ఈదుల చెరువులో అక్రమ తవ్వకాలు ఆగేదెలా.?

– యథేచ్ఛగా అర్ధరాత్రి తరలుతున్న మట్టి
– పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ:మల్హర్ రావు:-
మండల కేంద్రమైనా తాడిచెర్లలోని ఈదుల చెరువులో అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అర్ధరాత్రి అక్రమ మట్టి యథేచ్ఛగా తరలిపోతుంది.అక్రమార్కులు ఈదుల చెరువును అడ్డాగా చేసుకొని జేసిబిలతో భారీగా తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.రైతుల పొలాల్లో వేయాల్సిన సారవంతమైన మట్టిని ఇండ్ల నిర్మాణాల్లో భాగంగా పునాదులకు,ఇతరత్రా అవసరాల కోసం అక్రమంగా మట్టిని తరలిస్తూ దర్జాగా మట్టి వ్యాపారం కొనసాగిస్తున్నారు.ఇంత జరుగుతున్న సంబంధించిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి..చెరువులో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు చర్యలు తీసుకోవాలని పలువురు అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి ఇదే చెరువులో గతంలో అడ్డుఅదుపు లేకుండా తవ్వకాలు చేపట్టడంతో చేపల వేటకు వెళ్లిన ఓ యువకుడు మృతి చెందిన విషయం విదితమే. గత వారం రోజులుగా జేసిబిలతో మట్టి తవ్వకాలు అడ్డు అదుపు లేకుండా మట్టి తవ్వకాలు చేస్తున్నారు.ఇలాగే చెరువులో భారీగా గోతులు తీస్తే భవిష్యత్ లో పశువులు,మత్స్యకారులకు గురైయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్రమ మట్టిదందాను ఆపేవారు లేరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Spread the love