బీహార్‌లో కూలిన మరో వంతెన

పాట్నా:బీహార్‌లో శనివారం మరో వంతెన కూలిపోయింది. బీహార్‌లోని కతిహార్‌, కిషన్‌గంజ్‌ జిల్లాలను కలిపే ఈ వంతెన శనివారం కూలిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ వంతెన మేచి నదిపై నేషనల్‌ హైవే గోరి గ్రామం సమీపంలో నిర్మించబడింది. ఈ బ్రిడ్జిని జిఆర్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ అనే కంపెనీ నిర్మించింది. స్త్తంభాలు పాడైపోవడంతో బ్రిడ్జి కూలిపోయింది. ఈ ఘటనలో ఆరు పిల్లర్స్‌ నదిలో మునిగిపోయాయి. దీంతో బ్రిడ్జిపై వాహనాల రాకపోకల్ని జిల్లా యంత్రాంగం నిలిపివేసింది. వంతెనపై వెళ్లే వాహనదారుల్ని అడ్డుకునేందుకు బ్రిడ్జికిరువైపులా పోలీసు అధికారులు మోహరించారు.
కాగా, బీహార్‌లో బాగల్‌పూర్‌లో రూ. 1700 కోట్లకు పైగా నిధులతో నిర్మించిన నాలుగులైన్ల వంతెనను జూన్‌ 4వ తేదీన నిర్మాణ లోపాల కారణంతో అధికారులు కూల్చివేశారు. ఈ ఘటనపై నితీష్‌కుమార్‌ ప్రభుత్వంపై బిజెపి విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

Spread the love