డీఆర్‌డీఓ శాస్త్రవేత్తపై ఏటీఎస్‌ ఛార్జిషీట్‌

– పాక్‌ స్పై ఏజెంట్‌తో లింక్‌
పూణె : భారత్‌కు చెందిన డీఆర్‌డీఓ శాస్త్రవేత్త ప్రదీప్‌ కురుల్కర్‌ మారుపేరుతో పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెంట్‌తో సంబంధాలు పెట్టుకుని భారత రక్షణ ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారమందించిన నేరానికి గాను అతనిపై మహారాష్ట్ర పోలీసులకు చెందిన యాంటీ టెర్రరిజం స్వాడ్‌ (ఏటీఎస్‌) గత వారం కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది. అధికారిక రహస్యాల చట్టం కింద మే 3న గూఢచర్యానికి పాల్పడినందుకు అతన్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.
కాగా, ప్రదీప్‌ కురుల్కర్‌ పూణెలోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) ల్యాబ్‌లలో ఒకదానికి డైరెక్టర్‌గా పనిచేశారు. ఇతను ‘దాస్‌ గుప్తా’గా పేరు మార్చుకుని వాట్సాప్‌ మెసేజ్‌లతోపాటు వీడియో కాల్స్‌ ద్వారా పాక్‌ ఇంటెలిజన్స్‌ ఏజెంట్‌ అయిన జరా అనే మహిళని సంప్రదించినట్టు ఏటీఎస్‌ ఛార్జిషీట్‌లో పేర్కొంది. దాస్‌ గుప్తా తాను సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌నని, తాను లండన్‌లో ఉంటున్నానని ఓ మహిళకు అసభ్యకర సందేశాలు, వీడియోలు పంపుతూ స్నేహం పెంచుకున్నాడు. అతను పంపిన మెసేజ్‌లు, వీడియోలు ఆ మహిళ ఐపి అడ్రస్‌ పాకిస్తాన్‌కు చెందినదని విచారణలో తేలిందని ఏటిఎస్‌ చార్జిషీట్‌లో పేర్కొంది. బ్రాహ్మౌస్‌ లాంచర్‌, డ్రోన్‌, యుసివి, అగ్ని క్షిపణి లాంచర్‌తోపాటు మిలటరీ బ్రిడ్జింగ్‌ సిస్టమ్‌కు సంబంధించిన రహస్య సమాచారాన్ని పొందేందుకు పాకిస్తాన్‌ ఏజెంట్‌ ప్రయత్నించినట్లు ఏటిఎస్‌ విచారణలో తేలింది. పాకిస్తాన్‌ మహిళా ఏజెంట్‌ జారా పట్ల ఆకర్షితుడై.. కురుల్కర్‌ తన ఫోన్‌లో భద్రపరచుకున్న రహస్య సమాచారాన్ని ఆమెకు పంపినట్లు ఏటిఎస్‌ ఛార్జిషీట్‌లో పేర్కొంది. వీరిద్దరూ జూన్‌ 2022 నుండి డిసెంబర్‌ 2022 వరకు కాంటాక్ట్‌లో ఉన్నారని ఏటిఎస్‌ తెలిపింది.

Spread the love