– జిత్ రిటైర్‌మెంట్‌పై వ్యాఖ్యలపై శరద్ పవార్ స్పందన
ముంబయి : వయసు రీత్యా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలని అజిత్ పవార్ చేసిన ప్రకటనపై ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ స్పందించారు. తాను అలసిపోలేదు, పదవీ విరమణ చేయలేదని చెప్పారు. ”వయస్సుకి దీనికీ సంబంధం ఏమిటి? నేనూ అలసిపోలేదు.. రిటైర్డ్ కాలేదు. మొరార్జీ దేశారు ఏ వయసులో ప్రధాని అయ్యారో తెలుసా? ఇప్పుడు 70 ఏండ్లు దాటిన నాయకులు కూడా చాలా మంది ఉన్నారు. నాకు ప్రధాని కావాలనే ఆశయం లేదు. నేను ప్రజల కోసం పని చేయాలనుకుంటున్నాను’ అని శరద్ పవార్ అన్నారు. ”నన్ను పదవీ విరమణ చేయాలని చెప్పడానికి వారు ఎవరు? నేను ఇంకా పని చేయగలను”అని 83 ఏండ్ల శరద్ పవార్ తెలిపారు. అజిత్ పవార్ పక్షాన నిలిచిన ఛగన్ భుజబల్ నియోజకవర్గమైన యోలాలో తన ర్యాలీకి ముందు నాసిక్‌లో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
”నేటి పరిస్థితి నాకు కొత్త కాదు. 1980లో 58 మంది ఎమ్మెల్యేల్లో 52 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు. కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలతో పార్టీని నడిపించాను. మొదటి నుంచి పార్టీని ఎలా పునర్నిర్మించాలో నాకు తెలుసు. కుటుంబంలో చీలిక వచ్చిందని నేను నమ్మను. ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించడానికి నేను ఇక్కడ లేను” అని శరద్ పవార్ సీనియర్ అన్నారు. మహారాష్ట్ర వెలుపల కూడా ర్యాలీలు నిర్వహిస్తానని ఆయన ప్రకటించారు.