నేటి నుంచి నామినేషన్లు

Nominations from today– రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ షురూ
– ఏర్పాట్లలో అధికారులు బిజీ బిజీ
– మే 13న రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌
– జూన్‌ 4న కౌంటింగ్‌
– మరింతగా పెరగనున్న పొలిటికల్‌ హీట్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటి నుంచి మొదలు కానుంది. గత నెలలో షెడ్యూల్‌ను ప్రకటించిన ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేయగానే ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. పార్లమెంట్‌తో పాటు పలు అసెంబ్లీలకు దేశ వ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 19న మొదలైన ప్రక్రియ జూన్‌ 1న ముగియనుంది. నాలుగో దశలో భాగంగా రాష్ట్రంలో మే 13న పోలింగ్‌ జరగనుంది. నామినేషన్లకు సంబంధించి రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఎన్నికకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆదివారం మినహా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఎంపీ అభ్యర్థులు కలెక్టర్‌ చాంబర్లో, ఎమ్మెల్యే అభ్యర్థులు ఆయా నియోజక వర్గాల్లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో దాఖలు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థితో పాటు మరో నలుగురిని మాత్రమే లోనికి అనుమతిస్తారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద 100 మీటర్ల లోపు 144 సెక్షన్‌ విధించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ఒక్కరి కదలికలను గమనించేందుకు ప్రతీ నామినేషన్‌ను వీడియో గ్రఫీ చేయనున్నారు.
పెరగనున్న పొలిటికల్‌ హీట్‌
గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుండటంతో రాష్ట్రంలో పొలిటికల్‌ హీట్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. సూటిపోటి మాటలు ఘాటైన విమర్శల నేపథ్యంలో ఇప్పటికే ఉద్వేగ భరితమైన వాతావరణం నెలకొంది. నేతలు తమ పార్టీ మ్యానిఫెస్టోలను ఏ కరువు పెడుతూనే ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేల్చుకుంటున్నారు.షెడ్యూల్‌ ప్రకటించినప్పటి నుంచి అభ్యర్థులు ఒకరిపైనొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. కాగా బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు మొత్తం 17 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్‌ మాత్రం 15 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్‌, ఖమ్మం, హైదరాబాద్‌ స్థానాల్లో నెలకొన్న పోటీ నేపథ్యంలో అక్కడ అభ్యర్థిత్వాలు ఓ కొలిక్కి రాలేదు. ఎప్పటిలాగే ఎంఐఎం హైదరాబాద్‌ స్థానం నుంచి ఆ పార్టీ అధినేత అసదుద్ధీన్‌ ఒవైసీ బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో సీపీఐ(ఎం) భువనగిరి స్థానం నుంచి బరిలో నిలిచింది. బూర్జువా పార్టీలకు భిన్నంగా ప్రచారం నిర్వహిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతోంది. డబ్బు, అధికారం, కులం, తదితర అంశాలు ప్రాతిపదికగా హౌరాహౌరీగా సాగుతున్న ప్రస్తుత ఎన్నికల సంగ్రామంలో ఓటర్లు ఎవరిని కనికరిస్తారో జూన్‌ 4న తేలనుంది.
ఎన్నికల షెడ్యూల్‌
నేటి నుంచి (గురువారం) నామినేషన్ల స్వీకరణ
ఈ నెల 25 నామినేషన్లకు చివరి రోజు
ఈ నెల 26 నామినేషన్ల పరిశీలన
ఈ నెల 29 ఉపసంహరణ గడువు
మే 13 పోలింగ్‌
జూన్‌ 4న ఫలితాల ప్రకటన

Spread the love