‘జల్‌ జీవన్‌’ సక్రమ అమలుతో 4లక్షల మరణాల నివారణకు ఛాన్స్‌

డబ్ల్యుహెచ్‌ఓ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : జల్‌ జీవన్‌ మిషన్‌ (జెఎంఎం)తో దేశవ్యాప్తంగా పైపుల ద్వారా తాగునీటిని ప్రజలకు అందించినట్లైతే భారత్‌లో దాదాపు 4లక్షల డయేరియా మరణాలను నివారించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. ప్రతి ఇంటికీ పైపుల ద్వారా మంచినీరును అందించాలనే లక్ష్యంతో 2019లో దాదాపు 3.6లక్షల కోట్ల రూపాయిల వ్యయ అంచనాలతో కేంద్రం జల్‌ జీవన్‌ మిషన్‌ (జెజెఎం) ప్రారంభించింది. పైగా ఇలా తాగునీటిని కుళాయి కనెక్షన్ల ద్వారా అందించడం వల్ల కోటీ 40లక్షల డిఎఎల్‌వై (డిజెబిలిటీ అడ్జస్టెడ్‌ లైఫ్‌ ఇయర్స్‌)లను నివారించవచ్చని, పదివేల కోట్ల డాలర్లుకు పైగా మొత్తాన్ని ఆదా చేయవచ్చని, ప్రతి రోజూ మహిళలు నీటిని పట్టుకునేందుకు ఉపయోగించే సమయాన్ని 6.6కోట్ల గంటలను ఆదా చేయవచ్చని అధ్యయన వివరాలతో రూపొందించిన నివేదిక పేర్కొంది. డిఎఎల్‌వై అంటే పూర్తి స్థాయి ఆరోగ్యంతో కూడిన దాదాపు ఒక సంవత్సర కాలం నష్టానికి సమానం. ప్రజల్లో ఏదో ఒక వ్యాధి లేదా అనారోగ్య పరిస్థితి నెలకొన్న కేసులను లెక్కించడానికి, ముందస్తు మరణాల కారణంగా కోల్పోయిన జీవిత కాలాన్ని వైఎల్‌ఎల్‌ (ఇయర్స్‌ ఆఫ్‌ లైఫ్‌ లాస్ట్‌) గా, ఇయర్స్‌ లివ్‌డ్‌ విత్‌ ఎ డిజెబిలిటీ (వైఎల్‌డి)గా పేర్కొంటున్నారు. ప్రస్తుతం దేశంలో 12.3కోట్ల లేదా 62శాతం గ్రామీణ కుటుంబాలకు ఇళ్ళలో కుళాయి కనెక్షన్లు వున్నాయి. 2019లో ఈ పథకాన్ని ప్రారంభించిన సమయంలో ఈ సంఖ్య 3.2కోట్లుగా లేదా 16.6శాతంగా వుంది. 2024 నాటికి వందశాతం కుటుంబాలకు పైపుల ద్వారా తాగునీటిని అందించగలమని కేంద్రం చెబుతోంది. పూర్తి స్థాయిలో పనిచేసే కుళాయి కనెక్షన్‌ అంటే ఒక కుటుంబం ఏడాది పొడవునా రోజుకు సగటున 55లీటర్ల తాగు నీటిని పొందడంగా నిర్వచించింది. ప్రస్తుతమున్న స్థాయిలో పైపుల ద్వారా నీటిని అందించినట్లైతే నివారించగలిగే డయేరియా మరణాలను డబ్ల్యుహెచ్‌ఓ అధ్యయనం లెక్కించలేదని, అలాగే ప్రస్తుతం అందుబాటులో వున్న పైపుల ద్వారా తాగునీరు ఏ స్థాయిలో కలుషితమవుతోందో కూడా పరిగణనలోకి తీసుకోలేదని డబ్ల్యుహెచ్‌ఓకి చెందిన డాక్టర్‌, నివేదిక రూపకర్తల్లో ఒకరైనా రిక్‌ జాన్‌స్టన్‌ హిందూకు తెలిపారు. డబ్ల్యుహెచ్‌ఓ అధ్యయనమంటే ప్రస్తుతమున్న ధోరణులు ఇలాగే కొనసాగుతాయని భావించడం ద్వారా ఒక అంచనాకు లేదా నిర్ధారణకు రావడమేనని చెప్పారు. ఈ అంచనాలకు రావడానికి అవసరమైన డేటా కోసం నివేదిక రూపకర్తలు ఐక్యరాజ్య సమితి నుండి వచ్చిన జనాభా డేటాను, 2018 నాటి నేషనల్‌ శాంపిల్‌ సర్వేను, నీటి నాణ్యతపై జెజెఎం సేకరించిన డేటాను ఉపయోగించారు. ప్రస్తుతం ప్రతి రెండో ఇంటికి తాగునీటి కనెక్షన్‌ అందించబడింది. ఐదు రాష్ట్రాలు గుజరాత్‌, తెలంగాణా, గోవా, హర్యానా, పంజాబ్‌, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు అండమాన్‌ నికొబార్‌ దీవులు, డామన్‌ డయ్యూ, దాద్రా నాగర్‌ హవేలి, పుదుచ్చేరిల్లో వంద శాతమూ కనెక్షన్లు ఇచ్చారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో 98.87శాతం, బీహార్‌లో 96.3శాతం కనెక్షన్లు వున్నాయని తాగునీరు, పారిశుధ్య విభాగ కార్యదర్శి విన్నీ మహజన్‌ తెలిపారు. డబ్ల్యుహెచ్‌ఓ అధ్యయన నివేదికను విడుదల చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తాగునీరు, పారిశుధ్య రంగాల్లో పెట్టే పెట్టుబడుల వల్ల అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆర్థిక, పర్యావరణ ప్రయోజనాలతో పాటూ నాణ్యత గల జీవనం, ఆరోగ్యం లభిస్తుందన్నారు. పారిశుధ్య రంగంలో ఖర్చుపెట్టే ప్రతి రూపాయికి ఆరోగ్య సంరక్షణ వ్యయం రూపంలో 4.3 రూపాయిలు తగ్గడం ద్వారా లాభం వుంటుందని ఆమె వ్యాఖ్యానించారు.

Spread the love