కా సత్యనాశ్‌ చేశారని, డాలర్‌తో పోల్చితే రూ.84కు మన రూపాయి విలువ పడేసి దేశాన్ని అధోగతిపాలు చేశారని మాజీ సీఎం కేసీఆర్‌ విమర్శించారు. మోడీ చెప్పిన వికసిత్‌ భారత్‌, అచ్ఛేదిన్‌ రాలేదని, ఇంకోవైపు 420 హామీలిచ్చి ఏ ఒక్కటీ అమలు చేయకుండా రాష్ట్రంలో కాంగ్రెస్‌ కరువును తెచ్చిందని అన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీం’నగరం’లోని తెలంగాణ చౌక్‌లో శుక్రవారం సాయంత్రం కేసీఆర్‌ రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 ఎన్నికలకు ముందు 150 హామీలతో గెలిచిన ప్రధాని నరేంద్ర మోడీ ‘బేటీ పడావో బేటీ బచావో, అమృత్‌కాల్‌, అచ్చేదిన్‌, మేక్‌ ఇన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, వికసిత్‌ భారత్‌ అంటూ గొప్పగొప్ప మాటలు చెప్పి ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శిం చారు. మోడీకంటే ముందు పని చేసిన 15మంది ప్రధానులు రూ.55 లక్షల కోట్ల అప్పు చేస్తే.. ఈయనొక్కడే రూ.105లక్షల కోట్ల అప్పులు చేశారని వివరించారు. ఇంత అప్పులు చేసినా దేశం నుంచి ఎగుమతులు నిలిచిపోయాయని, విదేశీమారక నిల్వలు లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం దేశంలోని దళితులకో, గిరిజనులకో, మైనారిటీలకో.. ఒక్క మంచి పని అయినా చేసిండా అంటూ ప్రశ్నిస్తూ.. కార్పొరేట్లకు మాత్రం రూ.15లక్షల కోట్ల అప్పులను మాఫీ చేసిండని తెలిపారు. ఆయన వ్యవసాయ వ్యతిరేక చట్టాలు తెస్తే వాటి రద్దు కోసం పోరాడిన 750 మంది రైతులను ఢిల్లీ గడ్డ మీద పొట్టన బెట్టుకున్నారని, తీరా పంజాబ్‌ ఎన్నికలు రాగానే క్షమాపణలు చెప్పి దొంగలా ఓట్లు అడుక్కున్నాడని విమర్శించారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారని, వాళ్లు నాలుగు రూపాయల పని కూడా చేయలేదని అన్నారు. ఇక్కడ గెలిచిన బండి సంజరు పైసా పని చేయకపోగా ఏనాడూ పార్లమెంట్‌లో మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. ఎంతసేపు మతవిద్వేషపు మాటలు తప్ప.. ఆయన భాష ఏదో కూడా అర్థం కాదని అన్నారు. గటువంటి వ్యక్తిని మళ్లీ గెలిపిద్దామా? అంటూ ప్రశ్నించారు. కరీంనగర్‌ చైతన్యవంతమైన గడ్డ అని, ఇక్కడి మేధావులు, విద్యావంతులు, యువకులు ఆలోచన చేయాలని, మంచి చేసే పార్టీని, నాయకున్ని ఎన్నుకోవాలని కోరారు.
కాంగ్రెస్‌ పనేందో తేలిపోయింది..
మొన్నటి ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు కలిపి మరో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పనితీరు ఏందో ఈ ఐదు నెలల కాలంలోనే తేలిపోయిం దని కేసీఆర్‌ అన్నారు. నోటికెన్ని వస్తే అన్ని వాగ్దానాలిచ్చి మోసం చేసిందన్నారు. కండ్లెదుటే కరెంటు పోతోందని, 365 రోజులూ సజీవ జలధారగా ఉన్న 200కిలోమీటర్ల గోదావరి ఎండిపోవడం, మిషన్‌భగీరథ నీళ్లు రాకపోవడం చూస్తుంటే ప్రజల కోపానికి ఈ పార్లమెంట్‌ ఎన్నికల తరువాత ఈ గవర్నమెంట్‌ ఉంటుందా? ఊడుతుందా? తేల్వకుండా ఉన్నదన్నారు. మహిళలకు ఆర్టీసీ ఫ్రీ స్కీమ్‌ చూస్తుంటే సర్కస్‌ ఆటలా మారిందని, మహిళలు జుట్టుపట్టుకుని కొట్లాడుకునే స్థితికి తెచ్చారని అన్నారు. రైతులకు ఏనాడూ కష్టం రాకుండా కంటికి రెప్పలా తాము కాపాడుకుంటూ వస్తే.. రేవంత్‌రెడ్డి సర్కారు వాళ్లను అష్టకష్టాలు పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్‌ సభలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ మహిళలకు రూ.2500 ఇస్తున్నామని చెప్పారని, ఎవరికైనా ఆ డబ్బులు అందాయా? అని ప్రశ్నించారు. ఇవన్నీ ప్రజలు గమనించాలని కోరారు. ఇప్పటికే తన సర్వేలో కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌ 8శాతం ముందంజలో ఉన్నారని, ఈనెల 13న ఇదే ఉత్సాహాన్ని చూపి బీఆర్‌ఎస్‌కు మంచి మెజార్టీ ఇచ్చి వినోద్‌ను పార్లమెంట్‌కు పంపాలని కోరారు. ఈ రోడ్‌షోలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్‌, పాడి కౌశిక్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌కుమార్‌ సహా పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Spread the love